Home Hyderabad Mukti Sangram వినాయక్‌రావు విద్యాలంకార్ ఇంటిలో సోదా (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-37)

వినాయక్‌రావు విద్యాలంకార్ ఇంటిలో సోదా (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-37)

0
SHARE

అది వాడుకలో కింబట్ హౌస్‌గా మారిపోయింది. ఆయన నివాస భవనంలో పోలీసులు అన్ని మూలలా సోదా జరిపారు. అంతకు పూర్వమే రావుగారు జాగ్రత్తపడి  పి.పి.సి పత్రాలను, అనేక సంపుటాలను తిరుమలగిరిలోని ఫోర్ట్‌లో ఉన్న భారత ప్రభుత్వపు ఏజంట్ జనరల్ శ్రీ కె.యం. మున్షీకి అప్పగించారు.

శ్రీ వినాయక్‌రావు విద్యాలంకార్‌ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. చంచల్‌గూడాలోని సెంట్రల్ జైలులోకి వెళ్ళగానే అంతకు పూర్వమే నిర్భంధించబడ్డ స్వామీ రామానందతీర్థ, రావుగారిని చూసి చివరికి మీరు కూడా వచ్చారన్నమాట అని అనగానే రావుగారు ఆత్మ విశ్వాసంతో ఇలా అన్నారు. “మీ అందరినీ విముక్తం చేయడానికి వచ్చాను”. ఆ తర్వాత 17 సెప్టెంబర్‌న పోలీసు చర్య తర్వాత రాజకీయ ఖైదీలనందరినీ విడుదల చేశారు. వినాయక్‌రావు విద్యాలంకార్ గురించి ఒకరు ఇలా వ్యాఖ్యానించారు. 1938లో ఆర్యసమాజ్ తరపున రావుగారు మూడువేల సత్యాగ్రహుల దళాన్ని తీసుకొని సంస్థానంలోకి ప్రవేశించగానే ఆనాడు నిజాం, ప్రజల కోరికలను అంగీకరించి మోకరిల్లాడు.

1948లో రావుగారిని అరెస్టు చేసిన మూడు రోజుల్లోగానే పోలీసు చర్య మొదలైంది. ఆజాద్ హైద్రాబాద్ శాశ్వతంగా అంతమైపోయింది. 13 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్ 1948 రాగానే నిజాం ఓటమి అంగీకరించాడు. 11 అక్టోబర్, 1948 నాడు తిరిగి కోర్టులకు హాజరవుతారని న్యాయవాదులంతా ప్రధాన న్యాయమూర్తికి మరో విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. పి.పి.సి సేకరించిన సమాచారం ఎనిమిది పెద్ద పెట్టెల్లో నిండిపోయింది. లాయక్ ఆలీ మంత్రివర్గానికి విరుద్ధంగా కేసు నడిపించే నిమిత్తం భారతీయ గూఢచారి విభాగం అధికారి నగర్‌వాలా ఆ మొత్తం రికార్డులను స్వాధీనం చేసుకున్నాడు. అమూల్యమైన ఆ చారిత్రక పత్రాలు ఈనాటికీ సురక్షితంగా ఉన్నాయో లేదో తెలియదు.

రజాకార్ల కాలంలో కాకతీయ మహానగరం
ఒక ఇంటి ఆవరణలో పంక్తిబద్ధంగా నిలుచుని ఉన్నారు స్వయం సేవకులు. “విజయీ విశ్వతిరంగా ప్యారా, ఝండా ఊంఛా రహే హమారా” అని పతాక వందనం చేస్తున్నారు. ప్రాణాలు ధారవోసి నీ గౌరవాన్ని కాపాడుతామని జెండాకు అభివాదం చేస్తూ గీతం ఆలాపిస్తున్నారు. ధ్వజగీతం సమాప్తం కాగానే ఆ ఉదయం “ఇన్‌క్విలాబ్ జిందాబాద్‌”, “భారత్ మాతాకీ జై”, “మహాత్మా గాంధీకీ జై” అనే నినాదాలతో అక్కడి కోటలోని ప్రశాంత వాతావరణం మార్మ్రోగింది. 4, ఆగస్టు 1946, ఆదివారంనాడు వరంగల్ కోటలోని ఉత్తర భాగాన ఈ పతాక వందనం జరుగుతూ ఉన్నది. నిజాం సామంతుల సంస్థానంలో వరంగల్ ముఠాలో ఈ విధంగా జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ స్వేచ్ఛాగీతాలు ఆలపించడం ఆనాడు ఎవరికైనా ఆశ్చర్యాన్ని గొలిపే అంశం.

స్వాతంత్య్రానికి పూర్వం అఖిల భారత కాంగ్రెసు సంస్థ సంస్థానాల పట్ల తటస్థ వైఖరి వహించింది. బ్రిటీషు పాలన క్రింద ఉన్న ప్రాంతాలలోని పార్టీతో సంబంధాలు నెలకొల్పుకుంది. హైద్రాబాద్‌లోని “స్టేట్ పీపుల్స్ కాన్ఫరెన్సు”ను కాంగ్రెసు సమర్థించేది. కాని సంస్థానంలో ప్రజలకు రాజకీయ స్వేచ్ఛ అనేది లేదు. ప్రజలు చైతన్యవంతులై ఎక్కడ ఎదురు తిరుగుతారో అని ప్రతి ఉద్యమాన్ని నిజాం మొగ్గలోనే త్రుంచి వేసేవాడు. ఎలాంటి రాజకీయ వేదకినైనా అభివృద్ధి చెందనిచ్చేవాడు కాదు.

అయినా పొరుగు రాష్ట్రాలలో జరుగుతున్న రాజకీయ సంచలనాన్ని చూసి ఈ సంస్థాన ప్రజలు ఉత్తేజం పొందేవాళ్ళు. రాజకీయ కార్యకలాపాలపై నిషేధం ఉన్న మూలాన ప్రజలు సాహిత్య, సాంస్కృతిక మత సంబంధమైన సంస్థలు స్థాపించుకున్నారు. పాలకవర్గం ఈ సామాజిక సంస్థలను కూడా విడివిడిగానే ఉండేట్టు చూసింది. ఆంధ్రసారస్వత మహాసభ, పరిషత్తు, మహారాష్ట్ర పరిషత్తు, కర్టాటక కాన్ఫరెన్సు అనే పేర్లతో సంస్థలు స్థాపించబడ్డాయి. సంస్థానం మొత్తంలో మతపరంగా ఆర్యసమాజ్ వ్యాపించి పోయింది. అయినా ఒక యువవర్గం, ఈ కార్యకలాపాలపట్ల తృప్తి చెందలేదు. సూటిగా రంగంలోకి దూకాలని ఈ యువకులు ప్రయత్నించారు.

తమ రాజకీయ ఆకాంక్షలను క్రియాన్వితం చేయాలనుకున్నారు. 1942 నాటి ‘క్విట్ ఇండియా’ ఆందోళనకు పూర్వమే వరంగల్‌లోని ఈ యువక వర్గం వ్యక్తి సత్యాగ్రహాలు జరిపింది. రాజకీయ దృష్టిలో సంస్థానం మొత్తం వరంగల్ రాజకీయ చైతన్యం గల ప్రాంతం అనిపించుకుంది. ఆనాడు వ్యక్తి సత్యాగ్రహాలు జరిపిన యువకులు యమ్.యస్.రాజలింగం, బి.రంగనాయకులు, కొమరగిరి నారాయణ రావులు. తర్వాత 1946లో వరంగల్‌లో ఒకటి రెండుచోట్ల ఈ యువకులు తమ కార్యకలాపాలు కొనసాగించారు.

Source: Vijaya Kranthi