– ప్రదక్షిణ
ఒక విద్యావేత్త, మేధావి 1907లోనే భారత దేశానికి ఒక అస్తిత్వం, గుర్తింపు ఉండాలని ఒక పతాకo రూపకల్పన చేసారు. ఆయన అదే దీక్షగా తీసుకుని, 1916లో `భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ అని ఇంగ్లీషులో గ్రంథాన్ని రచించారు. ఆ దేశభక్తుడే శ్రీ పింగళి వెంకయ్య, చిన్నచిన్న మార్పులతో, ఆయన రూపొందించిన పతాకమే నేటి మన త్రివర్ణ పతాకం. వెంకయ్యగారు బహుముఖ ప్రజ్ఞాశాలి. పరిపూర్ణమైన గాంధేయవాది, వ్యవసాయవేత్త, మువ్వన్నెల జెండా రూపకర్త, బహుభాషావేత్త, గ్రంథ రచయిత, భూగర్భశాస్త్రవేత్త కూడా.
శ్రీ వెంకయ్య, కృష్ణాజిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో 2ఆగస్ట్1876న జన్మించారు. ఆయన తమ తాత గారింట పెదకళ్ళేపల్లి గ్రామoలో, తరువాత బందరులో పాఠశాల విద్య పూర్తిచేసారు. ఆయనకి చిన్నప్పటినుంచీ ఉత్సాహం, ధైర్య సాహసాలు ఎక్కువ. ఆయన తన 18వ ఏట, ముంబై వెళ్లి, సైన్యంలో చేరి, దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధంలో పాల్గొన్నారు, అక్కడే అంత చిన్నవయసులో ఆయనకు గాoధీగారితో పరిచయం ఏర్పడింది. తిరుగు ప్రయాణంలో అరేబియా ఆఫ్ఘనిస్తాన్ లు కూడా చూసి వచ్చారు. యుద్ధంనుంచి వచ్చాక ఆయన అయిదేళ్ళపాటు ఉత్తర భారతదేశంలో రహస్య విప్లవోద్యమాల్లో పాల్గొన్నారు.
తరువాత మద్రాసులో ప్లేగు ఇన్స్పెక్టర్ శిక్షణ పూర్తి చేసి, కొంతకాలం బళ్ళారిలో ఉద్యోగం చేసి, శ్రీలంక కొలంబోలో `రాజకీయ ఆర్థిక శాస్త్రాల్లో’ సీనియర్ కేంబ్రిడ్జ్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఆ తరువాత లాహోర్ డిఏవి కాలేజీలో సంస్కృతం, ఉర్దూ, జాపనీసు భాషల్లో పాండిత్యం సంపాదించారు, ఆయనను స్నేహితులు సరదాగా `జపాన్ వెంకయ్య’ అని పిలిచేవారు. ఆయనకు అపారమైన జ్ఞానతృష్ణ.
వ్యవసాయం- పరిశోధన
ఆయన స్వాతంత్ర్య సమరయోధులు. దేశస్వాతంత్ర్య కాంక్షతో వెంకయ్యగారు కాంగ్రెస్ సమావేశాలకు వెళ్ళేవారు. అక్కడ ముక్త్యాల రాజా నాయని రంగారావు బహద్దూర్ గారితో పరిచయం ఏర్పడి, వారి సహకారంతో `వ్యవసాయ పరిశోధన శాల’ స్థాపించారు. వెంకయ్యగారు అమెరికా నుండి కాంబోడియా ప్రత్తి విత్తనాలు తెప్పించి, ప్రత్తి పండించారు. మునగాలలో ఉంటూ 1909-10 కాలంలో `వ్యవసాయ శాస్త్రం’ అనే గ్రంథo వ్రాసారు, అప్పుడు అందరూ ఆయనను `ప్రత్తి వెంకయ్య’ అని పిలిచేవారు. ఈ గ్రంథం చాలా ప్రసిధ్దమై, బ్రిటన్ లోని `రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ’ స్వయంగా ఆయనను అభినందించి, సొసైటీలో సభ్యత్వం ఇచ్చింది.
వెంకయ్యగారు బందరులోని సుప్రసిద్ధమైన `ఆంద్ర జాతీయ కళాశాల’లో అధ్యాపకులుగా పనిచేస్తూ వ్యవసాయ శాస్త్రం, చరిత్ర బోధించేవారు. వీటితోపాటు, విద్యార్థులకు ఆయన సైన్యంలో నేర్చుకున్న గుర్రపుస్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ కూడా బోధించేవారు.
త్రివర్ణపతాకం
దేశానికి పతాకం ఉండాలనే ధ్యేయంతో, రకరకాల పతాకాల రూపకల్పన చేసి 1916లో `భారతదేశానికి ఒక జాతీయ పతాకం’ గ్రంథాన్ని వెలువరించారు. ఆయనని అప్పుడు అంతా `జెండా వెంకయ్య’ అని పిలవడం మొదలుపెట్టారు. (1907లోనూ అంతకుముందు కూడా జెండా రూపకల్పనకు ప్రయత్నాలు జరిగాయి. 1917లో హోం-రూల్ ఉద్యమంలో అంతకు ముందు `మేడం కామా’ రూపొందించిన పతాకం ఎగురవేశారు.) వెంకయ్యగారు 1916నుంచి ప్రతి సంవత్సరం కాంగ్రెస్ సమావేశంలోనూ భారతదేశ పతాకం గురించి ప్రస్తావిస్తూ, దాని ప్రాముఖ్యతను వివరించేవారు. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో, కాషాయ ఆకుపచ్చ రంగులున్న జెండాను గాంధీగారికి చూపించగా, అహింసకు, స్వచ్చతకు చిహ్నమైన తెలుపురంగు, గ్రామీణ జీవనానికి చిహ్నంగా `రాట్నం’ చిత్రాన్ని కలపాలని గాంధీగారు సూచించారు. ఆ ప్రకారమే వెంకయ్యగారు త్రివర్ణ పతాకాన్ని రూపొందించి `నడిగూడెం’లోని స్థానిక రామాలయములో పూజలు నిర్వహించి అదే కాంగ్రెస్ మహాసభలో సమర్పించారు. 1921 విజయవాడ సమావేశంలోనే `జాతీయ పతాకం’ ఆమోదిoచారు.
రాజ్యాంగ సభ ఆమోదం
1947 జూలై 22న భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మధ్యనున్న తెలుపు రంగులోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా జెండాని వెలువరించారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్యగారు రూపొందించిన జెండాకు నేటి జెండాకు . తేడా.ఏమీ లేదు.
వెంకయ్యగారు తరువాత మద్రాసు వెళ్ళి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి ‘డిప్లొమా’ తీసుకున్నారు. తరువాత 1924 నుండి 1944 వరకు నెల్లూరులో ఉంటూ మైకా (అభ్రకం) గురించి పరిశోధన చేశారు. అనంతపురం వజ్రకరూరులోనూ, హంపిలో ఖనిజాలు, వజ్రాలు అన్వేషిస్తూ, విశేషంగా పరిశోధనలు జరిపి ప్రభుత్వానికి ఖనిజాల ఉనికిని గురించి నివేదికలు పంపారు. ప్రపంచానికి తెలియని వజ్రపు తల్లిరాయిని గురించి వెంకయ్యగారు గ్రంథం వ్రాసారు, పాశ్చాత్య శాస్త్రజ్ఞులు ఆయన పరిశోధనను ఎంతగానో మెచ్చుకున్నారు. ఆయనను అందరూ అపుడు `వజ్రాల వెంకయ్య’ గా పిలుచుకున్నారు.
వెంకయ్యగారు ఆరడుగుల ఎత్తుండి, నల్లని రంగులో ఉక్కుమనిషిలా, కంచులాంటి కంఠస్వరం కలిగి ఉండేవారు. అవినీతిని, అన్యాయాన్ని అసలు సహించేవారు కాదు. నైజాం నవాబువద్ద సేనానిగా పనిచేసిన పింగళి మాదన్నగారి వంశీయులు వెంకయ్యగారు.
చివరి దశ
దేశానికి ఎన్నో రకాలుగా సేవలు చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి పింగళి వెంకయ్యగారిని స్వాతంత్ర్యానంతరం జాతి మర్చిపోయింది. ప్రభుత్వాలు ఆయనను పట్టించుకోలేదు. ఆయన వృద్ధాప్యంలో, తినడానికి తిండి కూడా లేకుండా, చాలా పేదరికం అనుభవించి 1963లో మరణించారు. జెండా వెంకయ్య, ప్రత్తి వెంకయ్య, జపాను వెంకయ్య, వజ్రాల వెంకయ్యగా పేరుపొందిన వెంకయ్యగారి జీవితం, ఆయన ప్రతిభ మరుగునపడిపోయాయి. కన్నుమూసేముందు వెంకయ్యగారు తన చివరి కోరికను వెల్లడిస్తూ “నా అంత్యదశ సమీపించింది నేను చనిపోయిన తరువాత త్రివర్ణ పతాకంతో నా శరీరాన్ని కప్పండి’’అని కోరారు.
భారతదేశం యావత్తూ, ముఖ్యంగా నేటి నవభారత యువతరానికి, శ్రీ పింగళి వెంకయ్యగారు ప్రాతఃస్మరణీయుడు.
ఆధారం: జానమద్ది హనుమచ్చాస్త్రి గారి `సుప్రసిద్ధుల జీవిత విశేషాలు’
ఆగస్టు – 2, పింగళి వెంకయ్య గారి జయంతి
This article was first published in 2020