Home News ఆదిశంకరుల వ్యవస్థానైపుణ్యం

ఆదిశంకరుల వ్యవస్థానైపుణ్యం

0
SHARE


– సత్యదేవ

దేశరాజకీయాలు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, దార్శనికులు, మతప్రచారకులు దేశంలో అశాంతికి కారణమవుతున్నప్పుడు, భారతీయ సంప్రదాయానికి ఆధారమైన వైదిక వాజ్ఞ్మయాన్ని సరిగా అధ్యయనం చేసేవారు, వ్యాఖ్యానించే వారు చాలా తక్కువగా ఉన్నప్పుడు శంకరభగవత్పాదులు జన్మించారు. ప్రజల్లో ధార్మికనిష్టను పెంపొందించడానికి నాలుగు మఠాలను స్థాపించారు.

ఆదిశంకరులు దేశం నలుమూలలా స్థాపించిన నాలుగు మఠాలనే చతుర్ధామాలు, మఠామ్నాయాలు అని అంటారు. ఈ చతుర్ధామ స్థాపన ఆదిశంకరుల వ్యవస్థానైపుణ్యానికి, కార్యదక్షతకూ ఉదాహరణ. హిందూధర్మాన్ని పునరుజ్జీవింప చేయడానికి, సుస్థిరం చేయడానికి, వ్యాప్తి చేయడానికి కేంద్రాలుగా పనిచేసే ఈ నాలుగు మఠాల నిర్వహణ సూత్రాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. 

చతుర్ధామాల నిరంతర నిర్వహణ కోసం శంకరులు మఠామ్నాయం, మహానుశాసనం అనే రెండు నిర్వహణ పద్ధతుల్ని ప్రవేశపెట్టారు. ఇవి ఆధునిక కాలంలో కంపెనీలను స్థాపించడానికి రూపొందించే మెమోరాండం ఆఫ్‌ అసోసియేషన్‌, ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌ అనే రెండు ప్రధాన పత్రాలవంటివి. మొదటిది సంస్థ అంతర్గత నిర్వహణకు సంబంధించినదికాగా, రెండవది, సంస్థకు బయటి ప్రపంచంతో సంబంధాన్ని వివరిస్తుంది. మఠామ్నాయంలో పీఠనియమాలు, నిర్వహణ, పీఠం ప్రత్యేకంగా వ్యాప్తి చేయవలసిన ధార్మిక అంశాలు, పీఠపు అంకితనామం, ప్రత్యేకంగా పఠించాల్సిన వేదం, మహావాక్యం, దేవత, శక్తి, తీర్థం, క్షేత్రం, బ్రహ్మచారినామం, యోగపట్టం(సన్యాసి పేరు చివర ఉండేది), కార్యక్షేత్రం మొదలైనవి నిర్దేశించారు. మహానుశాసనంలో పీఠాధిపతుల వ్యవహారిక వ్యవస్థ పేర్కొన్నారు.

ద్వారకా పీఠంః శంకరులు మొట్టమొదట స్థాపించిన పీఠం ఇది. దీనిని మొదట శారదాపీఠమని అన్నారు. భూతదయతో కీటకాలు మొదలైనవాటిని హింసించకుండా ఉండే కీటవార సంప్రదాయానికి చెందిన పీఠం. మఠసన్యాసుల పేర్ల చివర ‘తీర్థ’ అనిగానీ, ‘ఆశ్రమ’ అనిగాని పెట్టుకుంటారు. పీఠానికి క్షేత్రం ద్వారక, దేవత సిద్ధేశ్వరుడు, పీఠశక్తి భద్రకాళి. తీర్థం గోమతి. ఇక్కడ ‘స్వరూపులు’ అనే సన్యాసులు సామవేదాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేస్తారు. ‘తత్త్వమసి’ అనేది పీఠపు మహావాక్యం. సింధు, సౌవీర, సౌరాష్ట్ర, మహారాష్ట్రలు, వాటి మధ్యఉన్న పశ్చిమప్రాంతం ఈ మఠపరిధిలోకి వస్తుంది. 

జ్యోతిర్మఠంః ఉత్తరాన బదరికాశ్రమం ప్రాంతంలో ఉంది. దీన్నే ఉత్తర ఆమ్నాయ మఠమని, శ్రీమఠమని కూడా అంటారు. మానవులను విషయలోలత నుంచి మళ్ళించి నిజమైన ఆనందానికి మార్గం చూపే ఆనందవార సంప్రదాయానికి చెందినది ఈ మఠం. 

ఇక్కడ సన్యాసులు గిరి, పర్వత, సాగర అనే పట్టనామాల్లో ఒకదానిని గ్రహించవచ్చును (పెట్టుకోవచ్చును). మఠక్షేత్రం బదరికాశ్రమం. దేవత నారాయణుడు. శక్తి పూర్ణగిరి. తీర్థం అలకానంద. బ్రహ్మచారులను ‘ఆనందుడు’ అంటారు. ‘అయమాత్మా బ్రహ్మ’ అనేది వీరి మహావాక్యం. ఈ మఠంలో అథర్వవేదాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేస్తారు. మరు(రాజస్థాన్‌), కాశ్మీర, కాంభోజ(ఆఫ్గనిస్తాన్‌ తూర్పు, ఉత్తర ప్రాంతాలు), పాంచాల(రోహిల్ఖండ్‌-ఢిల్లీకి ఉత్తరాన, పశ్చిమానగల ప్రాంతాలు) ఈ మఠపరిధిలోకి వస్తాయి.

గోవర్థన మఠంః దీనినే పూర్వమ్నాయమని అంటారు. ఇది దేశానికి తూర్పున ఉన్న పూరీ(పురీ) పట్టణంలో ఉంది. ఈ మఠం ప్రజల్ని భోగలాలసత్వం నుంచి వారించి, ఉన్నత లక్ష్యాలవైపు మళ్ళించే భోగవార సంప్రదాయానికి చెందినది. సన్యాసులు ‘వన’, ‘అరణ్య’ అనే యోగపట్టాలను ధరిస్తారు. మఠక్షేత్రం పురుషోత్తమం, దేవత జగన్నాధుడు, శక్తి విమల. తీర్థం మహోదధి. బ్రహ్మచారులను ‘ప్రకాశకులు’ అని వ్యవహరిస్తారు. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ మహావాక్యం. ఇక్కడ ఋగ్వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేస్తారు. అంగ, వంగ, కళింగ ప్రాంతాలు ఈ మఠపరిధిలోకి వస్తాయి.

శృంగేరీ మఠంః దీనిని దక్షిణామ్నాయ మఠమని అంటారు కర్నాటక రాష్ట్రంలోని శృంగేరి (శృంగ లేక ఋష్యశృంగగిరి)లో ఈ మఠం స్థాపించారు. ప్రజల్ని ధన వ్యామోహం నుంచి వారించే భూరి (బంగారం) వార సంప్రదాయానికి చెందినది. ఈ మఠ సన్యాసులు పది యోగపట్టములలో దేనినైనా స్వీకరించవచ్చును.  క్షేత్రం రామేశ్వరం, దేవత వరాహుడు. శక్తి శ్రీశారదాదేవి. తీర్థం తుంగభద్ర. బ్రహ్మచారులను ‘చైతన్యులు’ అని పిలుస్తారు. ‘అహం బ్రహ్మాస్మి’ అన్నది మహావాక్యం. యజుర్వేదాన్ని అధ్యయనం చేస్తారు. ఆంధ్ర, కర్ణాటక, ద్రవిడ, కేరళ ప్రాంతాలు మఠపరిధిలోకి వస్తాయి.

ఈ నాలుగు మఠాలతోపాటు ఆదిశంకరులు స్థాపించినదే కంచిలోని కామకోటి పీఠం. ఇక్కడి ఆచార్యుల పట్టనామం ‘ఇంద్రసరస్వతి’. అందుకనే పీఠాధిపతులకు శ్రీ చంద్రశేఖర ఇంద్రసరస్వతి, శ్రీ జయ ఇంద్రసరస్వతి, శ్రీ విజయ ఇంద్రసరస్వతి మొదలైన పేర్లు ఉంటాయి. పీఠదేవత కామాక్షీదేవి. క్రీ.పూ 5వ శతాబ్దం నుంచి శంకరాచార్యుల ప్రధానశిష్యుల్లో ఒకరైన సురేశ్వరాచార్యులతో ప్రారంభించి ఇప్పటివరకూ పీఠాధిపతుల వివరాలు కంచి మఠంలో ఉన్నాయి.