Home News గ్వాలియర్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు

గ్వాలియర్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు ఈ నెల 8 నుంచి మూడు రోజులపాటు గ్వాలియర్ లో జరుగుతాయి. ఈ సమావేశాల్లో వర్తమాన దేశ పరిస్థితులతోపాటు సామాజిక, ధార్మిక విషయాలపై కూలంకషమైన చర్చ జరుగుతుంది. అలాగే ముఖ్యమైన అంశాలపై తీర్మానాలు కూడా ప్రతినిధి సభ ఆమోదిస్తుంది. ఈ సమావేశాల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1400కు పైగా ప్రతినిధులు, ప్రముఖ కార్యకర్తలు పాల్గొంటారు.

సమావేశాల గురించి అఖిల భారత ప్రచార్ ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ పత్రిక ప్రతినిధులకు వివరాలు అందించారు. సంఘ వ్యవస్థ దృష్ట్యా ఉన్న 11 క్షేత్రాలు, 43 ప్రాంతాలకు చెందిన కార్యకారిణితో పాటు ఎన్నికైన కొందరు ప్రతినిధులు, విభాగ్ ప్రచారక్ లు, వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్న సంస్థల కేంద్ర ప్రతినిధులు సమావేశాల్లో పాల్గొంటారని ఆయన తెలియజేశారు.

పూజనీయ సర్ సంఘచాలక్ మాననీయ మోహన్ జీ భాగవత్ మార్గదర్శకత్వంలో, సర్ కార్యవహ మాననీయ భయ్యాజీ జోషి నిర్వహణలో ఈ సమావేశాలు జరుగుతాయని అరుణ్ కుమార్ తెలియజేశారు. సంఘ శిక్షవర్గతో పాటు వివిధ కార్యక్రమాల కోసం అఖిలభారత  అధికారుల పర్యటనల వార్షిక ప్రణాళిక ఇక్కడే తయారవుతుంది.

ఈ సమావేశాలు ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు జరుగుతాయని ఆయన తెలియజేశారు. కార్య విస్తరణ, గత ఏడాది కార్యక్రమాల సమీక్ష, కార్యదృఢీకరణ, రాబోయే ఏడాది కార్యక్రమాల గురించి విస్తృతమైన చర్చ ఈ సమావేశాల్లో జరుగుతుంది. మార్చ్ 8న ఉదయం 8.30గం.లకు పూజనీయ  సర్ సంఘచాలక్ మాననీయ మోహన్ జీ భాగవత్, సర్ కార్యవహ మాననీయ భయ్యాజీ జోషి లు సమావేశాలను ప్రారంభిస్తారు. సమావేశాలు మార్చ్ 10 వరకు జరుగుతాయి.

ఉగ్రవాద దాడులు, వాటికి ప్రతిగా వైమానిక దళం నిర్వహించిన దాడులు, రామ మందిరం, లోక్ సభ ఎన్నికలు మొదలైన ముఖ్యమైన అంశాలపై సమావేశాల ముగింపు కార్యక్రమంలో సర్ కార్యవహ జీ మాట్లాడతారని అరుణ్ కుమార్ తెలియజేశారు.  పత్రిక ప్రతినిధుల సమావేశంలో అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర ఠాకూర్, మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ శ్రీ నరేంద్ర జైన్ కూడా పాల్గొన్నారు.