“సేవాహి పరమో ధర్మః”.. సేవ అన్నిటినీ మించిన ధర్మం అన్న పెద్దల మాటలను కరీంనగర్ పట్టణానికి చెందిన యువకులు స్పూర్తిగా తీసుకున్నారు. ఈ స్ఫూర్తితోనే “స్పందన వెల్ఫేర్ సొసైటీ” పేరిట ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిధ సహాయక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్త లాక్-డౌన్ మొదలైన నాటి నుండి పట్టణంలో ఆకలితో ఉన్న వారికి కడుపు నింపే మహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. లాక్-డౌన్ నాటి నుండి ప్రతి రోజూ రెండు పూటలా పట్టణంలోని సివిల్ హాస్పటల్ మరియు ఇతర ప్రధాన కూడళ్ళ వద్ద భోజన వితరణ చేపడుతున్నారు. స్వచ్చంధ సంస్థకు చెందిన యువకులందరూ కలిసి, దాతల సహాయంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం స్థానిక ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో నిర్విరామంగా కొనసాగుతోంది.
నిత్యం వేలాది మంది రోగులు, వారి బంధువులు వైద్యం కోసం కరీంనగర్ సివిల్ హాస్పిటల్ సందర్శిస్తుంటారు. లాక్-డౌన్ అమలు కారణంగా అక్కడి ఇన్-పేషెంట్స్ తరఫున బంధువులు పడుతున్న ఇబ్బంది గమనించిన స్పందన వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వారికి ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. అంతేకాకుండా వలస కూలీలు, బిక్షగాళ్ళు కూడా ఈ సదుపాయం వినియోగించుకుంటున్నారు.
రోజూ వెరైటీ రకాలతో ఈ నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. లాక్-డౌన్ సమయంలో కొందరు పట్టనవాసులు తమ పుట్టినరోజు, పెళ్లిరోజు కార్యక్రమాలను “స్పందన” ద్వారా శరణార్ధుల భోజన ఏర్పాటు రూపంలో జరుపుకోవడం ప్రశంసనీయం. ఈ సందర్భంగా భోజనంలో స్వీట్లు, పాయసం, మొదలైన వాటితో పాటు గుడ్లు, బిర్యానీ వంటివి కూడా జతచేస్తుండటం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
“భోజన ఏర్పాటు అంటే ఏదో కడుపు నిండటానికి అన్నం పెడతారు అనుకున్నాం కానీ మీ కుటుంబంలోని ఉత్సవంలాగా కష్టపడుతూ ఇన్ని వెరైటీలు చేస్తున్నారేంటి?” అంటూ పలువురు వీరి సేవలను కొనియాడుతున్నారు. “దాతలు ముందుకు వస్తున్నారు. ఆకలితో బాధపడే వారిని ఏదో నిర్భాగ్యులుగా కాక మా అందరితో సమానంగా భావిస్తున్నాం. లాక్-డౌన్ వల్ల వీళ్లకు ఈ పరిస్థితి వచ్చింది తప్ప వీరికి స్థోమత లేక కాదు కదా. కాబట్టి సాధ్యమైనంత గౌరవప్రదంగా వీరిని చూడటం మన కర్తవ్యం” అని సమధానమిస్తున్నారు “స్పందన వెల్ఫేర్ సొసైటీ” అధ్యక్షుడు దూలం కళ్యాణ్ కుమార్. గరిమెళ్ళ శశికాంత్, తాటికొండ రాజు మొదలైన సంస్థ సభ్యులు, స్థానిక యువకులు ఈ సేవా కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు.