Home News ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో `హిందుత్వ ఇన్ చేంజింగ్ టైమ్స్’ పుస్తక ఆవిష్కరణ

ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో `హిందుత్వ ఇన్ చేంజింగ్ టైమ్స్’ పుస్తక ఆవిష్కరణ

0
SHARE

`ప్రజ్ఞా ప్రవాహ’ జాతీయ సంచాలకులు శ్రీ జె. నందకుమార్ గారు రచించిన `హిందుత్వ ఇన్ చేంజింగ్ టైమ్స్’ పుస్తకావిష్కరణ సభ 15ఫిబ్రవరి2020 సాయంత్రం, హైదరాబాద్ ఆస్కి (ASCI) కాంపస్ లో జాతీయవాద సంస్థ ప్రజ్ఞాభారతి నిర్వహించింది. ప్రజ్ఞాభారతి అధ్యక్షులు శ్రీ హనుమాన్ చౌదరిగారు తమ పుస్తక పరిచయ ప్రసంగంలోమాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో మేధోయుద్ధం జరుగుతోందని, దానికి శ్రీ నందకుమార్ వంటి యోధులు, జాతీయవాదులకు బలాన్ని ఇవ్వగలిగే ఇటువంటి పుస్తకం అందించడం మనకు చాలా అవసరం అని చెప్పారు. మన రాజ్యాంగంలో `లౌకిక’ అనే పదం పార్లమెంట్ ద్వారా బలవంతంగా, ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో చేర్చారని, అయితే అనాదిగా అన్ని మతాలను భారత్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉందని చెప్పారు. రచయిత తమ పుస్తకంలో భారత్ లో `లౌకికవాదం’ గురించి, హిందూమతం/హిందుత్వ పదాలను బాగా విశ్లేషిoచారని, సనాతన ధర్మ తత్వమే `హిందుత్వం’ అని చెప్పారు.

ముఖ్య అతిధి `కేరళ కేంద్ర విశ్వవిద్యాలయo’ కులపతి ప్రొ. శ్రీ ఎస్ వి  శేషగిరిరావు గారు, నేడు ప్రపంచమంతా `హిందుత్వం’ గురించి లోతైన చర్చ జరుగుతోందని, ఎంతో మేధాసంపత్తి విశ్లేషణ ఉన్న ఈ పుస్తకం హిందూ తత్వం గురించి అర్ధం చేసుకోవడానికి ఎంతో ఉపయోగమని అన్నారు. మన దేశంలో గత శతాబ్దమంతా కేవలం కమ్యునిస్టు సిద్ధాంతాలు మాత్రమే కొనసాగాయని, ప్రపంచంలో, ముఖ్యంగా సోవియట్ యూనియన్ లో ఘోరంగా విఫలమైనప్పటికీ, అదే ప్రగతిశీలమని చలామణి అవుతోందని అన్నారు. ఈ సందర్భంగా ఆయాన కమ్యునిస్టు సిద్ధాంతాలను విశ్లేషించి వివరించారు. వారి దేశాల్లో మతాన్ని అనుమతించని కమ్యునిస్టులు, మన దేశంలో మాత్రం ఇస్లాంమత చాందసవాదులతో కలిసి పనిచేస్తారని అన్నారు. భారతదేశ తత్వ సిద్ధాంతాలని అర్ధం చేసుకోవడానికి అందరూ ఈ పుస్తకం చదవాలని చెప్పారు.  విశ్రాంత IPS అధికారి శ్రీ ఉమాపతి సత్తారుగారు మాట్లాడుతూ – సమాజం ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు విలువలు, సత్యధర్మాలు, ఆత్మ పరిశీలన మొదలైనవి నేర్పించాలని అన్నారు, పోతన భాగవత పద్యాలను పాడి వినిపిస్తూ, తమకు చిన్నతనంలో ఉపాధ్యాయులు ఈ విలువలను బోధించేవారని అన్నారు.

గ్రంథ రచయిత, ప్రజ్ఞా ప్రవాహ’ జాతీయ సంచాలకులు శ్రీ జె. నందకుమార్ గారు తమ ఉపన్యాసంలో తాను యాదృచ్చిక రచయితనని చెప్తూ, హిందుత్వం మీద మన దేశంలో పనిగట్టుకుని కుట్రపూరితంగా కొన్ని వర్గాలు దశాబ్దాలుగా చేస్తున్న దూషణ, తప్పుడు ప్రచారానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పుస్తక రచన అవసరమైందని వివరించారు.దానికి ఉదాహరణగా వీర్ సావర్కర్ పైన జరుగుతున్న అసత్య ప్రచారాన్ని వివరిస్తూ దానిని ఖండించారు. 1970ల దాకా సావర్కర్ ని గౌరవించిన కాంగ్రెస్ నాయకులు, తర్వాత కుల-మత రాజకీయాలను ప్రారంభించి, సావర్కర్ దూషణ మొదలుపెట్టారని చెప్పారు. ఈనాడు హిందూమతం వేరు, హిందుత్వం వేరని మళ్ళి చర్చను తప్పు దోవపట్టిస్తున్నారని చెప్తూ, హిందూ దర్శనం- తత్వమే హిందూత్వo అని, దీన్నే ఇంగ్లీష్ లో `హిందూనెస్’ అనవచ్చని చెప్పారు. ఈ సమవేశానికి ఎందరో మేధావులు, రచయితలు, వివిధ సంస్థల ప్రతినిధులతో పాటు ముఖ్యంగా భారీగా జనం హాజరయ్యారు.