Home News కరీంనగర్లో ఇండోనేషియన్లకు కరోనా! అంతర్గత భద్రత పర్యవేక్షణపై విమర్శలు!!

కరీంనగర్లో ఇండోనేషియన్లకు కరోనా! అంతర్గత భద్రత పర్యవేక్షణపై విమర్శలు!!

0
SHARE

ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా దేశస్థుల్లో కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కావడం కరీంనగర్ తో  పాటు యావత్ తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇస్లామిక్ కార్యకలాపాల విస్తరణ కోసం కరీంనగర్‌ కేంద్రంగా పర్యటించిన మొత్తం 10 మంది ఇండోనేషియన్లలో ఏడుగురిలో ఈ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వీరు ఎక్కడెక్కడ పర్యటించారు, ఎవరెవరిని కలిశారు, ఎక్కడ బస చేశారు అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరంతా  జిల్లా కలెక్టరేట్‌‌కు అతి సమీపంలోని మసీదుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా మార్చి 14, 15 తేదీల్లో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లోనూ వీరు సంచరించినట్టు అధికారులు గుర్తించారు. ఇంకా వీరు తిరిగిన ప్రాంతాలను తెలుసుకొనేందుకు పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ నెల 16న కరోనా పరీక్షల నిమిత్తం 12 మందిని వైద్య పరీక్షలకు కరీంనగర్ నుండి హైదరాబాద్‌కు తరలించగా.. మార్చి 18న మరో 9 మందిని తీసుకొచ్చారు. ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జిల్లా అధికారులు ఇండోనేసియా బృందంతో సన్నిహితంగా ఉన్నవారి కోసం గాలింపు మొదలుపెట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13కు చేరింది.

వీసా నిబంధనల ఉల్లంఘన.. భద్రతా లోపాలపై ప్రజల ఆందోళన:

ఇస్లామిక్ కార్యకలాపాల కోసం ఇండోనేషియా నుండి 10 మంది కరీంనగర్ రావడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. కొన్ని వార్తా కధనాల ప్రకారం వీరు నమాజ్ నేర్చుకునేందుకు ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా నుండి వీరు ‘నమాజ్ నేర్చుకునేందుకు’ దక్షిణ భారతదేశంలోని మారుమూల కరీంనగర్ పట్టణానికి రావడం ఏమిటి అనేది అంతుచిక్కని అంశం. పైగా ఇటువంటి మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనేందుకు ఇక్కడికి రావాలనుకునే విదేశీయులకు భారత ప్రభుత్వం ఎటువంటి వీసాలు మంజూరు చేయదు. పైగా ‘ది ఫారినర్స్ యాక్ట్ 1946లోని సెక్షన్ 14(బి) ప్రకారం భారతదేశంలో విదేశీయులు ఇటువంటి మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనడం వీసా నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది. ఇందుకు గరిష్టంగా 5 ఏళ్ల దాకా జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి వీరు కచ్చితంగా ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించి వీసా సంపాదించినట్టు తెలుస్తోంది. 

ఈ పది మంది ఇండోనేషియన్లు ముందుగా న్యూఢిల్లీ చేరుకొని, అక్కడి నుండి మొదట రామగుండం వచ్చారు. అనంతరం కరీంనగర్ చేరిన వీరు స్థానిక మసీదులో 3 రోజుల పాటు బస చేసినట్టు సమాచారం. దీంతో అంతర్గత భద్రత అంశంపై ప్రజల్లో భయాందోళనలు చెలరేగుతున్నాయి. అసలు మసీదులో వీరి కార్యకలాపాలు ఏమిటి? ఫారినర్స్ యాక్ట్ 1946 ప్రకారం విదేశీయులు ఎక్కడైతే పర్యటిస్తారో అక్కడి ప్రాంతీయ ఫారినర్స్ రిజిస్ట్రేషన్ అధికారికి సమాచారం ఇచ్చి, తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఒకవేళ తాము పర్యటిస్తున్నది గ్రామీణ  ప్రాంతం అయితే సంబంధిత జిల్లా ఎస్పీ కార్యాలయానికి వివరాలు తెలియజేయాలి. ఇదే చట్టంలోని సెక్షన్ 7(1) ప్రకారం విదేశీయులు ఎక్కడైతే బస చేస్తారో, అక్కడి హోటల్ లేదా ఇంటి యజమాని వారి వివరాలు మొత్త స్థానిక పోలీసులకు సమర్పించాలి. కానీ ఘటనలో మాత్రం అవేమీ పాటించనట్టు అర్ధమవుతోంది. 

100 ప్రత్యేక టీమ్‌లు

ముందస్తు చర్యల్లో భాగంగా ఇండోనేసియా బృందం కరీంనగర్‌లో సంచరించిన ప్రాంతాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకునేలా పోలీసులు కార్యాచరణను సిద్ధం చేశారు. గురువారం నుంచి కరీంనగర్‌‌లో 100 ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా వెల్లడించారు. వీలునిబట్టి ఆయా ప్రాంతాల్లో కఠినతర ఆంక్షలు విధించాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై మంత్రి గంగుల కమలాకర్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక, నగర సీపీ, వైద్య ఉన్నతాధికారులతో అత్యవసర రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్య తీవ్రతను ప్రజలు గుర్తించాలని, ప్రతి ఒక్కరూ స్వీయజాగ్రత్తలు పాటించాలని కోరారు. ఇండోనేసియా టీమ్ కలెక్టరేట్‌ ప్రాంతంలో రెండు రోజుల పాటు ఉండడంతో చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల మేర ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. కరీంనగర్‌లో నిత్యావసర దుకాణాలు మినహా మిగిలిన షాపులు, ఇతర సంస్థలు మూసివేస్తేనే మంచిదని సూచించారు. అందరూ విధిగా ఇంటి వద్దే ఉండడం మంచిదని చెప్పారు. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు, విశేషాల కోసం  Samachara Bharati యాప్ ను క్లిక్ చెయ్యండి.