Home News హైదరాబాదులో కరుడుగట్టిన మావోయిస్టు దంపతుల అరెస్ట్

హైదరాబాదులో కరుడుగట్టిన మావోయిస్టు దంపతుల అరెస్ట్

0
SHARE

మావోయిస్టు పార్టీకి చెందిన కీలక సభ్యులను పోలీసులు హైద్రాబాద్లో అరెస్ట్ చేసినట్టు డెక్కన్ క్రానికల్ కధనం ప్రచురించింది. గతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భద్రతా దళాలపై బాంబు దాడులు పాల్పడటంతో పాటు దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మండవి హత్య వంటి వివిధ ఘటనల్లో కీలక పాత్ర పోషించిన మహిళా మావోయిస్టు ఆలూరి కృష్ణ కుమారి అలియాస్ సుజాతక్క అలియాస్ నర్మదతో పాటు, ఆమె భర్త కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ దాదాను మహారాష్ట్ర పోలీసులు సికిందరాబాదులో అరెస్ట్ చేసారు.
గత 26 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న వీరిరువురిపైనా 20 లక్షల చొప్పున రివార్డ్ ఉంది. ప్రస్తుతం వీరిద్దరూ మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యులు కాగా త్వరలోనే కేంద్ర కమిటీకి బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. 
DC కధనం ప్రకారం అరెస్ట్ అయిన కృష్ణకుమారి వయసు 60 సంవత్సరాలు. ఆంధ్రప్రదేశ్లోని గుడివాడ ప్రాంతానికి చెందిన కృష్ణకుమారి గెరిల్లా యుద్ధతంత్రంలో నిపుణురాలు. ఛత్తీస్ఘడ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జరిగిన పలు కీలక మావోయిస్టు దాడుల వెనుక కీలక పాత్ర పోషించింది. 
ఆమె భర్త, విజయవాడకు చెందిన 63 ఏళ్ల కిరణ్ కుమార్ గత 28 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటున్నాడు. వయసుకు సంబంధం లేకుండా వీరిరువురూ మావోయిస్టు వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ మావోయిస్టు కేంద్ర సభ్యులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్టు పోలీసులు తెలియజేసారు. క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘం కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్న కృష్ణకుమారి, దండకారణ్యం ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను పర్యవేక్షిస్తోంది. 
మావోయిస్టు టెక్నీకల్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న కిరణ్ కుమార్, మీడియా వ్యవహారాలు, మావో సైద్ధాంతిక వ్యాప్తి వంటి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నాడు. 
గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వీరిరువురూ హైదరాబాదులోని అనేక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Source: Deccan Chronicle