Home News రామజన్మభూమిలో మందిర నిర్మాణం – జాతీయ గౌరవానికి ప్రతీక

రామజన్మభూమిలో మందిర నిర్మాణం – జాతీయ గౌరవానికి ప్రతీక

0
SHARE

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశం – యుగాబ్ది 5121, బెంగళూరు, 14 మార్చ్, 2020.

తీర్మానం – 2

జాతి ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్య రామజన్మభూమిలో భవ్య మందిర నిర్మాణం విషయమై ఎదురవుతున్న  అడ్డంకులనన్నింటిని  గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం తన ఏకగ్రీవమైన తీర్పు ద్వారా పూర్తిగా తొలగించిందని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండలి భావిస్తోంది. 9 నవంబర్, 2019 న గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం రామజన్మభూమి విషయమై ఇచ్చిన తీర్పు దేశ న్యాయస్థానాల చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోతుంది. వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో అనేక అడ్డంకులు సృష్టించడానికి చాలా ప్రయత్నం జరిగినప్పటికి అపూర్వమైన సహనం, నైపుణ్యం చూపుతూ సర్వోన్నత న్యాయస్థానపు గౌరవనీయ న్యాయమూర్తులు ఎంతో సంతులితమైన తీర్పును వెలువరించారు. ఇలాంటి చారిత్రాత్మక తీర్పును వెలువరించిన గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానాన్ని కార్యకారీ మండలి హృదయపూర్వకంగా అభినందిస్తున్నది.

రామజన్మభూమి పక్షాన ప్రముఖులైన న్యాయవాదులు ఎంతో నైపుణ్యం, నిష్ఠతో ఆధారాలు చూపి, వాదనలు వినిపించిన తీరు ఎంతైనా ప్రశంసాపాత్రమైనది. తీర్పును ఏ ఒక్క వర్గం తమ విజయంగానో, పరాజయంగానో పరిగణించకుండా, దేశం, న్యాయవ్యవస్థ, రాజ్యాంగాల గెలుపుగా స్వీకరించడం, అంగీకరించడం చాలా సంతోషించదగిన పరిణామం. తీర్పు పట్ల ఎంతో పరిణతితో కూడిన స్పందన చూపిన దేశ పౌరులందరిని కార్యకారీ మండలి అభినందిస్తోంది.

శ్రీ రామజన్మభూమి మందిర ఉద్యమం’’ ప్రపంచ చరిత్రలోని ప్రముఖమైన, చిరకాలం గుర్తుండే ఉద్యమాలలో కూడా ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుంది. 1528 నుండి సాగిన ఈ మహా ఉద్యమంలో, పోరాటంలో లక్షలాది మంది రామ భక్తులు తమ జీవితాలను బలిదానం చేశారు. కొన్ని సందర్భాలలో కొందరు మహా పురుషులు ఈ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలబడితే మరి కొన్నిసార్లు ప్రజలే స్వీయప్రేరణతో ముందుకు తీసుకువెళ్లారు. 1950లో ప్రారంభమైన న్యాయపోరాటం, 1983లో మొదలైన ప్రజా ఉద్యమం చివరికి విజయవంతంగా పూర్తయ్యాయి. ప్రపంచ చరిత్రలోనే అత్యున్నతమైన ఉద్యమం అనేకమంది మహామహుల అకుంఠిత, అవిశ్రాంత కృషి మూలంగా విజయశిఖరాన్ని చేరుకుంది. ఈ మహోద్యమంలో, మనకు తెలిసిన, తెలియని, అమరులైన వారందరికి కృతజ్ఞతపూర్వక శ్రద్ధాంజలి ఘటించడం పవిత్ర కర్తవ్యమని కార్యకారీ మండలి భావిస్తోంది.

తీర్పు వెలువడిన తరువాత తీర్పును సహృదయంతో స్వీకరించే విధంగా సమాజంలోని అన్ని వర్గాల వారిని మానసికంగా సంసిద్ధులను చేయడం ఏ ప్రభుత్వానికైనా చాలా కఠినమైన పని. అలా అన్ని వర్గాల విశ్వాసాన్ని పొందడంలో చూపిన చొరవకు, సహనానికి కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుత రాజకీయ నాయకత్వాన్ని కార్యకారీ మండలి అభినందిస్తున్నది.

సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు, రామభక్తుల విశ్వాసాలకు తగినట్లుగా `శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర పేరుతో ట్రస్ట్ ను ఏర్పాటు చేసి అది తమ అదుపులో కాకుండా కేవలం సహకారం అందిస్తూ సమాజపు పర్యవేక్షణలోనే నడిచేవిధంగా రూపొందించడం ప్రభుత్వపు ముందుచూపును తెలియజేస్తోంది. ఉద్యమానికి నేతృత్వం వహించిన పూజ్య సాధుసంతుల మార్గదర్శనంలోనే మందిర నిర్మాణం జరిపించాలన్న నిర్ణయం కూడా ప్రశంసించదగినది. రామజన్మభూమిలో భవ్యమైన, పవిత్ర మందిర నిర్మాణంతోపాటు పరిసర క్షేత్ర నిర్మాణాన్ని కూడా న్యాస్ వేగంగా పూర్తిచేస్తుందని కార్యకారీ మండలి ఆశిస్తున్నది. భారతీయులందరూ, ప్రపంచమంతటా ఉన్న రామభక్తులు ఈ పవిత్ర కార్యంలో పాలుపంచుకుంటారని కార్యకారీ మండలి విశ్వసిస్తున్నది.

పవిత్ర మందిర నిర్మాణంతోపాటు మర్యాదా పురుషోత్తముడైన శ్రీ రామచంద్రుని ఉన్నతమైన ఆదర్శాలను అనుసరించే, ఆచరించే ధోరణి సమాజంలో పెరుగుతుంది. అలాగే ప్రపంచంలో శాంతి, సామరస్యం, సౌహార్ద్రాలను నెలకొల్పే కార్యాన్ని భారత్ తప్పక పూర్తిచేస్తుంది.

మరిన్ని వార్తలు, విశేషాల కోసం Samachara Bharati యాప్ ను క్లిక్ చెయ్యండి.