Home News ప్లాస్టిక్ వ్యర్ధాలే ఆ పాఠశాల ఫీజు

ప్లాస్టిక్ వ్యర్ధాలే ఆ పాఠశాల ఫీజు

0
SHARE

ఓ వైపు పిల్లలందరికీ అందుబాటులో విలువైన విద్య.. మరోవైపు విద్యార్థులకు, గ్రామస్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన.. ఇందుకోసం వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది అసోంలోని పాఠశాల. పాఠశాల ఫీజుగా డబ్బు స్థానంలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్ధాలను స్వీకరించడం మొదలుపెట్టింది. 

2013లో ఓ స్కూల్ ప్రాజెక్ట్ కోసం న్యూయార్క్ నుంచి భారతదేశానికి వచ్చిన మంజీని, టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) సోషల్ వర్క్ స్టూడెంట్ ప్రతిమ శర్మతో కలిసి మూడేళ్లపాటు శ్రమించి 2016లో అసోంలో ‘అక్షర్’ అనే పాఠశాలను ప్రారంభించారు. చలికాలంలో అసోం గ్రామాల్లోని ప్రజలు చలి నుండి రక్షించుకోవడానికి ప్లాస్టిక్ వ్యర్ధాలను మండించడం, తద్వారా ఆరోగ్యానికి పొంచివున్న ముప్పును గ్రహించాడు మంజీని ముక్తార్.

దీంతో ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని వారు నిర్ణయించుకున్నారు. దీంతో వారిలో సరికొత్త ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనకు ఆచరణ రూపమే ‘ఫీజుగా ప్లాస్టిక్ వ్యర్ధాలు”

అసోంలోని పామోహీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రయివేటు పాఠశాలలో చదువు ఉచితం. డబ్బుకు బదులుగా వారానికి 25 ప్లాస్టిక్ వ్యర్ధాలను ఫీజుగా చెల్లిస్తే చాలు. ఆ ప్లాస్టిక్ వ్యర్ధాలను ఎలా రీసైకిల్ చేయాలో కూడా ఆ పిల్లలకు నేర్పించడం ఈ పాఠశాల ప్రత్యేకత. 

దీనిపై మంజీన్ మాట్లాడుతూ ‘‘ఇక్కడ చాలామంది పిల్లలు పనులు చేస్తూ ఇంటికి ఆధారంగా ఉన్నారు. దీంతో, వారిని స్కూల్‌కు పంపించాలని కోరడం పెద్ద సవాలుగా ఉండేది. ఇక్కడి పిల్లలంతా క్వారీల్లో దయనీయ పరిస్థితుల మధ్య పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఉండేలా స్కూల్ నిబంధనలను రూపొందించాం. ప్లాస్టిక్ వ్యవర్థాలను నిర్మాణ సామాగ్రి మార్చేలా రీసైకిలింగ్ విధానాన్ని గ్రామస్థులకు నేర్పించాం. ప్లాస్టిక్ వ్యర్థాలను స్కూల్‌కు తీసుకురావాలని పిల్లలను కోరాం. మొదట్లో ఈ స్కూల్‌లో 20 మంది విద్యార్థులే ఉండేవారు. ఇప్పుడు వారి సంఖ్య 100కు చేరింది’’ అని తెలిపారు.