ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల ఉన్నతి కోసం మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ ఎంతో కృషి చేశారు. వారి కోసం గురుకుల విద్యాలయాలు స్థాపించడానికి ఎంతో శ్రమించారు. ఆ గురుకులాల ద్వారా విద్యార్ధులను తీర్చిదిద్దడానికి చక్కని వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఎంతో చొరవ, శ్రద్ధా తీసుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణ సాంఘిక సంక్షేమ ఆవాస విద్యాలయాల సంస్థ, తెలంగాణ గిరిజన సంక్షేమ ఆవాస విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా ఐపిఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈ విద్యా సంస్థలు దారి తప్పాయి. విద్యార్ధులకు చదువుతో పాటు దేశం, ధర్మాన్ని గురించిన సంస్కారాలను అందించవలసిన ఈ విద్యాలయాలు అవినీతికి, అక్రమాలకు నిలయాలయ్యాయి. మతమార్పిడి కేంద్రాలయ్యాయి. `స్వారోస్’ పేరున బినామీ సంస్థను ప్రారంభించిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, దీని ద్వారా తన సొంత ఎజెండాను అమలు చేస్తున్నారని జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆరోపిస్తోంది. రాష్ట్ర గవర్నర్ కు సమర్పించిన వినతిపత్రంలో స్వారోస్ ఆగడాలను సమితి వివరించింది.
ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి గవర్నర్ కు సమర్పించిన స్వేరో ఆగడాల చిట్టా ఇదీ!:
స్వేరో అనే సంస్థను స్థాపించి తద్వారా వెనుకబడిన సామాజిక వర్గాలలో సమాజ, ధర్మ వ్యతిరేక భావాలు నింపడం గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర గురుకులాల కార్యదర్శిగా ఉన్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఇది సాగుతోంది. మూడు సంవత్సరాల కాల వ్యవధి ముగిసినా ఇంకా అదే బాధ్యత లో గత ఏడు సంవత్సరాలుగా కొనసాగుతూ ఇటువంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ గీతాలాపనకి బదులుగా స్వేరో గీతాన్ని మరియు స్వేరో ప్రతిజ్ఞని ప్రవేశపెడుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న వసతి గృహాలలో విద్యార్థినీ, విద్యార్థులలో దేశవ్యతిరేక భావజాలాన్ని నింపుతున్నారు. కాగా వీటి నిర్వహణ కోసం తన సొంత కుటుంబ సభ్యులని నియమించి, ప్రభుత్వం కేటాయించిన నిధులను మళ్లించి దుర్వినియోగం చేస్తున్నారు. బాలికా వసతి గృహాలలో పలు లైంగిక వేధింపు సంఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం. వీటి మీద పలు కేసులు కూడా నమోదయ్యాయి.
ఎస్టి గురుకులల్లో సంత్ సేవాలాల్ చిత్రపటాలను తొలగించడం, నమస్కారానికి బదులు జయ్ భీమ్ అని పలికించడం, జిల్లాల్లో స్వేరో కమిటీలు నియమించి వాటి ద్వారా ప్రభుత్వ పాఠశాలలను తమ ఆధీనంలో ఉంచుకుంటూ తమతో సహకరించవలసిందిగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. క్రిస్మస్ వంటి రోజులలో తమ స్వేరో వ్యక్తులే ప్రార్థనలు చేయిస్తారని ఆ విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆదేశిస్తున్నారు. అంతే కాక దీపావళి,దసరా,బతుకమ్మ వంటి పండుగలను తిరస్కరించే విధంగా విద్యార్థులలో వ్యతిరేక భావాలను నింపుతున్నారు . జిగ్నేశ్ మెవానితో కలిసి మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారిని మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నారు . కంచ ఐలయ్య వంటి వాళ్ళతో సంబంధాలు కొనసాగిస్తూ “అర్బన్ నక్సలిజాన్ని “ ప్రవీణ్ కుమార్ ప్రోత్సహిస్తున్నారు. సైనిక పాఠశాలను ఏర్పాటు చేయించి అందులోకి తమ అనుకూల భావజాలం ఉన్న విద్యార్థులను పంపడం ద్వారా సైన్యంలో దేశ వ్యతిరేక భావజాల విత్తనాన్ని నాటే ప్రయత్నం చేస్తున్నారు. భీమ్ దీక్షను తీసుకోవలసిందిగా విద్యార్థులని బెదిరించడం, హిందూ పండుగలని , సంస్కృతిని ద్వేషించడం, ఆ ద్వేషాన్ని వ్యాప్తి చెయ్యడం స్వేరోల ముఖ్య లక్ష్యాలు. వీటికోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, నిధులని ఉపయోగిస్తున్నారు. ఈ తరహా కార్యకలాపాలు సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తాయి కనుక ప్రభుత్వం వెంటనే వీటికి అడ్డుకట్ట వేయాలి. ఒక బాధ్యతగల పదవిలో ఉంటూ దేశవ్యతిరేక కార్యకలాపాలకు , ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పైన తగు చర్యలు తీసుకోవాలి. సైనిక పాఠశాలను తగు నియమాలను అనుసరించి భారత దేశ సార్వభౌమత్వాన్ని దృష్టిలో ఉంచుకొని హిందూ సంస్కృతి విలువలను కాపాడుతూ ఏర్పాటు చేయాలని ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తన వినతి పత్రంలో పేర్కొంది.