Home News ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష ఆగదు – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌

ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్ష ఆగదు – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌

0
SHARE
ఇంటర్మీడియేట్ జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అవకతవకలపై, తదనంతర పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె. లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో నియంతృత్వంతో కూడిన నిర్లక్ష్య పాలన సాగుతోందని విమర్శించారు. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకల కారణంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ గత మూడు రోజులుగా నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న లక్ష్మణ్‌ బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశంపై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు దారణమన్నారు. గ్లోబరీనా సంస్థకు సంబంధిత టెండర్లు ఇవ్వడానికి గాక కారణాలు తెలియజేయాలని డిమాండ్ చేశారు.
ఈ అంశంలో ప్రభుత్వం దిగివచ్చే వరకు తన దీక్ష ఆగదని లక్ష్మణ్‌ స్పష్టం చేశారు. ఇంటర్‌ బోర్డు నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ గురువారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం బహిరంగ లేఖ విడుదల చేశారు.
నిమ్స్‌ ఆస్పత్రిలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్న లక్ష్మణ్‌ను బుధవారం పలువురు నేతలు, ప్రముఖులు పరామర్శించారు.
ఇంటర్‌బోర్డులో చోటుచేసుకున్న అవకతవకలపై ప్రభుత్వం వెంటనే హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అన్నారు. ఇంటర్‌ పరీక్షల జవాబు పత్రాలను కార్పొరేట్‌ కాలేజీల్లో ఫ్లోర్‌ మేనేజర్లతో దిద్దించినట్టు ఆయన ఆరోపించారు.