దళితులు వేరు, క్రైస్తవులు వేరు. ఎందుకంటె క్రైస్తవ మతంలో కులాలు లేవు. అందువల్ల దళితులెవ్వరూ క్రైస్తవులు కాజాలరు. క్రైస్తవులు దళితులు కాజాలరు! కానీ ‘దళిత క్రైస్తవులు’ అన్న పదాలను కొందరు దుర్బుద్ధి పూర్వకంగాను, మరికొందరు అనాలోచితంగాను, అమాయకంగాను, అనభిజ్ఞతతోను ప్రచారం చేస్తున్నారు. దళితులు అనాదిగా హైందవ మతాలకు చెందినవారు. ఈ దేశంలో పుట్టి పెరిగిన మతాలన్నింటినీ హైందవ మతాలుగా భారత రాజ్యాంగం గుర్తిస్తోంది. ఇస్లాం, క్రైస్తవం ఈ దేశంలో పుట్టి పెరిగినవి కావు. ఈ మతాలు రెండూ విదేశాలలో అవతరించి మన దేశానికి వ్యాపించాయి. సర్వమత సమభావ వ్యవస్థ అనాదిగా జాతీయ స్వభావమైన మన దేశంలో ఈ రెండు మతాలవారు హాయిగా జీవిస్తుండడం చరిత్ర… భారత రాజ్యాంగం ఈ సత్యానికి ధ్రువీకరణ. కానీ దళిత క్రైస్తవులు – అన్న విచిత్రమైన పదాలు ప్రచారంలో కొనసాగుతున్నాయి. మన దేశంలో అనాదిగా కొనసాగుతున్న కుల మత వైవిధ్య సమాజ జాతీయ స్వభావానికి ఈ పదజాలం విరుద్ధం. అలాగే ఇస్లాం మతంలో ‘వెనుకబడిన కులాల’ను ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రయత్నం కూడ ఈ జాతీయ స్వభావానికి విరుద్ధం. తెలంగాణ ప్రభుత్వ నిర్వాహకులు మత ప్రాతిపదికపై ఇస్లాం మతస్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలోను విద్యాసంస్థలలోను ‘ఆరక్షణలు’- రిజర్వేషన్లు కల్పించడానికి ఉవ్విళ్లూరుతుండడానికి ఈ వైపరీత్యం నేపథ్యం! ఇస్లాం మతస్థుల సామాజిక ఆర్థిక విద్యాస్థితిగతులపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం జరిపించింది! జి.సుధీర్ అన్న ప్రభుత్వ మాజీ అధికారి అధ్యక్షతన అధ్యయనం జరిపిన ఈ ‘కమిషన్’వారు గత ఆగస్టులో నివేదికను సమర్పించారు. ఈ నివేదికపై రాష్ట్ర ‘వెనుకబడిన కులాల ఆధికారిక సంఘం’వారు- బి.సి. కమిషన్- వారు జనాభిప్రాయ సేకరణ జరపడమే విచిత్రమైన వ్యవహారం. వెనుకబడిన కులాలవారు హిందూ మతాలకు చెందినవారు. హిందూ మతాలలో మాత్రమే కులాలున్నాయి, ఇస్లాం మతంలో లేవు! క్రైస్తవాన్ని కాని, ఇస్లాంను కాని మరే మతాన్ని కాని రాజ్యాంగం వెనుకబడిన మతంగా గుర్తించడం లేదు గనుక ‘జి.సుధీర్ సంఘం’ వారి నివేదికను ‘బిసి కమిషన్’ పరిధిలో ఇరికించడమే రాజ్యాంగ విరుద్ధం… కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ రాజ్యాంగ వ్యతిరేక ప్రక్రియను కొనసాగిస్తోంది….
ఇస్లాం మతంలో కులాలు ఉన్నాయని చెప్పడం, క్రైస్తవులలో దళితులున్నారని చెప్పడం ఆ మతాలను అవమానించడం కాగలదు. హిందూ మతాలలోని దళితులకు లభిస్తున్న ఆరక్షణల-రిజర్వేషన్ల-ను, ఇతర సదుపాయాలను కాజేయాలన్న దుర్బుద్ధి లేని నిజమైన మతనిష్ఠకల క్రైస్తవులు, ఇస్లాం మతస్థులు ఈ వాస్తవాన్ని అంగీకరిస్తున్నారు. దళితులు హిందూ మతాలకు చెందిన అనుసూచిత కులాలవారు, అనుసూచిత వనవాసులు! ఈ కులాలవారు, తెగలవారు మతం మారినట్టయితే వారికి కులం ఉండదని ఈ దేశంలోని న్యాయస్థానాలు అనేకసార్లు తీర్పులు చెప్పాయి! క్రైస్తవ మతంలో కులాలు, దళితులు ఎలా ఉంటారని మదరాసు ఉన్నత న్యాయస్థానం 1980వ దశకంలోనే ప్రశ్నించింది. ఆ తరువాత అనేకసార్లు వివిధ ఉన్నత న్యాయస్థానాలవారు కూడ మత ప్రాతిపదికపై ‘రిజర్వేషన్ల’ను ఇవ్వడానికి వీలులేదని స్పష్టంచేసి ఉన్నాయి. ఇస్లాం, క్రైస్తవ మతాలలో కులాలు లేవని, హిందూ మతాల నుంచి ఇస్లాంలోకి క్రైస్తవంలోకి మారిన వారికి ‘కులం’ ఉండదని కూడ న్యాయస్థానాలు నిర్ధారించి ఉన్నాయి. 2013 జూన్ 24వ తేదీన మదరాసు ఉన్నత న్యాయస్థానం మరోసారి ఈ సంగతిని స్పష్టం చేసింది. ‘కుల భావం’లేని క్రైస్తవంలోకి కాని మరో మతంలోకి కాని మారినవారు తమ ‘పాత కులాన్ని’ కొనసాగించుకోవడానికి వీలులేదని గతంలో సర్వోన్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు – స్పష్టం చేసిన సంగతిని కూడ 2013నాటి తీర్పునిచ్చిన మదరాసు ఉన్నత న్యాయమూర్తి వి.రామసుబ్రహ్మణ్యన్ గుర్తుచేశాడు. 1952లో ఉమ్మడి మదరాసు రాష్ట్రం హైకోర్టు కూడ మతం మారిన వారు కులాన్ని కోల్పోతారని, వారిని ‘ఇతర తరగతి’- ఓసి-కి చెందిన వారుగా అంటే అభివృద్ధి చెందిన వారిగా పరిగణించారని స్పష్టం చేసింది. దళితులు క్రైస్తవంలోకి, ఇస్లాంలోకి మారినట్టయితే వారు దళిత హోదాను కోల్పోతారు. ఇస్లాం దళితులు, క్రైస్తవ దళితులు అందువల్ల లేరు. ఉన్నది ఒకే దళితులు…. వారు హిందూ మతాలకు చెందినవారు, అనుసూచిత కులాలవారు, వనవాసులు, వెనుకబడిన కులాలవారు!!
మత ప్రాతిపదికన రిజర్వేషన్లను కల్పించడంవల్ల నిజమైన దళితులకు, వెనుకబడిన తరగతుల వారికి అన్యాయం జరుగుతుంది! ఇప్పటికే దళితులకు వెనుకబడిన కులాలవారికి కేటాయించిన రిజర్వేషన్లను ఇతర సదుపాయాలను మతం మారినవారు, ఇతరులు కాజేశారు, కాజేస్తున్నారు. మళ్లీ మళ్లీ మత ప్రాతిపదికన ‘రిజర్వేషన్ల’ను కల్పించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది, నిరోధించింది! ఇస్లాం మతస్థులకు ఉద్యోగాలలోను విద్యాసంస్థలలోను ‘ఆరక్షణల’ను కల్పించడం 14వ, 15వ, 16వ అధికరణాల స్ఫూర్తికి విరుద్ధమన్నది ఈ న్యాయ నిర్ణయాల సారాంశం! అయినప్పటికీ తెలంగాణలోని ఇస్లాం మతస్థులకు పనె్నండు శాతం రిజర్వేషన్లను కల్పించి తీరుతామని ‘తెలంగాణ రాష్ట్ర సమితి’, తెలంగాణ ప్రభుత్వం ఎలా చెప్పగలుగుతున్నాయ? రాజ్యాంగం పరిధిలోని ‘రిజర్వేషన్ల’వంటి సదుపాయాలను ఇస్లాం మతస్థులకు కల్పించడం సాధ్యంకాదు కనుక రాజ్యాంగేతర- నాన్స్టాట్యుటరీ- సదుపాయాలను కల్పించనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది, కల్పించింది కూడ! దళితులకు లభిస్తున్న రాజ్యాంగేతర సదుపాయాలను మతం మారి క్రైస్తవులయిన వారికి కూడా వర్తింపచేస్తూ తెలంగాణ ప్రభుత్వం 2014లోనే ఉత్తర్వులు జారీచేసింది కూడ! ఇస్లాం మతస్థులు కాని, క్రైస్తవులు కాని ఒక సమష్టి ‘జన సముదాయం’గా వెనుకబడినవారు కాదు, దళితులు కాదు, సామాజిక ఆర్థిక దమనకాండకు బలిఅయిన చరిత్ర లేదు! అందువల్ల ఇలాంటి దమనకాండకు తరతరాలుగా బలైపోయిన అనుసూచిత కులాలు- షెడ్యూల్డ్ కాస్ట్స్-, అనుసూచిత వనజనులు- షెడ్యూల్డ్ ట్రయిబ్స్- పొందుతున్న ‘రాజ్యాంగేతర’ సదుపాయాలను అభివృద్ధి చెందిన ఇస్లాం, క్రైస్తవ మతాలవారు పొందవచ్చునా అన్నది వేరే ప్రశ్న. దీనివల్ల దళితులకు, వెనుకబడిన కులాల వారికి లభిస్తున్న ఆర్థిక సహాయంలో క్రైస్తవులు, ఇస్లాం మతస్థులు వాటాను పొందుతున్నారు. ఫలితంగా దళితుల వాటా, వెనుకబడిన కులాల ‘వాటా’ తగ్గిపోయింది. ఇదంతా పరోక్ష రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమం!
ఇస్లాం మతస్థులు, క్రైస్తవులు మన జాతీయ సమాజంలో భాగం. అందువల్ల మిగిలిన మతాలవారితో సమానంగా ఇస్లాం, క్రైస్తవ మతాల వారు సంక్షేమ, ప్రగతి ఫలాలను పొందడం న్యాయం. ఈ న్యాయం ఈ దేశంలో అనాదిగా వికసించి పరిఢవిల్లుతున్న హైందవ జాతీయ స్వభావం. అందువల్లనే 1947లో దేశ విభజన జరిగిన తరువాత పాకిస్తాన్లో ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థ ఏర్పడినప్పటికీ, అవశేష భారత్లో మాత్రం అనాది స్వభావానికి అనుగుణంగా సర్వమత సమభావ రాజ్యాంగ వ్యవస్థ కొనసాగుతోంది. అల్పసంఖ్యాకులైన ఇస్లాం మతస్థులు, క్రైస్తవులు అధిక సంఖ్యాక మతాలతో సమానంగా సుఖంగా జీవించగలగడం, తమ సంఖ్యను నిరంతరం పెంచుకొనడం ఈ హైందవ జాతీయ స్వభావం ప్రస్ఫుటిస్తోందన్న దానికి నిదర్శనం. అనాది హైందవ జాతీయ స్వభావం నశించిన పాకిస్తాన్లో అల్పసంఖ్యాకులు అణగారిపోయి అంతరించిపోతుండడం సమాంతర వాస్తవం. మన దేశంలో అల్పసంఖ్యాక మతాల ప్రజలు అధిక సంఖ్యాకులతో సమానంగా జీవించడమే కాక రాజ్యాంగపరంగా ప్రత్యేక సదుపాయాలను పొందుతున్నారు. అందువల్ల ఇస్లాం, క్రైస్తవ మతాల వారికి దళితుల, వెనుకబడిన కులాల సదుపాయాలలో ‘భాగం’ పంచి ఇవ్వడం అన్యాయం. దళితులు కాని వారికి దళితులు సమానంగా సదుపాయాలను కల్పించడం కూడ అన్యాయం.
తెలంగాణలో క్రీస్తుశకం 1323లో కాకతీయ సామ్రాజ్యాన్ని మోసంతో ధ్వంసం చేసిన ‘జిహాదీ’లు ఆ తరువాత ఆరువందల ఇరవై అయిదేళ్లపాటు 1948వరకు ఇస్లాం మతేతరులపై దమనకాండ సాగించారు. జిహాదీ, జిహాదీ స్వభావం నిండిన ఇస్లాం పాలకులు, వారి సైనికులు సాగించిన దమనకాండతో సాధారణ ఇస్లాం మతస్థులకు సంబంధం లేదు. కానీ ఈ దమనకాండకు అనాదిగా ఈ దేశంలో పుట్టిపెరిగిన హైందవ జాతీయులు బలైపోయారు. కాకతీయ సామ్రాజ్యం పతనమైన వెంటనే ‘‘గెలిచిన’’ ఇస్లాం జిహాదీలు తెలంగాణ అంతటా హిందువులను ఊచకోత కోశారు, ఆవులను బహిరంగంగా వీధులలో చిత్రవధ చేసి చంపారు, బహిరంగంగా ఆ మాంస ఖండాలను వండి ఆరగించారు! అబలలపై లైంగిక అత్యాచారాలు సాగించారు. హిందువులను ఇస్లాంలోకి మార్చారు. ఇదంతా జరిగిన ఆరువందల ఇరవై ఐదు ఏళ్లకాలంలో ఇస్లాం మతస్థులు పాలకులు! దమనకాండకు గురికానివారు, వెనుకబడని వారు ఇస్లాం మతస్థులు మాత్రమే! అందువల్ల ఒక సమష్టి జనసముదాయంగా ‘ఇస్లాం’ వెనుకబడి ఉందని భావించడం అన్యాయం. అతార్కికం! జి.సుధీర్ సంఘం అధ్యయన నివేదిక వెల్లడి అయినప్పటినుంచి తెలంగాణలో పనె్నండు శాతం ప్రభుత్వ ఉద్యోగాలను ఇస్లాం మతస్థులకు కట్టబెట్టాలన్నది జరుగుతున్న ప్రచారం. మత ప్రాతిపదికపై శాసనసభలకు ‘రిజర్వేషన్లు’ కల్పించడంవల్లనే 1947లో దేశం నుంచి ‘ఇస్లాం బాహుళ్య’ ప్రాంతం చీలిపోయింది! ఈ విభజన చరిత్రను పునరావృత్తం చేయడానికి ప్రభుత్వాలు పూనుకోరాదు!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004లో ఇస్లాం మతస్థులకు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్లను అదే సంవత్సరం సెప్టెంబర్లో హైకోర్టు రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్లీ రిజర్వేషన్ను కల్పిస్తూ జారీచేసిన ‘ఉత్తరువు’ను కూడ ఉన్నత న్యాయస్థానం 2005 నవంబర్లో రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పు చెప్పింది. ఆ తరువాత ‘రిజర్వేషన్ల’ను కల్పిస్తూ ఉమ్మడి రాష్ట్ర శాసనసభ చేసిన చట్టాన్ని కూడ హైకోర్టు 2010 ఫిబ్రవరిలో రద్దు చేసింది. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది… న్యాయ ధిక్కారం నేరం!
-హెబ్బార్ నాగేశ్వర్ రావు
(ఆంధ్ర భూమి సౌజన్యం తో )