Home News హిందువులకు మానవహక్కులు ఉండవా? – మానవహక్కుల సమావేశంలో నిలదీసిన భారతీయ కాలమిస్ట్

హిందువులకు మానవహక్కులు ఉండవా? – మానవహక్కుల సమావేశంలో నిలదీసిన భారతీయ కాలమిస్ట్

0
SHARE

అమెరికాలో జరిగిన మానవహక్కుల కమిషన్ సమావేశంలో పాల్గొన్న సునందా వశిష్ట్ అనే పత్రికా రచయిత, సామాజిక కార్యకర్త 1990లో కాశ్మీరీ హిందువులపై సాగిన దారుణ మారణకాండ, అత్యాచారాలను ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు. “తీవ్రవాదం నన్ను నా ఇంటి నుంచి పూర్తిగా దూరంచేయడమేకాదు, నా మూలాల నుంచి పెకిలించివేసింది’’ అంటూ కాశ్మీరీ హిందువుల వేదనను వెలిబుచ్చారు.

మానవహక్కుల సమావేశానికి హంగరికి చెందిన యూదు జాతీయుడు, అమెరికా కాంగ్రెస్ సభ్యుడు అయిన టామ్ లాంటోస్ పేరు పెట్టడం పట్ల వ్యాఖ్యానించిన సునంద భారతీయులు, యూదులు ఎదుర్కొన్న పరిస్థితులు, ఇస్లామిక్ తీవ్రవాదం వల్ల నష్టపోయిన తీరులో ఎంతో పోలిక ఉందంటూ ఆయన చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. పాకిస్థానీ తీవ్రవాదుల చేతిలో హతమైన అమెరికా జర్నలిస్ట్ డేనియల్ పెరల్ చనిపోవడానికి ముందు తన తల్లిదండ్రులు యూదులని, తను యూదునని చెప్పుకున్నాడని అన్నారు. పెరల్ మాటలనే తీసుకుని `నా తల్లిదండ్రులు కాశ్మీరీ హిందువులు, నేను కాశ్మీరీ హిందువును’ అని లంటోస్ మానవహక్కుల కమిషన్ కు చెప్పదలుచుకున్నాను. నా ఇంటిని ఛాందసవాద ఇస్లామిక్ తీవ్రవాదం ధ్వంసం చేసిందని గుర్తుచేయదలుచుకున్నాను. స్వతంత్ర భారతంలో అమానుషమైన అణచివేతకు, తరిమివేతకు గురైన కాశ్మీరీ హిందువుల గొంతును తాను వినిపిస్తున్నానని సునంద అన్నారు.

ఆనాడు కాశ్మీర్ హిందువులు అనుభవించిన దారుణాలకు తాను ప్రత్యక్ష సాక్షినని చెప్పిన సునంద కొన్ని సంఘటనలను వివరించారు. ఒక స్కూలులో ల్యాబ్ అసిస్టెంట్ గా పనిచేసిన గౌరి జోత్యాగ్ ను ఎత్తుకుపోయిన ముష్కరులు సామూహిక అత్యాచారం చేయడమేకాక రంపపు మిల్లులో రెండుగా కోసి వధించారు. కాగిన్ ఒక యువ కాశ్మీరీ హిందూ ఇంజనీర్. అతన్ని దుండగులు తరిమినప్పుడు అతను తన ఇంట్లోని అటకపై ఉన్న బియ్యపు డబ్బాలో దాక్కున్నాడు. కానీ ఎంతోకాలంగా అతని కుటుంబంతో కలసిమెలసి జీవిస్తున్న పొరుగువారే అతని ఆచూకీ తీవ్రవాదులకు చెప్పడంతో వాళ్ళు ఆ బియ్యం డబ్బాలోని అతనిపై కాల్పులు జరిపి హతమార్చడమేకాక అతని రక్తంతో తడిసిన బియ్యాన్ని బలవంతంగా అతని భార్యతోనే తినిపించారు. తీవ్రవాదులు ఇంతటి ఘోరానికి ఒడిగట్టడానికి కారణం జోత్యాగ్, కాగిన్ లు హిందువులు కావడమేనని సునంద ఆవేదన వ్యక్తంచేశారు. జోత్యాగ్, కాగిన్ ల కంటే తాను కాస్త అదృష్టవంతురాలిని కావడంతో బతికిబయటపడ్డానని, ఇప్పుడు అమానుషకృత్యాల గురించి చెప్పగలుగుతున్నానని అన్నారు.

పాశ్చాత్య ప్రపంచం ఐసిస్ అకృత్యాలను చూడానికి చాలాకాలం ముందే కాశ్మీర్ ఛాందసవాద ఇస్లామిక్ తీవ్రవాదపు అమానుషత్వాన్ని అనుభవించిందని ఆమె అన్నారు. నేను, నా కుటుంబం సర్వం కోల్పోయినప్పుడు, అమానుష హింసకు గురైనప్పుడు ప్రపంచం మౌనం వహించింది. జనవరి 9 కాళరాత్రి `తమకు హిందూ పురుషులులేని, హిందూ స్త్రీలు మాత్రమే ఉన్న కాశ్మీర్ కావాలనే’ నినాదాలతో కాశ్మీర్ హోరెత్తినప్పుడు ఈ మానవహక్కుల ఉద్యమకారులు ఎక్కడున్నారు? ఆనాడు ఎందరిదో జీవించే హక్కును కూడా తీవ్రవాదులు కాలరాచినప్పుడు మానవహక్కుల ప్రవర్తకులు ఎక్కడున్నారు? తీవ్రవాదుల చేతిలో పడితే అనుభవించాల్సిన దారుణ అకృత్యాల నుంచి కాపాడడంకోసం రెండు వంటింటి కత్తులు, ఒక తుప్పుపట్టిన గొడ్డలితో అవసరమైతే మమ్మల్ని ఈ ప్రపంచం నుంచి విముక్తం చేసేందుకు మా నాయనమ్మ సిద్ధపడినప్పుడు ఈ మానవత్వవాదులు ఎక్కడున్నారు? ఆ కాళరాత్రిలో మాకు మూడే మార్గాలున్నాయని తీవ్రవాదులు ప్రకటించారు. పారిపోవడం లేదా మతం మారడం లేదా ప్రాణాలు కోల్పోవడం. రాత్రికిరాత్రి ఇల్లూవాకిళ్ళు వదిలి పారిపోయినవారు బ్రతికిపోయారు. కాస్త ఆలస్యం చేసినవారు ప్రాణాలు కోల్పోయారు. ఈనాటికీ నేను కాశ్మీర్ లో నా ఇంటికి తిరిగి వెళ్ళే అవకాశం లేదు. ఎలాంటి భయం లేకుండా నా మతాన్ని అనుసరించే స్వేచ్ఛ లేదు. మా ఇంటితోపాటు అనేకమంది కాశ్మీరీ హిందువుల ఇళ్ళు ఆక్రమణకు గురయ్యాయి. కొన్ని ఇళ్లను పూర్తిగా తగులబెట్టి, నాశనం చేశారు. మా వేలాది దేవాలయాలను ధ్వంసం చేశారు. హిందూత్వాన్ని, హిందువులను కాశ్మీర్ నుంచి పూర్తిగా తుడిచిపెట్టడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు సాగాయి. ఇప్పుడు కాశ్మీర్ కేవలం ఒక మతానికి మాత్రమే చెందినది. భిన్న మతాలు, పంథాలకు ఉండాల్సిన స్వేచ్ఛ, సమానత్వం, మానవహక్కులు ఇప్పుడు కాశ్మీర్ లో కనిపించవు. హిందువులనేకాదు సిక్కులపైనా కూడా తీవ్రవాదులు దాడులు చేశారు. ముస్లింలను మతం మారుస్తున్నందుకు క్రైస్తవులపైనా కూడా ఫత్వాలు జారీ అయ్యాయి. మైనారిటీ వర్గాలను తరిమివేసినప్పుడు, అణచివేసినప్పుడు, కాశ్మీర్ ను ఇస్లాం రాజ్యంగా మార్చివేయడానికి ప్రయత్నించినప్పుడు మానవహక్కుల పరిరక్షకులు ఎక్కడున్నారు?

తీవ్రవాదం మానవహక్కులకు పూర్తి విరుద్ధం. చిన్న కిరాణా దుకాణం నడుపుకునే గులాం మహమ్మద్ మీర్ వంటివారిని, ట్రక్ డ్రైవర్లను, యాపిల్ వ్యాపారులను కూడా తీవ్రవాదులు వదిలిపెట్టడం లేదు. తమ జీవితం తాము గదుపుకుందామనుకునేవారిని తమ తుపాకి గుళ్ళకి బలిచేస్తున్నారు. ఎందుకంటే అంతా సజావుగా, సామాన్యంగా ఉండటం వాళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళంతా ఎవరు? ఒకపక్క మానవహక్కుల గురించి మాట్లాడుతూ స్వేచ్చా, స్వాతంత్ర్యాల గురించి ఉద్యమించలేని వాళ్ళంతా ఎవరు?

కాశ్మీర్ లో 370 అధికరణం రద్దు గురించి ప్రపంచంలో అనేకమంది గగ్గోలు పెడుతున్నారు. కానీ నిజానికి ఈ చర్య అక్కడ మానవహక్కుల పునరుద్ధరణకు ఎంతో ఉపయోగపడుతుంది. భారత రాజ్యాంగం రూపకల్పనలో అమెరికా రాజ్యాంగపు ప్రభావం ఎంతో ఉంది. కానీ ఆ రాజ్యాంగం జమ్మూకాశ్మీర్ కు వర్తించదు. అయితే 370 అధికరణం రద్దయిన తరువాత జమ్ము, లడఖ్ ప్రజలకు నిజంగా స్వేచ్చా, హక్కులు వచ్చాయి. మిగిలిన భారతీయులకు ఎలాంటి హక్కులు ఉన్నాయో ఇప్పుడు జమ్మూకాశ్మీర్ ప్రజలకు కూడా అవే ఉన్నాయి. త్వరలో అక్కడ పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వస్తాయి. నేను కాశ్మీర్ పుత్రికనని చెప్పుకోవడానికి గర్విస్తాను. నేను కోల్పోయిన కనీస హక్కులు తిరిగి నాకు లభిస్తాయని నేను ఆశిస్తాను.

జాన్ సెఫ్టన్ సిక్కుల గురించి ప్రస్తావించారు. అధ్యక్షుడు క్లింటన్ భారత పర్యటన సమయంలో సిక్కుల మారణకాండ జరిగింది. 35మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ విషయాన్ని ఇప్పటికీ ఎవరు కనీసం ప్రస్తావించరు. ఎందుకంటే వారి ఎజెండా వేరు. సిక్ఖులు రాజ్యాంగాన్ని దాటి స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నేను అనేకమంది సిక్ఖులతో మాట్లాడుతూ ఉంటాను. అలాగే కాశ్మీర్ లో మైనారిటీ వర్గానికి చెందినవారిని కూడా కలుస్తుంటాను. కానీ వాళ్ళెవరూ ఎలాంటి వివాదాన్ని లేవనెత్తడంలేదు. అయితే కాశ్మీర్ లో ఇస్లామిక్ తీవ్రవాదానికి విరుగుడు కనుగొనాలి. ఇప్పటివరకు నేనుతప్ప ఈ సమావేశంలో మాట్లాడిన ఎవరూ ఇస్లామిక్ తీవ్రవాదాన్ని గురించి మాటమాత్రంగానైనా ప్రస్తావించలేదు. ఎందుకని? అది కేవలం నా కల్పనా? కానేకాదు. ఆగస్ట్ తరువాత తీవ్రవాదుల దాడిలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? భద్రతా దళాలు ఒక్కరినీ కూడా హతమార్చలేదు. కేవలం పాకిస్తాన్ ప్రేరిత తీవ్రవాదులే దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని ఒక్కరుకూడా చెప్పరెందుకని?

ఈ ద్వంద్వవైఖరి వల్ల ఉపయోగం లేదు. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని మట్టుపెట్టడంలో ప్రపంచం భారత్ కు అండగా నిలవాలి.