Home News వైభవంగా జరిగిన `తెలంగాణా వైభవం సదస్సు’

వైభవంగా జరిగిన `తెలంగాణా వైభవం సదస్సు’

0
SHARE

తెలంగాణా చారిత్రక- సాంస్కృతిక సామాజిక చైతన్యం శతాబ్దాలుగా కొనసాగుతోంది. సాహిత్యం, కధలు, శిల్పం, వృత్తి నైపుణ్యాలతో నిర్మాణమైన వస్తుసoస్కృతి, దేవాలయాలు, పండుగల వైభవానికి ఈ చైతన్యానికి సాక్షులుగా నిలిచి ఉన్నాయి. ఇవాళ లభిస్తున్న శాస్త్ర సాంకేతిక సాహిత్య శాసనాధారాలతో తెలంగాణా వైభవ దీప్తిని లోకార్పణం చేయాలన్న సత్సంకల్పంతో తెలంగాణా వైభవ ఉత్సవం రూపుదిద్దుకుంది.

ప్రజ్ఞా భారతి మరియు ఇతిహాస్ సంకలన సమితి సంయుక్తంగా `తెలంగాణ వైభవం’ సదస్సు చారిత్రక, సాహిత్య, సంగీత విభావరి ఉత్సాహంగా, ఆనందభరితమైన ఉత్సవంగా, కరీంనగర్లో19-22 సెప్టెంబర్ 2019 లో కొనసాగింది. మొదటిరోజు వేలాది పట్టణ ప్రజలు, స్కూల్ విద్యార్థులు, ఎందరో పురప్రముఖులు, ప్రజా కళాకారులు  పాల్గొన్న నగర ఉత్సవ-శోభాయాత్రతో  19సెప్టెంబర్ తేదిన తెలంగాణా వైభవం ఉద్ఘాటన జరిగింది. 20సెప్టెంబర్ కార్యక్రమం లాంఛనంగా కేంద్రమంత్రి శ్రీ కిషన్ రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్, ప్రజ్ఞాభారతి ఛైర్మన్ శ్రీ హనుమాన్ చౌదరిగారు, శ్రీ రాజభాస్కర్ రెడ్డి, ఇతిహాస్ సంకలన సమితి నుంచి శ్రీ దత్తాత్రేయ శాస్త్రి, ఆర్ఎస్ఎస్ ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణామూర్తి మొదలైన పెద్దల చేతుల మీదుగా వైభవంగా ప్రారంభమైంది.

20సెప్టెంబర్ సాయంత్రం కరీంనగర్ విద్యార్థులు పాల్గొన్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణా సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పిన  పేరిణి వీరనాట్య శివతాండవ, లాస్య నృత్యాలు, బోనాలు బతుకమ్మ ఇతర నృత్యాలు అద్భుతంగా జరిగాయి. గ్రామీణ జానపద వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ జానపద గేయ నృత్యాలతో తెలంగాణా వైభవం అద్భుతంగా ప్రారంభమైంది. 

21 సెప్టెంబర్ 2019 పూర్తి రోజంతా `తెలంగాణా పురాతన చరిత్ర, సాహిత్యం, ఇతిహాసాల’పై సదస్సు జరిగింది. `పురాతన తెలంగాణా సాహిత్యం’ సమావేశంలో, చరిత్రకారులు సాహిత్యకారులు కవులు డా. శ్రీ కమలాకర్ శర్మ సాగి, డా. శ్రీమతి మనోహరి సాగి,  డా. ఆచార్య శ్రీమతి సూర్య ధనంజయ్ సవివరంగా తెలంగాణా దేవాలయాలు, గుడి శాసనాలు, జానపదుల జాతరల గురించి ప్రసంగిచారు. రచయిత శ్రీ భాస్కర్ యోగి తెలంగాణలో `సంకీర్తన సాహిత్యం’ గురించి సోదాహరణంగా, గేయాలు ఆలపిస్తూ ఉల్లాసంగా ప్రసంగించారు.  ప్రొ. డా. సుదర్శన్ రావు ప్రజ్ఞాభారతి, ఇతిహాస సమితులకు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని చేస్తున్నందుకు అభినందనలు తెలియచేసారు. భారతీయ చరిత్ర మౌఖిక సంప్రదాయం, ఇతర ఇతిహాసాలలో ఉందని చెపుతూ వాటిని సమగ్రంగా పరిశోధించాలని చెప్పారు. ప్రొ. కె.పి.రావు తెలంగాణా పురావస్తు శాఖ పరిశోధనలలో బయటపడిన రాతియుగం నటి అవశేషాలను వివరించారు. ప్రముఖ న్యూరో సర్జన్, ప్రాచీన నాణాల నిపుణులు డా. రాజారెడ్డి, తెలంగాణాలో ముఖ్యంగా కోటిలింగాలలో లభ్యమైన నాణాల గురించి వివరించారు, శాతవాహనుల వంశoలో రాజుల గురించి చెప్పారు. ప్రొ. కిషన్ రావు, శ్రీ కొండ శ్రీనివాసులు, డా. దామరాజు సూర్యకుమార్, కాకతీయుల చరిత్ర గురించి వివరించారు.  ప్రొ. జైకిషన్ డెక్కన్ ప్రాంత కోటలు, ఆయుధాల తయారి గురించి చెప్పారు. డా. గన్నమరాజు గిరిజామనోహర్ తెలంగాణా శతక సాహిత్యం గురించి ప్రసంగించారు. డా. రేమెళ్ళ అవధానులు, తెలంగాణ ప్రాంతంలోని మల్లినాధ సూరి, బాసర క్షేత్రం, ప్రతాపరుద్రుడు వేద వాగ్మయాన్ని కాపాడిన తీరు వివరించారు. డా. సంఘభట్ల నరసయ్య తెలంగాణ పురాణ సాహిత్యం, ఇతిహాసాలు, కావ్యాల గురిoచి ప్రసంగించారు. డా. సునీతా రెడ్డి తెలంగాణా జానపద, ప్రకృతి అమ్మవారి పండుగలైన బతుకమ్మ, బోనాలు మొదలైన గురించి ప్రసంగించారు.

21 సెప్టెంబర్ కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, కరీంనగర్ ఎంపి శ్రీ బండి సంజయ్, ప్రజ్ఞాభారతి ఛైర్మన్ శ్రీ హనుమాన్ చౌదరిగారు, శ్రీ రాజభాస్కర్ రెడ్డి, శ్రీ రాజేంద్ర చడ్డా, శ్రీమతి విజయభారతి,  ఇతిహాస్ సంకలన తరపున శ్రీ దత్తాత్రేయ శాస్త్రి గారు, ప్రముఖ శాస్త్రకారులు, చారిత్రిక పరిశోధకులు, సాహిత్యకారులను సన్మానించారు. సన్మానితులలో  శ్రీభాష్యం విజయసారధి, ఆచార్య శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీ ఎల్లాప్రగడ సుదర్శన్ రావు, శ్రీ గన్నంరాజు గిరిజామనోహర్, డా. జయసెట్టి రమణయ్య వంటి ప్రముఖులు ఉన్నారు. భవ్యమైన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీ పటేల్, దేశ రాష్ట్ర సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేస్తానని మాట ఇచ్చారు. మరచిపోయిన సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి మనం పునర్నిర్మించుకోవాలని కోరారు.   

ఈ సందర్భంగా వెలువరించిన `తెలంగాణా వైభవం’ స్మరణికను కేంద్రమంత్రి, ఇతర విశిష్ట అతిధులు ఆవిష్కరించారు.

రోజంతా సదస్సులో ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి, కరీంనగర్ స్కూల్ పిల్లలు పేరిణి వంటి ఎన్నో సంప్రదాయ నృత్యాలు, బోనాలు బతుకమ్మ నృత్యాలను ప్రదర్శించి సభికులను అలరించారు. సాయంత్రం ప్రముఖ కవులు చరిత్రకారులు స్వయంగా పాల్గొన్న `ప్రతాపరుద్రీయం’ నాటిక ప్రదర్శన జరిగింది. 

22 సెప్టెంబర్ తేదిన జరిగిన `తెలంగాణా వైభవం’ సమాపన కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ తెలంగాణా  వైభవం’  ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  కరీంనగర్ ఎంపి శ్రీ బండి సంజయ్, ఆర్ ఎస్ ఎస్ ప్రాంత సంఘచాలక్ శ్రీ బూర్ల దక్షిణామూర్తి, ఇతిహాస్ సంకలన సమితికి చెందిన శ్రీ దత్తాత్రేయ శాస్త్రి, శ్రీ రాజేంద్ర చడ్డా, శ్రీ రాజభాస్కర్ రెడ్డి మొదలైన వారు సమాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజ్ఞాభారతికి చెందిన శ్రీ రాజభాస్కర్ రెడ్డి, శ్రీ నిరంజనాచారి వారికి స్వాగతం పలికి, ౩-రోజుల `తెలంగాణా వైభవం’ ఉత్సవ కార్యక్రమం గురించి అంతకు ముందు జరిగిన తెలంగాణా శోభాయాత్ర గురించి వివరించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయగారు మాట్లాడుతూ మన జాతి వైభావానికి, సంస్కృతిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని చెప్తూ, హిమాచల్ ప్రదేశ్- తెలంగాణాల సాంస్కృతిక-దేవాలయ వారసత్వాన్ని నిలబెట్టే విధంగా పర్యాటక శాఖ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  

ఆ రోజు జరిగిన సదస్సులో చరిత్రకారులు నిపుణులు వివిధ అంశాల మీద ప్రసంగిoచారు.  అవధాని అవుసుల భానుప్రకాష్ గారు సంప్రదాయ కళాకారులు, వారి కళాకృతుల గురించి వివరించారు. రుంజ వాద్యకారులు, బైండ్ల వారు, గొల్ల సుద్దులు, ఒగ్గు కళాకారుల గురించి వివరిస్తూ తెలంగాణా మౌఖిక సంప్రదాయంలో, సంప్రదాయ కళాకారులు రామాయణ భారత గాధలు, రేణుక ఎల్లమ్మ చరిత్రలు, జానపద చారిత్రక కధలు ప్రజల వద్దకు శతాబ్దాలుగా సేవ చేస్తున్నారని చెప్పారు. ఆచార్య జె. రాములు సాధికారంగా ఉదాహరణలతో మహామహోపాధ్యాయ మల్లినాధ సూరి రచనల గురించి వివరించి, ఆయాన కాళిదాసు, శ్రీ హర్షుడు, భట్టి కావ్యాలపై వ్యాఖ్యానాలు వ్రాసి, ప్రపంచానికి వారిని పరిచయం చేసారు. శ్రీ భండారు ఉమామహేశ్వరరావు కాకతీయ నాట్య- శిల్పకళ, దేవాలయ మరియు కోటల శిల్పకళల గురించి సోదాహరణంగా వివరించారు. శ్రీ సంక్యేపల్లి నాగేంద్రశర్మగారు తెలంగాణలో పూర్వకాలంలో వ్యాప్తిచెందిన జైన బౌద్ధ సంస్కృతి, ఆలయాలు, అవశేషాలను గురించి తెలియచేశారు. డా. శంకర్ రావు గిరిజన సంస్కృతి, జాతరలు వాటిని అభివృద్ధి చేయాల్సిన అవసర౦ గురించి చెప్పారు. డా. గండ్ర లక్ష్మణ్ రావు గారు తెలంగాణాలో శాస్త్రసాంకేతిక విజ్ఞ్యానాన్ని తెలియచేసే గ్రంథాల గురించి ఎన్నో విశేషాలు తెలియచేసారు. వ్యాకరణ అలంకార శాస్త్రాలు, లోహశాస్త్రం, సంగీతనృత్య శాస్త్ర గ్రంథాల వివరాలు చెప్పారు. INTACH నిపుణులు డా. పాండురంగారావు, UNESCO సంస్థ రామప్ప దేవాలయాన్ని `ప్రపంచ వారసత్వ చిహ్నం’గా గుర్తించడానికి చేస్తున్న పనులను వివరించారు. డా. వడ్లూరి ఆంజనేయరాజు తెలంగాణలో జానపద సాహిత్యం, వివిధ రకాలైన రామాయణ మహాభారత పాటలు, చారిత్రక పాటలు, జానపద కళాకృతుల గురించి వివరించారు.  ఆచార్య శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి వీధి భాగవతులు, యక్షగానాలు, చిందు భాగవతులు, చిడతల భాగవతుల  మొదలైన జానపద కళలు, వారు చేసిన కళాసేవ, ఈ దేశం, ధర్మం కోసం వారు సామాన్యుల కోసం చేసిన సేవను, సామాన్య జనంలో రామాయణ భారత భాగవతాల పట్ల ఉన్న ప్రేమ, భక్తిని తెలియచేస్తూ ఉత్తేజపూరితంగా ప్రసంగించారు.