సమాజం లో సమరసతా నిర్మాణం లో భాగంగా గత నాలుగు సంవత్సరాలుగా అందే గ్రామం (సిద్దిపేట జిల్లా)లో శివరాత్రి వేడుకలు మార్చ్ 4 న ఘనంగా జరిగాయి. సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో స్థానిక చేతన గ్రామీణ వికాస సేవా సమితి తో కలిసి గ్రామ రచ్చబండ వద్ద నిర్వహించిన ఉత్సవాలకు ఊరు ఊరంతా ఒక్క చోట కుల భేదాలు మరిచి కలవటం సంతోషాన్ని కలిగించింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు వ్యాస రచన పోటీలలో విజేతలకు మరియు అన్ని తరగతుల్లోని చదువులో ప్రతిభ ను ప్రదర్శిస్తున్న 15 మంది విద్యార్థులకు బహుమతులు అందజేయడం తో పాటు దేశ భక్తి పాటల ఆధారంగా నృత్య రూపకాలు రూపొందించారు. తడ్కపల్లి విద్యారణ్య ఆవాస విద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన ‘కిరాతార్జునీయం’ రూపకం గ్రామీణ కళలను గుర్తుకు తెచ్చింది.
శ్రీ శ్రీ శ్రీ విశోకానంద తీర్థ స్వామీజీ గ్రామం లోని 60 ఇళ్లలోకి వెళ్లి దీప ప్రజ్వలన గావించారు. హిందూ ధర్మంలో అంటరానితనానికి చోటు లేదని, అందరూ భగవత్ స్వరూపులేనని భావించినప్పుడే సమాజంలో సామరస్యం వెల్లివిరుస్తుందని స్వామీజీ జరిపిన పాదయాత్ర అన్ని వర్గాల ప్రజలను దగ్గరకు తెచ్చింది. పదేళ్ళ క్రితం గ్రామీణ కళలను ప్రదర్శించిన కళాకారులు 100 మంది ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ముఖ్య వక్త గా విచ్చేసిన ప్రముఖ కవి, రచయత డా.భాస్కర యోగి ప్రసంగం ఆద్యంతం గ్రామ ప్రజలను అలరించి, జాగృతమొనరిచింది.
శివ పార్వతుల కుటుంబంలో పరస్పర విరుద్దమైన శత్రువులు ఎద్దు,సింహం,ఎలుక,పాము, నెమలి,నిప్పు, గంగానది..ఇలా వున్నప్పటికీ, కలిసి జీవనం సాగించే విధానం అందరికీ అనుసరణీయమని, కుటుంబసభ్యుల మధ్య కలహాలను సృష్టించే టి వి సీరియల్స్, పాశ్చాత్య సంస్కృతి ని పెంచి పోషించే అశ్లీల పాటలు,నృత్యాలు నిజమైన ప్రేమ,అనుబంధాల నుండి దూరం చేస్తున్నాయి. కుల అహంకారం, అధికారం, కీర్తి కాంక్ష వల్ల ప్రజల మధ్య వివక్షత లు,అసమానతలు పెరిగిపోతున్న నేటి తరుణంలో శివరాత్రి వంటి పండుగలు ప్రజలు అన్యోన్యంగా జీవించటం నేర్పిస్తాయని డా. భాస్కర యోగి వివరించారు. గౌరవ అతిథిగా పాల్గొన్న సమరసతా వేదిక రాష్ట్ర సభ్యులు అజయ్ శర్మ మాట్లాడుతూ మిరుదొడ్డి గ్రామం లోని కులపెద్దలు అమ్మవారి ఉత్సవాల్లో కలిసి పాల్గొన్న సంఘటనలు వివరించారు. ప్రధానాచార్య శ్రీనివాస్, సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ పాల్గొన్నారు.
కార్యక్రమం లో నూతన గ్రామ సర్పంచ్ శంకర్,ఉప సర్పంచి,వార్డు సభ్యులకు సన్మానం చేసారు.చేతన సేవా సంస్థ సభ్యులు బొజాల నరేశ్ , మాట్ల సుమన్, జక్కుల మహేశ్,పొచయ్య, స్వామి, స్థానిక ఉపాధ్యాయులు తదితరులు కార్యక్రమ నిర్వహణ చేశారు.