Home News ‘దిశ’ అత్యాచార, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌  

‘దిశ’ అత్యాచార, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌  

0
SHARE

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ అమానవీయ అత్యాచార, హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌ ఘటనలో నిందితులు నలుగురూ హతమయ్యారు.

కోర్టు ద్వారా ‘దిశ’ హత్యకేసు నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకున్న పోలీసులు డిసెంబర్ 6 తెల్లవారుజామున అసలు అత్యాచార, హత్య ఘటనలకు వారు ఏవిధంగా పాల్పడ్డారో తెలుసుకునేందుకు ‘సీన్ రీ-క్రియేషన్’ (ఘటన పునశ్చరణ) ప్రక్రియలో భాగంగా వారిని ఘటనా స్థలికి తీసుకువచ్చారు. ఆ సమయంలో నిందితులు మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు పోలీసుల వద్దనుండి ఆయుధాలు లాక్కుని పారిపోయేందుకు ప్రయత్నించిన సమయంలో జరిపిన ఎదురుకాల్పుల్లో నిందితులు నలుగురూ మరణించారు.

నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ఇదే చర్చ నడుస్తోంది. ఘటనపై వివిధ వర్గాల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికశాతం ఈ ఎంకౌంటర్ ను సమర్ధిస్తూ  “మరణించిన ‘దిశ’కు సరైన న్యాయం జరిగిందం”టూ ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులను ప్రశంసలతో ముంచెత్తడంతో పాటు పోలీస్ కంట్రోల్  రూమ్ నెంబర్ 100కి కాల్ చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా “పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకున్నారు” అంటూ పోలీసుల తీరుపై కొన్ని వర్గాల నుండి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ఎన్‌కౌంటర్‌  జరిగిన ఘటనా స్థలికి స్థానికులు భారీగా చేరుకొని పోలీసులకు అనుకూలంగా నినాదాలు చేస్తూ పూలవర్షం కురిపిస్తున్న వీడియోలతో పాటుగా ఎంకౌంటర్ మృతుల తల్లిదండ్రులు, బంధువుల ఆక్రందనల వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.

‘దిశ’ ఎంకౌంటర్ నిందితుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో ఘటనపై కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరినట్టు సమాచారం.

సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై ప్రశంసల వర్షం!:
‘దిశ’ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంలో సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ‘దిశ’ హత్యతో పాటు ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం కూడా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి రావడంతో పాటు.. గతంలో వీసీ సజ్జనార్ వరంగల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా ఉన్న సమయంలో కూడా తన పరిధిలో ఇలాంటి ఘటనే జరగడం ఇందుకు కారణం. 2008 సంవత్సరంలో వీసీ సజ్జనార్ వరంగల్ ఎస్పీగా ఉన్న సమయంలో ప్రణీత, స్వప్నిక అనే ఇద్దరు యువతులపై ముగ్గురు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఘటన జరిగిన కొంత సమయంలోనే ప్రస్తుత తరహాలో ‘సీన్ రీక్రియేషన్’ కోసం నిందితులను తీసుకువెళ్తుండగా నిందితులు పోలీసుల వద్ద తుపాకులు లాక్కుని పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో జరిపిన ఎన్‌కౌంటర్‌ ఘటనలో నిందితులు హతమయ్యారు. ఆ సమయంలో వీసీ సజ్జనార్ ప్రజల నుండి ప్రశంసలు సంపాదించారు. తాజాగా ‘దిశ’ కేసులో కూడా అదే తరహా ఎంకౌంటర్ ఘటన పునరావృతం అవ్వడం గమనార్హం.