Home News సినిమా కథలను భారత చారిత్రక ఇతిహాసాల నుండి గ్రహించాలి – ఉమేష్ ఉపాధ్యాయ్

సినిమా కథలను భారత చారిత్రక ఇతిహాసాల నుండి గ్రహించాలి – ఉమేష్ ఉపాధ్యాయ్

0
SHARE

సమాచార భారతి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో రెండవ కాకతీయ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ప్రధానోత్సవాలు డిసెంబర్ 23 సాయంత్రం మాదాపూర్లోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ ప్రాంగణంలో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా పోటీలలో పాల్గొన్న ఉత్తమ లఘు చిత్రాలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రిలియన్స్ సంస్థల మీడియా విభాగం డైరెక్టర్ శ్రీ ఉమేష్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. భారతదేశం అనేక చారిత్రక కథా, కథనాలకు నిలయమని, ఒక సందేశాత్మక సినిమా నిర్మాణానికి కావాల్సిన కథల కోసం పాశ్చాత్య తత్త్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదని, భారతీయ చరిత్ర, ఇతిహాసాల్లోనే అది మనకు లభిస్తుందని తెలిపారు.

భారతీయ చిత్ర సాధన ముఖ్య కార్యదర్శి శ్రీ రాకేష్ మిట్టల్ మాట్లాడుతూ సందేశాత్మక చిత్రాల నిర్మాణాలకు ఆసక్తి చూపిస్తున్న కళాకారులను అభినందించారు. తమ రంగంలో మరింత నైపుణ్యత సాధించే దిశగా కృషి చేయాలని కోరారు.

కాకతీయ ఫిలిం ఫెస్టివల్ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు శ్రీ వినయ్ వర్మ మాట్లాడుతూ, సినీ దర్శకులు పుస్తకపఠనంపై శ్రద్ధ వహించాలని, అప్పుడే సినిమాలలో చూపించాల్సిన వాస్తవికతను తెలుసుకోవడానికి దోహదపడుతుందని సూచించారు. జ్యురీ సభ్యులు ఉషా తురగ మరియు రాహుల్ బామ్నియా కార్యక్రమంలో పాల్గొన్న దర్శకులకు తగిన సూచనలు, సలహాలు అందించారు.

డిసెంబర్ 22న జరిగిన ఉత్తమ చిత్రాల ఎంపికలో భాగంగా ఎంట్రీలకు అర్హత పొందిన 122 చిత్రాల్లో నాలుగింటిని ఎంపిక చేసి స్క్రీనింగ్ నిర్వహించారు. బహుమతి పొందిన చిత్రాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
– శ్రీ విజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ‘పారో’: ఉత్తమ లఘు చిత్రం
– శ్రీ బాలసాయి కార్తీక్ దర్శకత్వం వహించిన ‘రూపాయీ’: ఉత్తమ రెండవ లఘుచిత్రం
– శ్రీ ఆలాప్ తన్నాయి దర్శకత్వం వహించిన ‘బాపా ఆనే బాపూ’ ఉత్తమ మూడవ లఘుచిత్రం
– శ్రీ ముత్యాల శశిధర్ దర్శకత్వం వహించిన ‘సంవేదనా లాతూర్’ విశిష్ట లఘుచిత్రం అవార్డు అందుకుంది.

సమాచార భారతి అధ్యక్షులు డా. శ్రీ గోపాల్ రెడ్డి ప్రారంభోపన్యాసంతో మొదలైన కార్యక్రమాన్ని,  సంస్థ ముఖ్య కార్యదర్శి శ్రీ ఆయుష్ ధన్యవాదాలతో ముగించారు.