ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి జాగ్రత్త, అప్రమత్తతలే ప్రధానమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ నెల 22న అంతా జనతా కర్ఫ్యు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ప్రసంగంలో ముఖ్యాంశాలు –
- మనం ఆరోగ్యంగా ఉంటామని ఇతరులను ఆరోగ్యంగా ఉంచుతామని సంకల్పం తీసుకోవాలి
- సంయమనం, సామాజిక దూరం పాటించడం అత్యావశ్యకం. నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడమంటే మనం మనకు, మన కుటుంబానికి ఆపద కలిగిస్తున్నామని గుర్తించాలి.
- ప్రభుత్వం చేపట్టే అన్నీ కార్యక్రమాలకు మనం పూర్తి సహకారం అందించాలి.
- మార్చ్ 22 న ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు జనతా కర్ఫ్యు లో భాగంగా మనం పూర్తిగా మన ఇళ్లకే పరిమితమవ్వలి.
- ఆ రోజు సాయంత్రం 5 గంటలకు అత్యవసర సేవలు నిర్వహిస్తున్నవారికి కృతజ్ఞతగా అందరం చప్పట్లు కొట్టాలి , పళ్ళాలు మోగించాలి.
- జనతా కర్ఫ్యు గురించి అందరిలో అవగాహన కలిగించాలి. దీనికోసం రేపటినుంచి రోజూ కనీసం 10 మందికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పాలి.
- మొదటి ప్రపంచ యుద్ధం కంటే కరోన వైరస్ వల్ల ప్రపంచంలో ఎక్కువమంది ప్రభావితమయ్యారు. కొన్ని దేశాల్లో అనూహ్యంగా బాధితుల సంఖ్య నమోదైంది.
- వైద్య మరియు ఇతర అత్యవసర విభాగాలవారు పడుతున్న శ్రమని మనం గుర్తించి, అభినందించాలి.
- రెగ్యులర్ గా వైద్య పరీక్షలు చేయించుకునేవారు వాటిని ఒక నెలపాటు వాయిదా వేసుకోవాలి. అత్యవసర శస్త్ర చికిత్సలు తప్పించి మిగిలినవి కూడా వాయిదా వేసుకోవాలి. ఆ విధంగా వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గించాలి.
- వ్యాపార సంస్థల యాజమాన్యాలు తమ వద్ద పనిచేసేవారు ఒకవేళ ఉద్యోగానికి హాజరుకాకపోయినా ఈ విపత్కర పరిస్థితిలో వారు తమ కుటుంబ సభ్యులను రక్షించుకోవడం కోసం అలా చేసి ఉంటారని గుర్తించి వేతనంలో కోత విధించకుండా ఉండాలి.
- కరోన వైరస్ మూలంగా ఏర్పడిన ఆర్ధిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆర్ధికమంత్రి నేతృత్వంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటవుతుంది.
- పాలు, మందులు, మొదలైన నిత్యవసర వస్తువులు దేశంలో తగిన్నన్ని ఉన్నాయి. కాబట్టి వాటిని కొనుగోలు చేయడానికి అనవసరమైన ఆందోళన, ఆతృత పడకుండా ఉండాలి.