Home News రాష్ట్ర సేవికా సమితి సంతాప సందేశం

రాష్ట్ర సేవికా సమితి సంతాప సందేశం

0
SHARE

భారతదేశపు విశిష్ట నాయకురాలు శ్రీమతి సుష్మా స్వరాజ్ హఠాన్మరణంతో యావత్ దేశం నిర్ఘాంతపోయింది. విచారంలో మునిగిపోయింది. దుఃఖ పూరితమైన ఈ సమయంలో మేము వారి కుటుంబానికి, అభిమానులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నాం. దివంగత ఆత్మకు తన చరణ సన్నిధిలో స్థానం ఇవ్వాలని పరమేశ్వరుని ప్రార్ధిస్తున్నాము. ఆమెకు రాష్ట్ర సేవికా సమితితో సన్నిహిత సంబంధం ఉండేది. సమితికి చెందిన ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో ఆమె పాల్గొనేవారు. మాకు ప్రేరణ, ఉత్సాహం అందించేవారు. మహిళల ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పెంపొందించడంలో శ్రీమతి సుష్మా స్వరాజ్ ప్రముఖ పాత్ర పోషించారు. అస్సామ్ లోని హాఫ్ లోంగ్ లో రెండు గిరిజన వర్గాల మధ్య చెలరేగిన గొడవల నుంచి మహిళలను రక్షించడం కోసం మేము సహాయం అర్ధించిన వెంటనే ఆమె స్పందించిన తీరు ఎప్పటికీ మరచిపోలేము. ఈ హఠాత్ పరిణామంతో రాష్ట్ర సేవికా సమితి పరివారం దిగ్భ్రాంతికి గురైంది. ఆమె లేని లోటు పూడ్చలేనిది.

సుష్మా జీ మరణంతో భారతమాత తన యోగ్యవంతురాలు, రత్నం వంటి కుమార్తెను కోల్పోయింది. గొప్ప నాయకురాలు, పార్లమెంట్ సభ్యురాలు, కుశల, సమర్ధ మంత్రి, అద్వితీయ వక్త, బహుభాషా ప్రవీణురాలైన సుష్మాజీ భారతీయ సభ్యత, సంస్కృతిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సౌభాగ్యవతి అయిన భారతీయ నారీమణి సుగుణాలకు ప్రతీకగా నిలిచారు.

ఆమెది అత్యంత నిర్మలమైన, ప్రేమపూర్వకమైన వ్యవహార శైలి. అవసరమైనప్పుడు అత్యంత కఠినంగా కూడా ఉండేవారు. కోట్లాది మంది భారతీయ మహిళలకు ఆమె ఒక ఆదర్శం, ప్రేరణ.

విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఐదేళ్ల కాలవ్యవధిలో ఆమె చరిత్ర సృష్టించారు. తన మంత్రిత్వ శాఖను ప్రజానుకూలంగా మలచారు. ఇతర దేశాల్లో భారత్ పేరు ప్రతిష్టాలను ఇనుమడింపజేయడంతో పాటు ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రవాసీ భారతీయులకు సహాయం అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండేవారు. 24 సెప్టెంబర్, 2017న ఐక్యరాజ్య సమితిలో ఆమె చేసిన ప్రసంగాన్ని ఎవరు మరచిపోగలరు? ఆమె తన ఉపన్యాసం ద్వారా భారతీయ వాణిని ప్రభావవంతంగా వినిపించారు.

చనిపోవడానికి కొద్ది గంటల ముందు ఆమె 370వ అధికారణాన్ని రద్దుచేయడంలో విజయం సాధించిన మోడి ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ చరిత్రాత్మక సంఘటన జరిగిన రోజునే ఆమె మనల్ని విడిచిపోవడం విధి వ్రాత. వివిధ రంగాల్లో ఆమె సాధించిన విజయాలు, సైద్ధాంతిక నిష్ట, వాత్సల్యపూర్వకమైన వ్యవహార శైలిని భారతీయులు ఎప్పటికీ మరచిపోరు. ఆమె భారతీయ మహిళలకు ఆదర్శంగా, ప్రేరణగా ఎల్లప్పటికి నిలుస్తారు. ఓం శాంతి, శాంతి, శాంతిః
— శాంతకుమారి, ప్రముఖ సంచాలిక, రాష్ట్ర సేవికా సమితి