Home Hyderabad Mukti Sangram రామస్వామి ఇంటిపై హంతకుల దాడి.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-39)

రామస్వామి ఇంటిపై హంతకుల దాడి.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-39)

0
SHARE

“ప్రాణాలు పోయినాసరే, గౌరవాన్ని కాపాడుతామనే పతాకగీతం అక్షరాలా సార్థకమైంది. ఆ ప్రాంతంలో కల్లోలం చెలరేగింది. హంతకులు మొగలయ్య అన్న రామస్వామి ఇంటిపై దాడిచేయడానికి వెళ్ళారు. రామస్వామి గడియ బిగించాలని ప్రయత్నిస్తుండగా బల్లెంతో ఒక్కపోటు పొడిచారు. ఆయన ముక్కు తెగింది. లోపలి వాళ్ళు నిరాయుధులు. అందరూ కలిసి తలుపులు బిగించారు. తలుపులు బద్ధలు చేయలేక వాళ్ళు కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయారు.

ఆసఫియా పాలనకు వ్యతిరేకంగా బానిసలు తిరుగుబాటు యత్నం చేయడమా? రాజకీయ చైతన్యాన్ని పెంచుకోవడమా? పైగా జెండా వందన చేస్తూ కవాతు జరపడం మజ్లీస్ సభ్యులకు మహానేరంగా తోచింది. మొగలయ్య ఇంటి దగ్గర ఇదంతా జరపడం వాళ్ళు సహించలేకపోయారు. ఫలితంగా మొగలయ్య హత్య జరిగింది. లకడీ పహిల్వాన్ నాయకత్వాన ముస్లిం దళం ఈ దాడి జరిపింది. కొన్ని ప్రాంతాలలో కల్లోలం చెలరేగింది. లకడి పహిల్వాన్‌ను ఉరేగింపుగా తీసుకెళ్ళిపోతున్నారు. “షాహె ఉస్మాన్ జిందాబాద్‌” అని నినాదాలిస్తున్నారు. కాఫిర్‌ను చంపి విజయం పొందిన వాడిలా లకడి పహిల్వాన్ కాశిం షరీఫ్ వరంగల్‌లో మహావీరుడై పోయాడు.

కాశిం షరీఫ్‌ను అభినందిస్తూ వచ్చిన ఊరేగింపు వరంగల్ కోట సింహద్వారం దగ్గరికి రాగానే సుబేదార్ హబీబుల్లాఖాన్ తన కారులో ఎదురు వచ్చాడు. స్వయంగా కాశిం షరీఫ్‌కు పూలమాలవేసి అభినందించారు. జిల్లాకు సర్వాధికారి లాంటివాడు స్వయంగా ఒక హంతకుణ్ణి బహిరంగంగా అభినందించడం జన సామాన్యంలో భయాందోళనలను రెచ్చగొట్టింది. ఖూనీ చేసినవాణ్ణి శిక్షించే బదులు ఇలా ప్రశంసించడం అందరికీ వణుకు పుట్టించింది. విషాదపూరితమైన వాతావరణం ఏర్పడింది. ఆంగ్లేయుల ఛత్రఛాయలో రాజ్యమేలుతున్న నిజాం పాలనా యంత్రాంగం ఎంత బాగా శాంతిభద్రతలను కాపాడుతూ ఉందో ఈ ఒక్క హత్యా సంఘటనయే నిరూపించగలదు.

లకడి పహిల్వాన్ ఊరేగింపు విజయోన్మాదంతో వరంగల్ టౌన్‌లోకి ప్రవేశించింది. రైల్వే గేటు దగ్గరికి రాగానే ముస్లింలు కొన్ని గుడిసెలకు నిప్పు అంటించారు. అప్పుడు అక్కడి హిందువులు ఎదురుదాడి జరిపి ఒకడి కాలు విరగగొట్టారు. కాలు విరగగానే ముస్లింలు కాలికి బుద్ధి చెప్పారు. మరుసటి రోజు ప్రతీకారంగా ముస్లింలు అక్కడి చిప్ప అప్పయ్య అనే వ్యక్తిని హత్య చేశారు. ఆ తర్వాత గూండాలు కలిసి రైల్వే గేటు బస్తీపై దాడి చేయాలని సన్నద్ధమయ్యారు.

అయితే బస్తాలోని హిందువులు ఆర్యసమాజ్ ప్రభావం వల్ల ఆత్మ రక్షణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇటిక్యాల మధుసూదన్ నాయకత్వం వాళ్ళకు బలాన్ని ఇచ్చింది. ముస్లిం గూండాలు దాడిచేస్తే ఎదురు దెబ్బలు తింటారని సుబేదార్ పసిగట్టాడు. సహాయంగా తుపాకులున్న పోలీసులను పంపించాలని ప్రయత్నం చేశాడు. సమయానికి పోలీసు బలగం అందుబాటులో లేదు. రాజీ జరుపుతానని హామీ ఇచ్చి ఒక్కరోజు గడిచిపోనిచ్చాడు. మరుసటి రోజు పోలీసు దళం రాగానే గూండాల దళాన్ని వెళ్ళి దాడి చేయమన్నాడు.

Source: Vijaya Kranthi