స్వాగతానికి ప్రత్యుత్తరం
విశ్వమత మహాసభ, చికాగో,
సెప్టెంబర్ 11వ తేది, 1893వ సంవత్సరం.
అమెరికన్ సోదర సోదరీమణులారా,
మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ సమయంలో మీతో మాట్లాడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం తరఫున మీకు నా అభివాదాలు; సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివాదాలు; నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారత జనం తరఫున మీకు నా అభివాదాలు.
సహనభావాన్ని వివిధదేశస్థులకు తెలిపిన ఘనత, గౌరవం సుదూర దేశస్థులైన ప్రాచ్యులకు చెందటం ఎంతో సమంజసమని, అటువంటి ప్రతినిధుల గురించి ఈ సభావేదిక నుంచి మీకు తెలిపిన వక్తలకు కూడా నా అభివాదాలు. సహనాన్ని, సర్వమత సత్యత్వాన్ని,లోకానికి భోదించిన సనాతనధర్మం నాదని గర్విస్తున్నాను. సర్వమత సహనాన్నేకాక సర్వమతాలూ సత్యాలనే మేం విశ్వసిస్తాం. సమస్తమతాలకు చెందిన, సమస్త దేశాలనుంచీ పరపీడితులై , శరణాగతులై వచ్చినవారికి శరణమిచ్చిన దేశం నా దేశమని గర్విస్తున్నాను. రోమన్ల నిరంకుశత్వానికి గురై తమ దేవాలయం తుత్తునియలైన ఏటనే దక్షిణ భారతదేశానికి వచ్చి,శరణుపొందిన యూదులను –నిజమైన యూదులనదగ్గవారిలో మిగిలినవారిని – మా కౌగిట చేర్చుకున్నామని తెలపటానికి గర్విస్తున్నాను. మహాజొరాస్టరీయ సంఘంలో మిగిలినవారికి శరణు ఇచ్చి –నేటికీ వారిని ఆదరిస్తున్న(సనాతన) ధర్మం నా ధర్మమని గర్విస్తున్నాను. సోదరులారా, ప్రతిరోజూ కోట్లాది పారాయణం చేస్తున్న, నేను కూడా అతిబాల్యంనుంచి పారాయణ చేస్తూన్న ఒక స్త్రోత్తం నుంచి కొన్ని చరణాలను ఉదహరిస్తాను: “వివిధ ప్రదేశాల్లో జన్మించిన నదులు సముద్రంలో కలసినట్లే, వివిధ భావాలచే మనుషులు అవలంబించే వివిధ ఆరాధనామర్గాలు వేరువేరుగా కనపడినా, సర్వేశ్వరా, నిన్నే చేరుతున్నవి.”
“ ఎవరు ఏ రూపంలో నన్ను గ్రహిస్తారో, నేను వారినలాగే అనుగ్రహిస్తున్నాను. అందరూ సమస్త మార్గాల ద్వారా చివరికి నన్నే చేరుతున్నారు” అని గీతలో తెలిపిన అద్భుతసిద్దాంతాన్ని ప్రపంచంలో ఇంతవరకు జరిగిన మహోత్కృష్ట సమావేశాల్లో ఒకటైన ఈ మతమహాసభే సమర్థిస్తూ, ముక్తకంఠంతో లోకానికి చాటుతుందని చెప్పవచ్చును. శాఖాభిమానం, స్వమత దురభిమానం, దానివల్ల కలిగిన మూర్ఖత్వం సుందరమైన యీ జగత్తును చిరకాలంగా అక్రమించాయి. వాటివల్ల దౌర్జన్యాలు జరిగి అనేకసార్లు ఈ భూమి రక్తసిక్తమైంది. ఈ ఘోర రాక్షసులు చెలరేగి ఉండకుంటే, మానవ సమాజం నేటికంటే విశేషాభివృద్ది చెంది ఉండేది. కానీ ఆ ధౌర్జన్య శక్తుల అంతకాలం ఆసన్నమైంది; ఈ మహాసభ గౌరవార్థం నేటి ఉదయం మోగించిన గంట కత్తితో కానివ్వండి, కలంతో కానివ్వండి, సాగించే సర్వవిధాలైన స్వమత దురభిమానానికీ, పరమత ద్వేషానికి ముగింపు వాక్యం కావాలి. నానావిధాలైన హింసకు మాత్రమేకాక, కొందరిలోని నిష్టుర ద్వేషభావాలకు శాంతిపాఠం కాగలదని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.