– ప్రశాంత్ పోల్
ఇవాళ సోమవారం.. అయినా కలకత్తా దగ్గర ఉన్న సోధెపూర్ ఆశ్రమంలో గాంధీజీ ప్రార్ధనా సమావేశానికి చాలామంది హాజరయ్యారు. గత రెండు, మూడు రోజులుగా కలకత్తాలో శాంతియుత పరిస్థితులు ఉన్నాయి. గాంధీజీ ప్రార్ధనా సమావేశపు ప్రభావం ఇక్కడి హిందూ నాయకులలో బాగా కనిపించింది. సరిగ్గా ఏడాది క్రితం ముస్లింలు కలకత్తాలో హిందువులపై సాగించిన మారణకాండ, అత్యాచారాలకు ప్రతీకారం చేయాలని అక్కడి హిందూ నాయకులు భావించారు. కానీ గాంధీజీ కలకత్తాలో ఉన్న కారణంగా వారికి ఆ పని చేయడం కష్టమైంది. అందుకనే సుహ్రవర్దీ కూడా గాంధీజీ కలకత్తాలోనే ఉండాలని కోరుకున్నాడు.
దీనికి కారణం కూడా ఉంది. విభజన తరువాత కలకత్తా భారత్ లో ఉంటే, ఢాకా తూర్పు పాకిస్థాన్ లోకి వెళుతుందని స్పష్టమైపోయింది. హిందుస్తాన్ లోని బెంగాల్ కు ముఖ్యమంత్రి ఎవరన్నది కూడా నిర్ణయమైపోయింది. రాగల ఐదు రోజుల్లో బెంగాల్ లో ముస్లిం లీగ్ పాలన అంతమవుతుంది. కాబట్టి కలకత్తాలో ఉన్న ముస్లింలకు రక్షణ కావాలి. గాంధీజీ కలకత్తాలో ఉంటే అది సాధ్యపడుతుంది.
ఈ రోజు ప్రార్ధన సమావేశంలో గాంధీజీ కాస్త భిన్నమైన విషయాన్ని ప్రస్తావించారు. “నేను ఇవాళ నా ముందున్న కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పదలుచుకున్నాను. నాపై ఒక ఆరోపణ ఏం వచ్చిందంటే నా ప్రార్ధనా సమావేశాల్లో ధనవంతులు, ఉన్నత వర్గానికి చెందినవారికితప్ప సాధారణ జనానికి ప్రవేశం ఉండదని, వారికి ముందువరుసలో కూర్చునే అవకాశం రాదని. నిన్న ఆదివారం కనుక సమావేశానికి చాలా ఎక్కువమంది వచ్చారు. అందువల్ల బహుశా అలా జరిగిఉంటుంది. కనుక నేను హృదయపూర్వకంగా అందరికీ చేసే అభ్యర్ధన ఏమిటంటే దయచేసి సహనం వహించండి. ఎవరిపట్ల ఎలాంటి భేదభావం చూపవద్దని నా కార్యకర్తలకు చెప్పాను. అందరినీ లోపలకు అనుమతించమని సూచించాను.’’
“నేను కలకత్తా వచ్చిన రోజునే చట్ గావ్ లో వరద గురించి వార్తా చదివాను. ఈ భయంకర వరదల వల్ల ఎందమంది ప్రాణాలు కోల్పోయారో, ఎంత ఆస్తి నష్టం వాటిల్లిందో వివరాలు పూర్తిగా తెలియలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో తూర్పు పాకిస్థాన్, పశ్చిమ పాకిస్థాన్, హిందూస్థాన్ అంటూ మాట్లాడకుండా బాధితులకు వెంటనే సహాయం అందించాలి. చట్ గావ్ వరద మొత్తం బెంగాల్ కు వచ్చిన ఆపద. బెంగాల్ సహాయ కమిటీ ఏర్పాటు చేసి అందరికీ తగిన సహాయం అందించాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చట్ గావ్ బాధితులకు నా హృదపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను.’’
“స్వతంత్ర భారతంలో గవర్నర్, మంత్రి , ఇతర ముఖ్యమైన పదవులలో ఎవరిని నియుక్తి చేస్తున్నారు అని మీలో కొద్దిమంది విలేకరులు అడిగారు. నేను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడినే అనుకుందాం…అయినా నేను కాంగ్రెస్ కార్యకర్తల మనస్సుల్లో ఉంటాను తప్ప వారిపై అధికారం చెలాయించను. నేను ఈ మర్యాదను నిలుపుకోకపోతే కార్యకర్తల గౌరవాన్ని కోల్పోతాను. అందుకని ఎలాంటి నియామకాల విషయంలో నాకు అధికారం ఉండదు. కానీ మొత్తం మీద నైతికాధికారం మాత్రం ఉంటుంది.’’
“కొందరు ఇలా అడిగారు – తూర్పు, పశ్చిమ బెంగాల్ లోని వివిధ ప్రాంతాల్లో శాంతి, సధ్బావన నెలకొల్పేందుకు అంతా ప్రయత్నించాలని మీరు భావిస్తున్నారా? అని. దీనికి నా సమాధానం `అవును. డిల్లీ నుంచి అన్నీ ప్రాంతాల్లో మంత్రులు ఒకే తాటిపై నడిస్తే సమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయి. అందుకనే ముస్లింల పట్ల ప్రతీకార భావంతో వ్యవహరించకందని నేను చెపుతున్నాను. కన్నుకు కన్ను, పంటికి పన్ను అనే పద్దతి ఆటవికమైనది. అహింస మాత్రమే అన్నీ సమస్యలకు సమాధానం.’’
–0–0–0–0–
కరాచీలో బ్రిటిష్ పద్దతిలో నిర్మించిన భావ్యమైన అసెంబ్లీ భవనం. రాజభవనంలా వెలిగిపోతోంది.
సోమవారం..ఉదయం 9గం.ల 55ని.లకు పాకిస్థాన్ నిర్మాత, కాయిదే ఆజమ్ జిన్నా ప్రత్యేకమైన వాహనంలో అసెంబ్లీ భవనానికి వచ్చారు. తళతళలాడే యూనిఫాం వేసుకున్న కొద్దిమంది అధికారులు, లియకత్ అలీ వంటి కొద్దిమంది నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. సరిగ్గా 10 గం.లకు పాకిస్థాన్ రాజ్యాంగ సభ సమావేశం మొదలైంది. దీనికి జోగేంద్రనాధ్ మండల్ అధ్యక్షత వహిస్తున్నారు.
జోగేంద్రనాధ్ సమావేశాన్ని ప్రారంభించారు -“అధ్యక్ష పదవి కోసం నిన్న ప్రవేశపెట్టిన ప్రస్తావనలోని పేరా 2 ప్రకారం ఏడుగురు కాయిదే ఆజమ్ జిన్నా నామినేషన్ కు మద్దతు తెలిపారని వెల్లడిస్తున్నాను. సమర్ధన తెలియజేసిన గౌరవ సభ్యుల పేర్లు…
గయాసుద్దీన్ పఠాన్
హమీదుల్ హక్ చౌధరి
అబ్దుల్ కాసిం ఖాన్
మాన్యులు లియకత్ అలీ ఖాన్
ఖ్వాజా నాసిముద్దీన్
మాన్యులు ఏం.కె. ఖుస్రో
మౌలానా షబ్బీర్ అహ్మద్ ఉస్మానీ
పైన పేర్కొన్న మాన్యులంతా ఆ తీర్మానాన్ని సమర్ధించారు. అలాగే ఇతరులు ఎవరు ఈ పదవి కోసం నామినేషన్ దాఖలు చేయలేదు. దీనినిబట్టి మాన్యులు కాయిదే జిన్నా ను పాకిస్థాన్ పార్లమెంట్ సభ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాను. వారి దయచేసి తమ స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాను.’’
లియకత్ అలీ ఖాన్, సర్దార్ అబ్దుల్ రబ్ ఖాన్ లు జిన్నాను అధ్యక్ష స్థానం వరకు తీసుకువెళ్లారు. కరతాళ ధ్వనుల మధ్య జిన్నా తన స్థానాన్ని అలంకరించారు.
అధ్యక్ష స్థానాన్ని అలంకరించిన జిన్నా ప్రశంసిస్తూ తూర్పు బెంగాల్ కు చెందిన లియకత్ అలీ ఖాన్ మాట్లాడారు. గత 11 ఏళ్లలో జరిగిన పనులను ఏకరవు పెట్టారు. “ ఎలాంటి రక్తపాతం, విప్లవం అవసరం లేకుండా మీ నాయకత్వంలో పాకిస్థాన్ ను సంపాదించుకున్నాం.’’
లియకత్ అలీ తరువాత తూర్పు బెంగాల్ కాంగ్రెస్ కు చెందిన కిరణ్ శంకర్ రాయ్ కూడా జిన్నాకు అభినందనలు తెలుపుతూ మాట్లాడారు. పంజాబ్, బెంగాల్ లో జరిగిన దురదృష్టకర సంఘటనలను ప్రస్తావించారు. విభజన హిందువులు, ముస్లింల అంగీకారం తోనే జరిగింది కాబట్టి పాకిస్థాన్ పట్ల పూర్తి నిష్ట తమకు ఉంటుందని కూడా స్పష్టంచేశారు.
రాయ్ తరువాత సింధ్ నుంచి వచ్చిన ఏం. ఏ. ఖుస్రో మాట్లాడారు. తరువాత జోగింధ్రనాధ్ మండల్ మాట్లాడారు. బెంగాల్ కు చెందిన అబ్దుల్ కాసిమ్ ఖాన్, పశ్చిమ పంజాబ్ నుంచి వచ్చిన బేగమ్ జహార షానవాజ్ లు మాట్లాడిన తరువాత చివరికి మహమ్మద్ అలీ జిన్నా సభను ఉద్దేశించి ప్రసంగించడానికి సిద్ధమయ్యారు. అప్పటికి మధ్యాహ్నం 12 గం. లు అయింది. జిన్నా స్పష్టంగా తాను అనుకున్నది చెప్పడం మొదలుపెట్టారు. కోర్ట్ లో తన వాదన వినిపిస్తున్నట్లు, స్పష్టంగా, తర్కబద్ధంగా మాట్లాడారు..
“ఈ అసెంబ్లీలో ఉన్న సభ్యులందరికి…నన్ను మీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. మనం ఏ పద్దతిలో పాకిస్థాన్ ను సాధించుకున్నామో అలా ప్రపంచంలో మరెక్కడా జరిగిఉండదు. ఈ రాజ్యాంగ సభకు రెండు ముఖ్య ఉద్దేశ్యాలు ఉన్నాయి. ఒకటి, దీని ద్వారా పాకిస్థాన్ కు సార్వభౌమ రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాలి. రెండవది, సార్వభౌమ, స్వతంత్ర రాజ్యంగా మనం మన కాళ్లపై నిలబడాలి. చట్ట, న్యాయ వ్యవస్థలను మొదట ఏర్పాటు చేసుకోవాలి. అవినీతి, అక్రమాలను పూర్తిగా తొలగించుకోవాలి. పంజాబ్, బెంగాల్ సరిహాద్దు రెండు వైపులా విభజన అంటే ఇష్టం లేని వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అయితే దీనికి మించిన ప్రత్యామ్నాయం నాకు ఏది కనిపించలేదు. విభజన నిర్ణయం ఇప్పటికే తీసేసుకున్నాము కాబట్టి నిష్టతో, శ్రద్ధగా ఆ నిర్ణయాన్ని అమలు చేయడమే మిగిలింది.’’
“మీరు ఏ మతానికి చెందినవారైనా పాకిస్థాన్ లోని మీ తీర్థ స్థలాలకు వెళ్లడానికి పూర్తి స్వేచ్చా ఉంటుంది. మీరు మందిరానికి వెళ్ళిన, మసీదుకు వెళ్ళినా ఎలాంటి ఆటంకాలు ఉండవు. పాకిస్థాన్ లో సర్వ మత సమభావన ఉంది, ఉంటుంది. ముస్లింలు, హిందువులు, రోమన్ కాథలిక్కులు, పార్సిలు..ఇలా అంతా సద్భావంతో కలిసిమెలసి ఉంటాము. మతం ఆధారంగా ఎవరిపట్ల వివక్ష ఉండదు.’’
ఈ మాటలు వింటున్న సభ్యులు మనస్సులో `నిజంగా ఇలాగే కనుక ఉంటే ఇలా ప్రత్యేక పాకిస్థాన్ ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నట్లు?’… అనుకున్నారు.
–0–0–0–0–
మధ్యాహ్నం 12గం. లు అయింది. ఎండ మండిపోతోంది. ఆకాశం నిర్మలంగా ఉంది. వారం మొదట్లో బాగా వర్షాలు పడడంతో చుట్టుపక్కల చెట్లు, మొక్కలు పచ్చగా కళకళలాడుతున్నాయి.
కలాత్.. బెలూచీస్థాన్ లోని ప్రముఖ నగరాలలో ఒకటి. క్వెట్ట నుంచి కేవలం 90 మైళ్ళ దూరంలో ఉన్న ఈ నగరంలో జనాభా ఎక్కువే. ఈ నగరానికి రెండున్నర శతాబ్దాల చరిత్ర ఉంది. కుజ్ దర్, గందావా, నుష్కి, క్వెట్ట వంటి నగరాలకు ఈ కలాత్ నగరం దాటుకునే వెళ్ళాలి. అందుకని ఈ నగరానికి ప్రత్యేకత ఏర్పడింది. పెద్ద పెద్ద గోడల మధ్య ఉన్న ఈ నగరం మధ్యలో ఒక పెద్ద భవంతి ఉంది. ఇది బెలూచీస్థాన్ రాజకీయాలకు కేంద్రం. ఇక్కడ ముస్లిములు, బ్రిటిష్ ప్రభుత్వపు రెసిడెంట్ అధికారి, కలాత్ కు చెందిన మీర్ అహ్మద్ యార్ ఖాన్ ల సమావేశం జరుగుతోంది. వారి మధ్య ఒక ఒప్పందం జరగబోతోంది. దాని ప్రకారం నేడు, అంటే 11 ఆగస్ట్, 1947 నుంచి కలాత్ స్వతంత్ర రాజ్యంగా అవతరిస్తుంది.
బ్రిటిష్ రాజ్య వ్యవస్థలో బెలూచీస్థాన్ కు చెందిన ఈ కలాత్ కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. మొత్తం 560 సంస్థానాల్లో చాలామటుకు ద్వితీయ శ్రేణి స్థాయిని ఇచ్చిన బ్రిటిష్ పాలకులు సిక్కిం, భూటాన్, కలాత్ లకు మాత్రం ప్రధమ శ్రేణి హోదా కల్పించారు. మధ్యాహ్నం 1గం.లకు ఒప్పందంపై మూడు పక్షాల సంతకాలు అయిపోయాయి. ఈ ఒప్పందం ప్రకారం కలాత్ ఇక భారత్ లో భాగం కాదు. ఇది స్వతంత్ర రాజ్యం. మీర్ యార్ ఖాన్ ఈ రాజ్యపు మొదటి ప్రముఖ్ గా ఉంటారు.
కలాత్ లోనే కాక మీర్ అహ్మద్ యార్ ఖాన్ ప్రాబల్యం చుట్టుపక్కల ఉన్న లాస్బెలా, మక్రాన్, ఖరాన్ ప్రాంతాల్లో కూడా వ్యాపించింది. అందువల్లనే భారత విభజనకు ముందే ఈ ప్రాంతాలను కలిపి మీర్ అహ్మద్ యార్ ఖాన్ నేతృత్వంలో బలూచిస్తాన్ ఏర్పాటు జరిగిపోయింది.
–0–0–0–0–
`ఆల్ ఇండియా రేడియో, డిల్లీ కార్యలయం…పత్రికా ప్రకటన అన్నీ పత్రికలకు పంపారు. ఈ ఆకాశవాణి కార్యాలయంలో తగిన వ్యవస్థ ఉంది. 14, 15 ఆగస్ట్ కార్యక్రమం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. 14 రాత్రి జరిగే కార్యక్రమపు ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి నుంచే జరుగుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.
14 ఆగస్ట్..
రాత్రి 8.10 గం.న నుంచి 8.45 వరకు – ఇండియా గెట్ వద్ద జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది. ఆ కార్యక్రమ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆంగ్లంలో ఉంటుంది.
రాత్రి 10.30 గం. న నుంకి 11.00 వరకు – శ్రీమతి సరోజినీ నాయుడు సందేశం ఆంగ్లంలో ప్రసారమవుతుంది. ఆ తరువాత జవహర్ లాల్ నెహ్రూ సందేశం ఆంగ్లంలో ప్రసారమవుతుంది. ఆ తరువాత ఇద్దరి సందేశాల హిందీ అనువాదం ప్రసారమవుతుంది. ఇవి 17.84 మెగా హెడ్జ్ మరియు 21.51 మెగా హెడ్జ్ మీటర్ల వద్ద ప్రసారం అవుతాయి.
రాత్రి 11.00 గం.ల నుంచి 12.30 వరకు – రాజ్యాంగ సభలో జరిగే అధికార బదలాయింపు కార్యక్రమం ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం అవుతుంది. ఇది 17.76 మెగా హెడ్జ్, 21.51 మెగా హెడ్జ్ మీటర్లపై ప్రసారమవుతుంది.
–0–0–0–0–
డిల్లీలోని ఒక పెద్ద భవంతి. గోహత్య వ్యతిరేక పరిషత్ సమావేశం జరుగుతోంది. జిన్నా భవనాన్ని కొనుగోలు చేసే సేఠ్ రామకృష్ణ దాల్మియా ఆ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. గో వంశ రక్షణ, గో పోషణ భారతీయుల మౌలిక అధికారంగా గుర్తించాలంటూ స్వతంత్ర భారత ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించాలని ఆ సమావేశంలో తీర్మానించారు. ప్రతి సంవత్సరం కోట్ల సంఖ్యలో ఆవులను హతమారుస్తున్నారు. అది పూర్తిగా ఆగిపోవాలి. దేశ ప్రగతిలో గో సంతతి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఔరంగజేబ్ మార్గ్ లో ఉన్న జిన్నా భవంతినే గో రక్షా ఉద్యమ కేంద్రం చేయాలని రామకృష్ణ దాల్మియా భావించారు.
–0–0–0–0–
కరాచీ..
భోజన విరామం తరువాత జరిగిన పాకిస్థాన్ రాజ్యాంగ సభ సమావేశంలో చెప్పుకోదగిన విషయాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. కేవలం పాకిస్థాన్ జాతీయ జెండా గురించి నిర్ణయం జరిగింది. జాతీయ జెండాలో ఒక వంతు తెల్లని రంగు, మిగిలిన మూడు వంతులు ఆకుపచ్చరంగు ఉంటాయి. నెలవంక, నక్షత్రం కూడా జెండాలో ఉంటాయి. ఈ విషయమై ప్రస్తావన సభ్యుల ముందు ఉంచినప్పుడు ఏకగ్రీవంగా ఆమోదించారు.
–0–0–0–0–
మద్రాస్,
ఇక్కడ జస్టిస్ పార్టీ సమావేశం జరుగుతోంది. ఇది 31 ఏళ్ల పార్టీ. అయినా ఇప్పటికీ బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలనే ప్రచారం చేస్తూ ఉంటుంది. అటువంటి విధానాన్నే కొనసాగిస్తోంది. పార్టీ అధ్యక్షుడు పి.టి. రాజన్ భారత స్వాతంత్ర్యాన్ని ఆహ్వానిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు. దానిని అంతా ఆమోదించారు. అలాగే 15 ఆగస్ట్ న మద్రాస్ రాజ్యమంతటా స్వతంత్ర దినోత్సవాన్ని అట్టహాసంగా జరపాలని కూడా నిర్ణయించారు.
దేశానికి స్వాతంత్ర్యం లభించిన మరుక్షణమే భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని కూడా తీర్మానం ఆమోదించారు.
–0–0–0–0–
మౌంట్ బాటన్ ఈ రోజు చాలా పని ఒత్తిడిలో ఉన్నారు. నిద్ర లేవగానే తన గదిలో ఉన్న క్యాలండర్ ను నిశితంగా చూశారు. కేవలం నాలుగు రోజులు….తమ ఆధీనంలో ఉన్న భారత్ నుంచి వైదొలగడానికి ఇక నాలుగు రోజులే మిగిలిఉన్నాయి.
ఉదయం డా. కువర్ సింగ్, సర్దార్ పణిక్కర్ తో మౌంట్ బాటన్ సమావేశమయ్యారు. ఇది చాలా ముఖ్యమైన సమావేశం. భోపాల్ నవాబు మాటలు విని బికనీర్ మహారాజ కూడా తమ రాజ్యాన్ని భారత్ లో విలీనం చేయడం గురించి ఇంకా నిర్ణయం ఏది తీసుకోలేదని ప్రకటించాడు. కానీ ఇలాంటి చిన్న చిన్న స్వతంత్ర సంస్థానాలు ఉండరాదని మౌంట్ బాటన్ అభిప్రాయం. ఎందుకంటే ఇవి ఎక్కువైతే బ్రిటిష్ పాలకులకు వాటిని నియంత్రించడం కష్టమైపోతుంది. ఈ విషయాన్ని చర్చించడానికి జరుగుతున్న ఆ సమావేశం ముఖ్యమైనది.
ఇలాంటి రాజ్యాల వల్ల ఏర్పడే సమస్యల గురించి మౌంట్ బాటన్ డా. కువర్ సింగ్, సర్దార్ పణిక్కర్ లతో చర్చించారు. బికనీర్ పాకిస్థాన్ లో కలిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో చెప్పారు. ఈ సమావేశం తరువాత అలాంటి ప్రమాదం తప్పుతుందనే బాటన్ భావించారు.
మధ్యాహ్నం మౌంట్ బాటన్ దక్కన్ ప్రాంతంలోని హైదారాబాద్ సంస్థానపు నవాబుకు లేఖ వ్రాసారు. హైదారాబాద్ ను భారత్ లో విలీనం చేయడానికి కాలవ్యవధిని మరో రెండు నెలలపాటు పొడిగిస్తున్నట్లు తెలియజేశారు.
–0–0–0–0–
బెంగాల్ లో తూర్పున జొస్తేర్, ఖుల్నా, రాజ్ షాహీ , దినాజ్ పూర్, రంగ్ పూర్, ఫరీద్ పూర్, బారిసాల్ , నదియా మొదలైన గ్రామాల్లో అప్పుడప్పుడే చీకట్లు అలుముకుంటున్నాయి. దీపాలు వెలిగిస్తున్నారు. చిరుజల్లు పడుతోంది..ఎప్పుడు గొడవలు జరుగుతాయోననే భయం సర్వత్ర నెలకొని ఉంది. ఈ గ్రామాలన్నిటిలో హిందువులే అధిక సంఖ్యాకులు. కానీ గత సంవత్సరం ప్రత్యక్ష చర్య తరువాత ఇక్కడ ముస్లిం లీగ్ గుండాల కార్యకలాపాలు పెరిగాయి. అక్కడి డాక్టర్లు, ఉపాధ్యాయులు, జమీందారులు పశ్చిమ బెంగాల్ కు వెళ్లిపోవాలనే బెదిరింపులు వస్తున్నాయి.
బారిసాల్…70, 80 వేల జనాభా కలిగిన చిన్న పట్టణం. దీని తూర్పు వెనిస్ అని కూడా అంటారు. ఇందులో పూర్తిగా హిందూ సంస్కృతి కనిపిస్తుంది. బారిసాల్ పై బెంగాల్ నవాబు కూడా అధికారం చెలాయించలేకపోయాడు. ముకుంద దాస్ అనే కవి నిర్మించిన భావ్యమైన కాళీ మందిరం, హిందూ రాజులు తవ్వించిన విశాలమైన చెరువు ఇక్కడి ప్రత్యేకతలు. ఇలాంటి హిందూ సంస్కృతిక కేంద్రం నుంచి హిందువులనే తరిమేయాలని ముస్లింలు ప్రయత్నిస్తున్నారు. బారిసాల్, తూర్పు బెంగాల్ హిందువులు ఏం పాపం చేసుకున్నారో!…
–0–0–0–0–
మధ్యాహ్నం 4.30 గం.లు అయింది. ఎండ తగ్గుతోంది. సోధెపూర్ ఆశ్రమంలో కాస్త హడావిడిగా ఉంది. ఎందుకంటే గాంధీజీ కలకత్తాలోని మతకలహాల ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు. ఖండిత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి డా. ప్రఫుల్ల చంద్ర ఘోష్, కలకత్తా మేయర్ ఎస్.సి. రాయ్ చౌధారి, మాజీ మేయర్ ఎస్.ఏం. ఉస్మాన్ లు అప్పటికే ఆశ్రమం చేరుకున్నారు. వీరిని తీసుకుని గాంధీజీ ఈ ప్రాంతాల్లో పర్యటిస్తారు.
కొద్దిసేపటికే అక్కడికి కలకత్తా పోలీస్ కమీషనర్ ఎస్.ఎన్. చటర్జీ కూడా వచ్చారు. పర్యటన ప్రారంభమయింది. ఐదారు కార్లు..ముందు వెనుక పోలీసు బందోబస్తు..ఇలా గాంధీజీ కలకత్తా పర్యటన సాగుతోంది. పాయిక్ పారా, చిట్ పోర్, బెల్ గాచీ, మాణిక్ తోలా, బెలియాఘాట్, నక్రేల్, తంగర, రాజా బజార్..ఇలా అన్నీ ప్రాంతాల గుండా గాంధీజీ వాహన శ్రేణి వెళుతోంది. ఎక్కడ చూసినా కాలి, కూలిపోయిన ఇళ్ళు, ధ్వంసమైన దేవాలయాలు, దుకాణాలు కనిపిస్తున్నాయి.
చిత్ పుర్ లో తగలబడి, కూలిపోయిన హిందువుల ఇళ్లను చూస్తూ కొద్దిసేపు గాంధీజీ అక్కడే నిలబడ్డారు. అనేక ఇళ్లను దుండగులు ధ్వంసం చేశారు. ఆ సాయంత్రం వేళ పూర్తిగా కాలి, ధ్వంసమైన ఇళ్ల మధ్య, భయానక వాతావరణంలో గాంధీజీ కొద్దిసేపు నిశ్చేష్టులై నిలబడిపోయారు.
బెలియాఘాట్ పరిసరాల్లో వందలాది మంది గుమికూడారు. ఇక్కడ జనం గాంధీజీకు జయకారాలు పలికారు కానీ, ఇతర ప్రదేశాల్లో ఏమి పట్టించుకోకుండా మౌనంగా చూస్తూ నిలబడ్డారు. సర్వస్వం కోల్పోయిన స్థితిలో ఆ హిందువుల్లో నిరాశ, నిర్వేదం నిండిపోయాయి. వాళ్ళంతా గాంధీజీని చూస్తూ నిలబడ్డారు.
50 నిముషాలపాటు సాగిన ఈ పర్యటనలో చూసిన భయంకరమైన పరిస్థితులు గాంధీజీని విచారంలో ముంచివేశాయి.
క్రితం సంచికల కోసం ఈ క్రింది లింకులను క్లిక్ చేయండి:
10 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
9 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
8 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
7 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
6 ఆగస్ట్ 1947: దేశ విభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
5 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
4 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
3 ఆగస్ట్ 1947: దేశవిభజనకు ముందు 15 రోజులు ఏం జరిగింది?
2 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?
1 ఆగస్ట్ 1947: దేశ విభజనకు 15 రోజుల ముందు ఏం జరిగింది?
This article was first published in 2019