Home News ఉగ్రవాదంపై పోరులో భారత్ మరో ముందడుగు.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజార్ గుర్తింపు

ఉగ్రవాదంపై పోరులో భారత్ మరో ముందడుగు.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ అజార్ గుర్తింపు

0
SHARE
ఇస్లామిక్ ఉగ్రవాదంపై పోరులో భాగంగా భారత్ కీలక ముందడుగు వేసింది. ఇటీవల జరిగిన పుల్వామా దాడితో పాటు దేశంలో జరిగిన అనేక ఉగ్రవాద ఘటనల్లో ప్రమేయం ఉన్న కీలక సూత్రధారి, పాకిస్థాన్ కు చెందిన మసూద్ అజార్ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా భద్రతా మండలి విధించే ఆంక్షల జాబితాలో మసూద్ అజార్ పేరు చోటుచేసుకుంటుంది.
మసూద్ అజార్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అనేక ఏళ్లుగా భారత్ చేస్తున్న డిమాండ్ ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. ఈ విషయంలో కొంతకాలంగా అడ్డుపడుతున్న చైనా ఎట్టకేలకు వెనక్కి తగ్గడంతో భారత్ దౌత్యపరమైన విజయం సాధించింది.
14 ఫిబ్రవరి 2019 నాడు పుల్వామాలో సైనిక వాహనశ్రేణిపై జరిపిన దాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు మరణించారు. పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్ ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటన చేసింది. దీంతో అమెరికా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలు ఆ సంస్థ అధినేత మసూద్ అజార్ పై భద్రతా పరమైన ఆంక్షలు విధించాలన్న ప్రతిపాదనను తెరమీదకు తీసుకొచ్చాయి. కానీ సరిగ్గా అదే సమయంలో, ఆంక్షలు విధించడానికి ఒక్క రోజు ముందు చైనా ఈ వ్యవహారంపై అభ్యంతరం లేవనెత్తింది. ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడానికి తమకు మరింత గడువు కావాలని చైనా కోరడంతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది.
ఇటీవల భారత్ విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చైనాలో జరిపిన పర్యటనతో భారత్ కు దౌత్యపరమైన విజయం లభించింది. ఈ పర్యటనలో విజయ్ గోఖలే, భారతదేశంలో ఉగ్రవాద దాడుల వెనుక జైష్-ఏ-మహ్మద్ సంస్థ మరియు దాని అధినేత మసూద్ అజార్ పత్రాలపై స్పష్టమైన సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో చైనా ఈ వ్యవహారంలో సానుకూలంగా స్పందించింది.
తాజాగా మసూద్ అజార్ ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడంపై బ్రిటన్ తదితర దేశాలు హర్షం వ్యక్తం చేశాయి.
Source: DNA India