Home News ఎస్సీ జాతీయ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కర్నె శ్రీశైలంపై దాడి

ఎస్సీ జాతీయ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కర్నె శ్రీశైలంపై దాడి

0
SHARE
శ్రీ కర్నే శ్రీశైలం

ఎస్సీ జాతీయ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కర్నె శ్రీశైలంపై దాడి జరిగింది. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్బులో ఈ రోజు విలేకరుల సమావేశం జరుగుతుండగా కొందరు దుండగులు హఠాత్తుగా కర్నె శ్రీశైలంపై దాడికి తెగబడ్డారు. ఘటనకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. 

అసలేం జరిగింది?
ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలోని స్వేరోస్ సంస్థ నిర్వహణలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గతకొంతకాలంగా అవినీతి అక్రమాలు  చోటుచేసుకుంటున్నాయంటూ ఎస్సీ జాతీయ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో మే 20వ తేదీన సంస్థ అధ్యక్షులు కర్నె శ్రీశైలం అధ్యక్షతన వారి బృందం గవర్నర్  నరసింహన్ ను కలిసి గురుకులాల్లో జరుగుతున్న అక్రమాలపై చర్య తీసుకోవాల్సిందిగా వినతి పత్రం అందజేశారు.

అనంతరం ఈ  రోజు (మే 21) కర్నె శ్రీశైలం అధ్యక్షతన సోమాజీగూడ ప్రెస్ క్లబ్బులో ఇదే విషయమై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం మొదలవ్వగానే హఠాత్తుగా కొందరు వ్యక్తులు కర్నె శ్రీశైలం మరియు ఇతర సభ్యులపై దాడికి తెగబడ్డారు. మీడియా సంస్థల మైక్ లను ధ్వంసం చేయడమేకాక దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన మీడియా ప్రతినిధులపై కూడా దుండగులు తిరగబడ్డారు. అనుమతి లేకుండా ప్రెస్ క్లబ్ లోకి ప్రవేశించడమే కాకుండా మీడియా సమావేశం నిర్వహిస్తున్న వారిపై దాడిచేసి, సజావుగా, శాతియుతంగా జరుగుతున్న సమావేశాన్ని భగ్నం చేసిన దుండగులపై కేసు నమోదు చేయాలంటూ ప్రెస్ క్లబ్ మేనేజర్ తోపాటు రిజర్వేషన్ పరిరక్షణ సమితి ప్రతినిధులు కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

దాడి వెనుక ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రమేయం: కర్నె శ్రీశైలం 

సోమాజిగూడ ప్రెస్ క్లబ్బులో తనపై విచక్షణారహితంగా జరిగిన దాడి వెనుక ఐపీఎస్ అధికారి, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రమేయముందని ఎస్సీ జాతీయ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కర్నె శ్రీశైలం పేర్కొన్నారు. గురుకులాల్లో ప్రవీణ్ కుమార్ కు చెందిన స్వేరోస్ సంస్థ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తున్నందుకే ఈ దాడి జరిగిందని ఆయన తెలిపారు.

బౌద్ధం పేరిట ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గురుకులాల్లోని విద్యార్థుల మనసు కలుషితం చేస్తూ, సంస్కృతీ సాంప్రదాయాలకు దూరం చేస్తున్నారని అన్నారు. తనపై జరిగిన హత్యాయత్నంలో ప్రమేయం ఉన్న ప్రవీణ్ కుమార్ మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో జరుగుతున్న అవినీతిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని  కర్నె శ్రీశైలం కోరారు. ఈ వ్యవహారంపై తాము న్యూఢిల్లీలో కూడా ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కర్నె శ్రీశైలం తెలిపారు.  


స్వేరోల ఆగడాలపై నిన్న గవర్నర్ కు వినతిపత్రం సమర్పించిన రిజర్వేషన్ పరిరక్షణ సమితి