సరిగ్గా 509 సంవత్సరాల క్రితం 26 జులై 1509న మహామంత్రి తిమ్మరుసు దక్షిణాపథానికి సామ్రాట్టుగా శ్రీ కృష్ణదేవరాయలను సింహాసనం అధిష్టింపజేసాడు. అక్కడి నుండి విజయనగర సామ్రాజ్య సువర్ణాధ్యాయం (1509 -1565 ) ప్రారంభమైంది. శ్రీ కృష్ణదేవరాయలను ఈ విశాల భూభాగంలో ఒక ఉత్తమమైన మహారాజుగా నిలబెట్టింది.
శ్రీ కృష్ణదేవరాయలకి కాస్త ముందుకు వెళ్లిచూస్తే –అల్లాఉద్దీన్ ఖిల్జి, మాలిక్ కాఫర్, మహమ్మద్ బిన్ తుగ్లక్ లు ఆక్రమించిన మహా హిందూ సామ్రాజ్యాలు దేవగిరిలోని యాదవ సామ్రాజ్యం, వరంగల్ లోని కాకతీయ సామ్రాజ్యం, హళిబేడులోని హొయసల సామ్రాజ్యం మదురైలో పాండ్య రాజా సామ్రాజ్యం మొదలైనవి కనిపిస్తాయి. కానీ 1340 నాటికే ఈ సామ్రాజ్యాలన్నీ దాదాపు పతనావస్థకు చేరుకున్నాయి. రాజ్యాల మధ్య ఐక్యత లేకపోవడం, వరుసగా దాడులు జరగడం దీనికి ముఖ్య కారణం.
ఈ సామ్రాజ్యాల శిధిలాల నుండే దక్కన్ తీరప్రాంతం, ద్వీపకల్పమంతా గర్వపడేలా, దాదాపు 300 సంవత్సరాలపాటు ధర్మానికి ప్రతీకగా విజయనగర సామ్రాజ్యం నిలిచింది.
1336 లో హరిహర, బుక్క అనే సంగమ వంశ సోదరులవల్ల ఈ సామ్రాజ్యం సాధ్యపడింది. బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడి, ఢిల్లీ సుల్తాన్ ఖైదులో ఉన్న వీరు అక్కడి నుండి తప్పించుకుని తగిన మార్గదర్శనం కోసం తిరుగుతుండగా తుంగభద్రా తీరంలోని శృంగేరి మఠానికి చెందిన శ్రీ విద్యారణ్య స్వామి వారి ఆశ్రయం లభించింది. ఆయన చెప్పిన విధంగా ప్రస్తుత హంపి క్షేత్రం వద్ద , ఈనాటికీ ప్రజలచే కొనియాడబడుతున్న ఈ మహా సామ్రాజ్యాన్ని స్థాపించారు.
అయితే హరిహర బుక్కలు ఎక్కడివారు అనేదాని పైన నిర్దిష్టమైన సాక్ష్యాలేమి లేవు. వీరు చివరి కాకతీయ వంశస్తుడైన ప్రతాపరుద్రుని అధికారులా లేక హొయసల వంశానికి చెందిన వీరభల్లాల-3 వద్ద కోశాధికారులా అనేది తెలియదు.
హొయసల రాజైన భల్లాల-3 మేనల్లుడు బాలప్ప దండనాయకుడు హరిహరుడి కుమార్తెను వివాహం చేసుకున్నాడు. దీని ద్వారా హరిహరుడు హొయసల సామ్రాజ్యంతో మంచి బంధాన్ని కలిగి ఉన్నాడు. 1336 లో రాజ్యస్థాపన జరిగిన వెంటనే ప్రస్తుత పశ్చిమ కర్ణాటక తీరంలోని బార్కురు వద్ద ఒక కోటని నిర్మించారు. అలాగే శాసనాల ద్వారా తెలిసిన విషయాలను బట్టి 1339 నుండి ఈయన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని గుత్తి ప్రాంతం నుండి కర్ణాటక ఉత్తర ప్రాంతాలను అజమాయిషీ చేసేవాడని తెలుస్తోంది.
1343 లో వీరభల్లాల -3 మరణించే నాటికి హొయసలరాజ్యపు ఉత్తర భాగాలన్నింటిని హరిహర తన ఆధీనంలో ఉంచి పరిపాలన చేసాడు. వీరి సోదరులలో కంపన నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించగా, ముద్దప్ప మూలభాగాల ప్రాంతాన్ని, మారెప్ప ఇప్పటి చంద్రగిరి అయిన చంద్రగుత్తిని పర్యవేక్షిస్తుండేవారు. హరిహరులు తర్వాత అత్యున్నత అధికారిగా బుక్కరాయలు ఉండేవాడు.
సంగమ వంశీకులైన హరిహర, బుక్కలు మరియు తదనంతర వారసులు 150 సంవత్సరాలపాటు విజయనగర సామ్రాజ్యాన్ని అత్యంత సమర్థతతో పరిపాలించారు. 1485 లో ప్రౌఢ రాయల మరణంతో ఈ పాలన ముగిసింది.
సంగమ వంశ పాలన అనంతరం సాళువ వంశ ప్రభువులు 1485 లో రాజ్యాన్ని చేపట్టారు. కానీ వాస్తవ నిర్ణయం అధికారాలన్నీ సైన్యాధినేత అయిన తుళువ నరస నాయకుని ఆధీనంలో ఉండేవి. నరసనాయకుడు మరియు అతని ప్రతిభాశాలి మంత్రి అయిన సాళువ తిమ్మరుసు ఆధ్వర్యంలో రాజవ్యవహారాలన్నీ జరిగేవి.
సాళువ తిమ్మరుసు విజయనగర సామ్రాజ్య ప్రధాన రూపశిల్పి. దాదాపు 30 సంవత్సరాలపాటు తుళువ నరసనాయక (1491 -1503 ); తుళువ వీర నరసింహరాయలు (1503 -1509); మరియు తుళువ కృష్ణదేవరాయ (1509 -1529) వంటి రాజులతో ఈయన పనిచేసారు.
కృష్ణదేవరాయలు తిమ్మరుసును తండ్రిలా అభిమానిస్తూ, మార్గదర్శిగా గౌరవిస్తూ, “అప్పాజీ”అని ప్రేమతో సంభోదించేవారు. 1509 లో సవతి సోదరుడైన తుళువ వీర నరసింహరాయని మరణానంతరం కృష్ణదేవరాయలు సింహాసనం అధిష్టించటానికి తగిన ఏర్పాట్లన్నీ తిమ్మరుసు చేశారు. వాస్తవానికి తన కుమారుడికి అధికారం దక్కడం కోసం కృష్ణదేవరాయలును అడ్డుతొలగించాలని నరసింహ రాయడు భావించాడు. అతని కళ్ళు పీకించి తనకు చూపించాలని తిమ్మరుసును ఆదేశించాడు కూడా. అయితే సనాతన ధర్మాన్ని సంరక్షించగలిగే సమర్ధత శ్రీకృష్ణదేవరాయలకే ఉందని గ్రహించిన అప్పాజీ, రాజుకు రెండు మేక కళ్ళను చూపించి కృష్ణదేవరాయలను చంపించినట్లు నమ్మించాడు. కృష్ణదేవరాయాలని అజ్ఞాతంలో ఉంచి, అనుకూల సమయంలో 1509లో వీర నరసింహరాయల మరణానంతరం అతనిని తీసుకువచ్చి సింహాసనాన్ని శాస్త్రోక్తంగా అధిష్టింపచేసాడు.
1509 నుండి 1529 వరకు తిమ్మరుసు వేసిన బలమైన పునాదులపై 20 సంవత్సరాలపాటు శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేసి మరో వందేళ్లపాటు సమర్థ పాలన తన రాజ్యం నుండి అందేలా ఏర్పాట్లు చేసాడు.
1565 లో “తళ్ళికోట” యుద్ధంలో అలియ రామరాయల ఓటమి తర్వాత విభేదాలు మొదలైనా మరో 80 సంవత్సరాలు పెనుగొండ, చంద్రగిరి ఇంకా ఇతర కోటల నుండి పరిపాలన సాగించారు. కృష్ణదేవరాయల తదనంతరం వేంకటపతి దేవరాయలు 30 ఏళ్ల పాటు పరిపాలన చేసాడు.
1642 లో మూడవ శ్రీరంగుని కాలంలో ఈ సామ్రాజ్యo పతనావస్థకి చేరుకుంది. విజయనగర సామ్రాజ్యానికి చెందిన కథలు సహ్యాద్రి పర్వత సానువుల్లో పెరిగే రాజపుత్రులు,శివాజీ వంటి బాలల మదిలో ముద్రవేశాయి. ఈ ప్రేరణతోనే సనాతనధర్మాన్ని పునరుద్ధరించడానికి ముగ్గురు ఛత్రపతులు 1700 కాలంలో నడుంకట్టారు. వీరే శివాజీ, శంభాజీ మరియు రాజారాంలు. వీరి తర్వాత పీష్వాలు, ఖల్సాపంథ్, మహారాజ రంజిత్ సింగ్ మొదలైన వారితో 1840 వరకు ఈ సంప్రదాయం కొనసాగింది.
ఓ రాయలా!
ఓ తెనాలి!
ఓ వ్యాసతీర్థా!
ఓ తిమ్మరుసు!
మేము ఎప్పటికీ మీ వారసులుగా మీకు రుణపడిఉంటాము. సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి మీరు చేసిన త్యాగాలను,కృషిని హిందువులు ఎప్పటికీ మరువలేరు. మీ అందరి ఆధ్యాత్మికత మరియు ఆశీస్సులవల్లనే ఈ సమాజం ఎప్పటికప్పుడు తనపైన జరుగుతున్న అన్యాయాలను, విధ్వంసాలను ఎదుర్కొనగలుగుతున్నది. భరతమాత కీర్తిని మరింత పెంచుదాం….విజయనగర చరిత్రను ఎప్పుడూ గుర్తుంచుకుందాం
–ప్రమోద్ కుమార్ బూరవల్లి
(myind.net సౌజన్యం తో)
తెలుగు అనువాదం – శ్రీమతి రాధ దేవి
(ఈ వ్యాసం మొదట 8 ఆగస్టు 2018 నాడు ప్రచురితమైంది)