కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సార్క్ కూటమి దేశాలన్నీ ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలన్న ప్రధాని మోడీ ప్రతిపాదనపై పాకిస్థాన్ కూడా సానుకూలంగా స్పందించింది. ఇందుకోసం ఆయా దేశాధినేతలతో నిర్వహించాలన్న మోడీ ప్రతిపాదిత వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. దేశాలకు సవాల్ విసురుతున్న కరోనా వంటి మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఉమ్మడి వ్యూహాలు, ప్రణాళికలు ఎంతగానో దోహదం చేస్తాయని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పాక్ తరఫున ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ స్పెషల్ అసిస్టెంట్ జఫర్ మీర్జా వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొంటారని వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఐషా ఫరూకీ శుక్రవారం ట్వీట్ చేశారు. పాక్‌లో వైరస్ కట్టడి అవగాహన కార్యక్రమాన్ని మీర్జాయే పర్యవేక్షిస్తున్నారు. పాక్‌లో ఇప్పటి వరకు 22 మందికి కరోనా వైరస్ సోకగా.. వీరిలో ఒకరు కోలుకున్నారు. వైరస్ ముప్పును పసిగట్టిన అక్కడి ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.
మోడీ ప్రతిపాదనను కూటమిలోని అన్ని దేశాలూ ఇప్పటికే స్వాగతించాయి. ఉమ్మడి వ్యూహం ద్వారా ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుద్దామని, ఆరోగ్యకరమైన భూగోళానికి దోహదపడదామని మోడీ సార్క్ దేశాలకు పిలుపునిచ్చారు. ”మన పుడమి.. కొవిడ్-19తో పోరాడుతోంది. వివిధ స్థాయిల్లో ప్రభుత్వాలతో పాటు ప్రజలు శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు. ప్రపంచ జనాభాలో దక్షిణాసియాకు గణనీయ వాటా ఉంది. అందువల్ల ఇక్కడి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండేలా చూడటానికి అన్ని ప్రయత్నాలూ చేపట్టాలి” అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. భారత్‌లో ఇప్పటి వరకు ఇద్దరు కరోనా వల్ల మరణించగా.. 82 మంది బాధితులుగా మారారు.
vskandhra.org సౌజన్యంతో….