Home News వెయ్యేళ్ళ పురాతన హిందూ దేవాలయాన్ని తెరచిన పాకిస్తాన్

వెయ్యేళ్ళ పురాతన హిందూ దేవాలయాన్ని తెరచిన పాకిస్తాన్

0
SHARE

దేశ విభజన తర్వాత స్థానిక హిందువుల కోరిక మేరకు పాకిస్తాన్ ప్రభుత్వం వెయ్యేళ్ళ నాటి పురాతన హిందూ దేవాలయాన్ని పూజాదికాల కోసం తెరిచింది.

సియాల్ కోట్ పట్టణంలో ధారావాల్ ప్రాంతంలోని ఈ షావ్లా తేజ సింగ్ దేవాలయానికి వెయ్యేళ్ళ చరిత్ర వుంది. రషీద్ నియాజ్ అనే చరిత్రకారుడు రాసిన ‘హిస్టరీ ఆఫ్ సియాల్ కోట్’ పుస్తకంలో ఈ దేవాలయం గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. లాహోర్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది.

దేశ విభజన తర్వాత పాకిస్తాన్ లో మైనారిటీల పవిత్ర స్థలాల బాగోగులను నిర్వాసితుల ఆస్తుల బోర్డ్ పర్యవేక్షిస్తోంది. స్థానిక హిందువుల కోరిక మేరకు షావ్లా తేజ సింగ్ దేవాలయాన్ని పునఃప్రారంబించేందుకు ఆ సంస్థ ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పాక్ ప్రభుత్వం ఇందుకు అంగీకరించినట్టు అధికారిక ప్రతినిధి అమిర్ హష్మి తెలిపారు. గతంలో ఆ ప్రాంతంలో హిందువులెవ్వరూ నివసించనందున దేవాలయాన్నిమూసివేశారని ఆయన తెలిపారు.

నిర్వాసితుల ఆస్తుల బోర్డ్ చైర్మన్ డా. అమిర్ అహ్మద్ మాట్లాడుతూ, 1992 లో భారత్ లోని వివాదాస్పద బాబ్రీ కట్టడం కూల్చివేతకు నిరసనగా చెలరేగిన అల్లర్లు, దాడుల్లో ఈ దేవాలయం పాక్షికంగా దెబ్బతిన్నదని, ప్రస్తుతం పునరుద్దరణ దిశగా పనులు జరుగుతున్నాయని తెలిపారు.  బోర్డ్ డిప్యుటీ డైరెక్టర్ ఫరాజ్ అబ్బాస్ మాట్లాడుతూ దేవాలయ పునరుద్దరణ పనులు త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు.

దేశ విభజన తర్వాత  72 ఏళ్ళకు మళ్ళీ ఈ దేవాలయం తలుపులు తెరుచుకోవడం పట్ల స్థానిక హిందువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ  2000 హిందూ కుటుంబాలు జీవిస్తున్నాయి. స్థానిక హిందువులేకాక పాకిస్తాన్ లోని ఇతర ప్రాంతాల్లోని హిందువులు కూడా ఇక్కడకు వస్తారని  ఆశిస్తున్నట్లు అబ్బాస్ వివరించారు.

భారతీయ హిందువులను కూడా దేవాలయంలోకి అనుమతిస్తామని అబ్బాస్ చెప్పారు. మైనారిటీ
హిందువుల కోసం దేవాలయాన్ని పునరుద్దరిస్తూ పాక్ ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయాన్ని స్థానిక హిందూ నాయకులు రతన్ లాల్, రుమైష్ కుమార్ స్వాగతించారు.

పాకిస్తాన్లో హిందువులది అతి పెద్ద మైనారిటీ సమూహం. అధికారిక లెక్కలప్రకారం 15 లక్షల హిందువులు పాకిస్తాన్లో నివసిస్తున్నారు. అయితే స్థానిక లెక్కల ప్రకారం 90 లక్షల మంది నివసిస్తున్నారు. వీరిలో  ఎక్కువ మంది పంజాబులోని సింధ్ ప్రావిన్సులో ఉంటున్నారు.