Home News పౌరసత్వ సవరణ చట్టం, 2019 – భారత్ నైతిక, రాజ్యాంగ కర్తవ్యం

పౌరసత్వ సవరణ చట్టం, 2019 – భారత్ నైతిక, రాజ్యాంగ కర్తవ్యం

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశం – యుగాబ్ది 5121, బెంగళూరు 14 మార్చ్, 2020.

తీర్మానం – 3

పొరుగున ఉన్న మూడు ముస్లిం దేశాలైన పాకిస్థాన్ , బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లలో మతపరమైన వివక్షకు గురై భారత్ కు వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులకు భారత పౌరసత్వాన్ని కల్పించే ప్రక్రియలో క్లిష్టతను తగ్గించి సులభతరం చేయడానికి వీలుకల్పించే పౌరసత్వ సవరణ చట్టం, 2019 ఆమోదించిన పార్లమెంట్ ను, అమలుచేసిన కేంద్ర ప్రభుత్వాన్ని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండలి హృదయపూర్వకంగా అభినందిస్తున్నది.

1947లో భారత్ ను మత ప్రాతిపదికపై రెండుగా విభజించారు. రెండు దేశాలూ తమ దగ్గర ఉన్న మైనారిటీలకు సమాన అవకాశాలు, గౌరవం, భద్రత కల్పించాలని నిర్ణయించుకున్నాయి. భారత్ లోని సమాజం, అలాగే రాజ్యం(ప్రభుత్వం) ఈ భౌగోళిక సరిహద్దులలో నివసించే మైనారిటీల ప్రయోజనాలను పరిరక్షించాయి. అలాగే మైనారిటీల సురక్ష, అభివృద్ధికి రాజ్యాంగ బద్ధమైన హామీని కల్పించే విధానాలను కూడా భారత రాజ్యం రూపొందించింది. మరోవైపు, భారత విభజన మూలంగా ఏర్పడిన దేశాలు మాత్రం నెహ్రూ – లియాకత్ ఒప్పందం కుదిరినా, వివిధ సందర్భాల్లో వారి నేతలు హామీలు ఇచ్చినా మైనారిటీలకు సురక్షితమైన స్థితిగతులను కలిగించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. ఆ దేశాల్లో ఉన్న మైనారిటీలు నిరంతర మతపరమైన వివక్ష, ఆస్తుల దురాక్రమణ, మహిళలపై అత్యాచారాలు వంటి నిరంతర సంఘటనల మూలంగా కొత్తరకం బానిసత్వానికి గురయ్యారు. అక్కడి ప్రభుత్వాలు కూడా వివక్షాపూరితమైన విధానాలు, అన్యాయపూరితమైన చట్టాల ద్వారా మైనారిటీలపై అణచివేతను ప్రోత్సహించాయి. దీని మూలంగా ఆ దేశాల్లోని మైనారిటీలు పెద్ద సంఖ్యలో భారత్ కు తరలివచ్చారు. దేశ విభజన తరువాత ఏర్పడిన ఆ దేశాల్లో మైనారిటీల జనాభా శాతం బాగా తగ్గిపోవడం ఈ పరిణామాలకు స్పష్టమైన ఋజువు.

ఆ ప్రాంతాల్లో చిరకాలంగా నివశిస్తున్న భారతీయ సమాజం సంస్కృతి పరిరక్షణతోపాటు దేశ స్వాతంత్ర్య సమరంలో కూడా ప్రముఖమైన పాత్ర పోషించిందన్నది మరచిపోరాదు. కాబట్టి అణచివేతకు, వివక్షకు గురవుతున్న ఈ మైనారిటీల ప్రయోజనాలను పరిరక్షించడం భారతీయ సమాజం, భారత ప్రభుత్వపు నైతిక, రాజ్యాంగపరమైన కర్తవ్యం.  గత 70 ఏళ్లలో ఈ మైనారిటీ సోదరుల గురించి పార్లమెంట్ లో అనేకసార్లు చర్చించారు. అలాగే వివిధ ప్రభుత్వాలు అనేక చర్యలు కూడా చేపట్టాయి. కానీ విధానపరమైన అడ్డంకుల మూలంగా ఈ మైనారిటీలలో అధిక శాతం పౌరసత్వ హక్కును ఇప్పటి వరకు పొందలేకపోయారు. అభద్రత, అనిశ్చితి, ఆందోళనల మధ్య జీవిస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సవరణ మూలంగా వీరు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశం లభిస్తుంది.

పార్లమెంట్ లోనూ, ఇతరత్రా జరిగిన అనేక చర్చల్లో ఈ కొత్త చట్టం భారతీయ పౌరులెవరినీ, ఏవిధంగానూ ప్రభావితం చేయదని ప్రభుత్వం పదేపదే స్పష్టం చేస్తూ వచ్చింది. ఈశాన్య ప్రాంతంలో నివసించే ప్రజల భయాలు, సందేహాలను తీర్చడానికి ప్రభుత్వం ఈ చట్టంలో పొందుపరచిన అంశాలపట్ల కార్యకారీ మండలి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. ఈ చట్ట సవరణ మూడు దేశాల్లో మత వివక్షకు గురై భారత్ కు వచ్చిన నిర్భాగ్యులకు పౌరసత్వం ఇవ్వడానికి ఉద్దేశించిందేతప్ప ఏ భారత పౌరుడి పౌరసత్వాన్ని తొలగించడానికో, రద్దుచేయడానికో కాదు. కానీ ఒక వర్గానికి చెందినవారి మనస్సుల్లో భయాందోళనలు సృష్టించడం ద్వారా జిహాదీ – వామపక్ష కూటమి, మతరాజకీయాలతో స్వార్ధ ప్రయోజనాలు పొందాలనుకునే రాజకీయ పార్టీలు, కొన్ని విదేశీ శక్తుల మద్దతుతో, దేశ వ్యాప్తంగా అరాచక, హింసాత్మక పరిస్థితులను వ్యాపింపచేయడానికి కుట్రపూరితమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నది. కార్యకారీ మండలి ఇలాంటి  కార్యకలాపాలను తీవ్రంగా ఖండించడమేకాక మత సామరస్యాన్ని, జాతీయ సమైక్యతను దెబ్బతీయడానికి ప్రయత్నించే శక్తుల గురించి క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, అవసరమైన కఠిన చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వాలను కోరుతున్నది.

కచ్చితమైన ఆధారాల వెలుగులో విషయాలను ఆర్ధం చేసుకోవడమేకాక దేశ వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడంలో చురుకైన పాత్ర పోషించి, దేశంలో సుహృద్భావపూర్వకమైన వాతావరణం ఏర్పాటు చేయడంలో సమాజంలోని అన్ని వర్గాలవారు, ముఖ్యంగా జాగరూకమైన, బాధ్యతాయుతమైన నాయకత్వం, ముందుండాలని అఖిల భారతీయ కార్యకారీ మండలి విజ్ఞప్తి చేస్తున్నది.

మరిన్ని వార్తలు, విశేషాల కోసం Samachara Bharati యాప్ ను క్లిక్ చెయ్యండి.