Home Telugu Articles భగవద్గీతా కించిదధీతా.. క్రియతే తస్య యమేన న చర్చా

భగవద్గీతా కించిదధీతా.. క్రియతే తస్య యమేన న చర్చా

0
SHARE

–Usha Turaga Revelli

భగవద్గీతను కించిత్తైనా పఠించి ఆకళింపు చేసుకున్నవారికి యముడిని ఎదుర్కోవలసిన పని లేదు. భగవద్గీత ఎంత పవిత్రమైన గ్రంథం అంటే, మనిషి జీవనంలో ఎదురయ్యే సమస్యలు, చింతలకు పరిష్కారం చూపుతుంది అని అర్థం.  అజ్ఞాన తమస్సు నుంచి వెలుగులోకి దారి చూపుతుంది.

స్వయంగా జగద్గురు ఆది శంకరాచార్య అన్నవి ఈ మాటలు. భగవద్గీత భారతీయ తత్వ చింతనకు మూలాధారం. గీత మానవ జీవన విధానానికి కరదీపిక.  కర్మ సిద్ధాంతానికి కరతలామలకం. సనాతన  హిందూ జీవన గమనానికి దిక్సూచి.

కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైన సమయంలో శ్రీ కృష్ణ భగవానుడు స్వయంగా సారథిగా ఉన్నప్పటికీ పాండవ మధ్యముడైన అర్జునుడు రణస్థలంలో శత్రుపక్షం వైపు తన పితామహులు, గురువులు, బంధుజనులను చూసి కళవెళపడతాడు. తన సొంతవారిపై ఆయుధం సంధించలేనని హతాశుడై కుంగిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునిడికి ప్రవచించినదే భగవద్గీత అన్నది తెలిసిందే. మార్గశిరమాసం శుక్ల ఏకాదశినాడు జరిగిన ఈ మహత్తర ఘట్టాన్ని ఈనాటికి అదే రోజున గీతా జయంతిగా జరుపుకుంటాం. ఈ దైవిక ప్రవచనం సుమారు 3102 బీసీ లో జరిగిందని అంచనా. ఈ శుక్ల ఏకాదశిని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు.

అర్జునిడికి హితబోధగా ప్రారంభమై, సమస్త కాలాలకు సత్యమైన ప్రవచనమై భగవంతుడి విశ్వరూప దర్శనంతో ముగిసిన భగవద్గీతా ఘట్టాన్ని దృతరాష్ట్రుడి సమక్షంలో సంజయుడు అక్షరబద్ధం చేశాడు.

సనాతన ధర్మాన్ని అనుసరించేవారు మార్గశిర శుక్ల ఏకాదశినాడు గీతా జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పాఠశాలల్లో సైతం గీతాపఠనం నిర్వహిస్తారు.

‘గీ’ అక్షరం త్యాగాన్ని, ‘త’ ఆత్మసాక్షాత్కారాన్ని సూచిస్తాయనీ, నిష్కామకర్మ మానవ జీవితంలో సకల చర్యలకూ ప్రాతిపదిక కావాలన్నది గీతాసారమనీ చెప్తారు. సర్వకాల సర్వావస్థల్లో, సకల చరాచర జీవుల్లో, ప్రతి చోట భగవంతుడిని దర్శించుకుంటే అటువంటి వ్యక్తి ఆత్మస్వరూపం తెలుసుకుని ఉన్నతస్థాయికి చేరుకుంటాడు అన్నది గీతాసారమని వివేకానందుడు చెప్పాడు. వేదోపనిషత్తులకి పరివిధాలుగా భాష్యాలు చెప్తున్న దశలో, స్వయంగా జగద్గురువు ఏతెంచి సృష్టి సారాన్ని విప్పిచెప్పాడు, ఇంత కంటే మానవ జీవనానికి మార్గదర్శనం ఏముందని వివేకానందుడు రాసుకున్నాడు.

సమకాలీన ప్రపంచంలో సనాతన ధర్మం మనుగడకి ముప్పు ఏర్పడుతున్న తరుణంలో భగవద్గీత ప్రాముఖ్యత ఎన్నో రేట్లు పెరిగింది. రకరకాల సంక్షోభాలు, సంఘర్షణలు, అవిశ్వాసాలు, అపోహలు హిందువుల మనస్థితిని డోలాయమానం చేసి,  దిక్కుతోచకుండా కొట్టుమిట్టాడేలా చేస్తున్న ఈ సమయంలో గీత చుక్కానిలా పని చేస్తుంది. ఆధునిక వృత్తి జీవితంలో మానెజ్మెంట్ గైడ్ గా పని చేస్తుందని పాశ్చాత్యులు సైతం కనుగొన్నారు.

ధర్మ వర్తన, ధర్మ రక్షణ, ధర్మపోరాటానికి మూల సూత్రాలు గీతలో లభిస్తాయి. గీతాపఠనం చిన్న వయసునుంచే తప్పనిసరి చేసి, పాఠ్యాంశాల్లో చేర్చవలసిన అవసరం ఉంది. జీవితచక్రంలో, జీవనక్రమంలో అనేక ప్రశ్నలకు జవాబులను ఇచ్చే గీతకు జయంతి ఈ రోజే.