“ఒక వ్యక్తి హిందుత్వం నుండి ఇతర మతంలోకి వెళ్తే హిందువులకు ఒక సంఖ్య తగ్గినట్టు కాదు, హిందూ సమాజానికి ఉన్న శత్రువులలో ఒక సంఖ్య పెరిగినట్టు”
– మతమార్పిళ్లపై దశాబ్దాల కిందటే స్వామి వివేకానంద చేసిన హెచ్చరిక
యావత్ భారతదేశాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిన పాల్ఘర్ జిల్లాలోని సాధువుల ఊచకోత ఘటన.. దశాబ్దాల క్రితం స్వామి వివేకానంద చేసిన హెచ్చరికను మరోసారి గుర్తుచేస్తోంది.
2020 ఏప్రిల్ 16న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అర్ధరాత్రి సుమారు 100 మందికి పైగా గ్రామస్థులు అటువైపుగా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని అతిదారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటనలో 70 ఏళ్ల స్వామీ కల్పవృక్ష గిరి మహారాజ్, 35 ఏళ్ల సుశీల్ గిరి మహారాజ్ తో పాటు 30 ఏళ్ల వయసు గల కారు డ్రైవర్ నీలేశ్ తెల్గాడే మరణించారు. వీరు ప్రతిష్టాత్మక జునా అఖాడా పరిషద్ కు చెందిన సాధువులు. ఒక కార్యక్రమం నిమిత్తం ముంబై నుండి గుజరాత్ వెళ్తుండగా సమీపంలోని గడిచించాలె గ్రామంలో వారిపై దాడి జరిగింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో క్లిపింగుల ప్రకారం దాడి పోలీసుల ఎదుటనే జరిగినట్టు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి ఇప్పటివరకూ వందకు పైగా నిందితులను అరెస్ట్ చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు ప్రకటించారు. ఈ అమానుష దుర్ఘటనకు బాధ్యులైన వారిని వదిలే ప్రసక్తి లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. నిందితులను సంఘటన జరిగిన రోజు రాత్రే అరెస్ట్ చేశామని, దర్యాప్తు జరుగుతున్నదని చెప్పారు.
క్రైస్తవ మిషనరీ ప్రాబల్యం కలిగిన సమస్యాత్మక ప్రాంతం:
హిందూ సాధువుల దారుణ హత్య చోటుచేసుకున్న పాల్ఘర్ జిల్లా మొదటి నుండి మతపరంగా అత్యంత సమస్యాత్మకమైనదిగా తెలుస్తోంది. క్రైస్తవ మిషనరీల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో గత కొన్ని ఏళ్లుగా క్రైస్తవ మతమార్పిడి కార్యకలాపాలు తీవ్రతరం అయ్యాయి. అంతేకాకుండా మతం మారిన వ్యక్తులు ఈ మిషనరీల అండదండలతో హిందువులపై మతపరమైన దారుణాలకు ఒడిగట్టిన ఘటనలు గతంలో వెలుగుచూశాయి.
గత ఏడాది దాదాపు ఇదే సమయంలో పాల్ఘర్ జిల్లాలో కొందరు క్రైస్తవ మిషనరీలు అక్కడి ప్రజలను మతం మార్చే సమయంలో హిందూ దేవీ దేవతలను దూషిస్తూ అవమానించిన వార్త వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ గ్రామంలోని హిందువులు ఆగ్రహించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దీంతో అప్రమత్తమైన క్రైస్తవ మిషనరీలు “మేము అలా చేయలేదు” అంటూ బుకాయించడానికి ప్రయత్నం చేశారు. అయితే ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు పోలీసులు ఎదుట తమ వాంగ్మూలం ఇచ్చారు. దీనికి సంబంధించి అప్పటి వీడియో ఫుటేజీ సైతం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తాజా ఘటన వెనుక క్రైస్తవ మిషనరీ-కమ్యూనిస్టుల హస్తం?:
స్థానిక సీపీఎం ఎమ్మెల్యే వినోద్ నీకొలాయ్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఈ ఘటనకు సంబంధించి 110 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. కాగా ఇందులో.. గడగ్పాడ్ గ్రామానికి చెందిన జైరాం ధక్ భావర్, కింహావాలి ఖోరిపాడ గ్రామానికి చెందిన మహేష్ సీతారాం రావతే, దివాసి వాకిపాడాకి చెందిన గణేష్ దేవాజీ రావు, దివాసీ సాఠేపాడాకు చెందిన రాందాస్ రూప్ జీ అసారే, దివాసీ పాటిల్పాడా గ్రామానికి చెందిన సోమయా రావతే అనే ఐదుగురు ప్రధాన నిందితుల పేర్లు పోలీసులు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్.ఐ.ఆర్)లో పేర్కొనడం జరిగింది. వీరంతా కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీకి చెందినవారే కావడం, ఘటన జరిగిన ప్రాంతంపై క్రైస్తవ మిషనరీలకు గట్టి పట్టు ఉండటం మొదలైన అంశాలు.. దీనిపై మరిన్ని అనుమానాలు కలిగిస్తున్నాయి.
సాధువులపై గ్రామస్థులు దాడికి పాల్పడుతున్న సమయంలో సకాలంలో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఆ ముగ్గురినీ కాపాడే ప్రయత్నంలో వారిని స్థానిక అటవీశాఖ చెక్-పోస్ట్ గదిలోకి తరలించారు. అయితే పైన పేర్కొన్న కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల పిలుపు మేరకు అప్పటికే అక్కడికి చేరుకున్న మరికొందరు కర్రలతో మరోసారి పోలీసుల సమక్షంలోనే దాడికి పాల్పడ్డారు. ఇలాంటి సమయంలో సాధువులను రక్షించడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నం చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇదే ప్రాంతంలో పోలీసులపైనా కూడా దాడులు జరగడం గమనార్హం. అయినా పోలీసులు అప్రమత్తంగా లేకపోవడాన్ని ఈ సంఘటన తెలుపుతోందని స్థానికులు కొందరు ఆరోపిస్తున్నారు.
నిందితులకు న్యాయ సహాయానికి క్రైస్తవ సంస్థ సన్నాహాలు:
సాధువులపై దారుణ హత్యాకాండ కేసులో అరెస్టైన వారికి బెయిల్ మంజూరు చేసేందుకు, వారికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు ‘కష్టకారీ’ అనే స్థానిక క్రైస్తవ మిషనరీ సంస్థ అధ్యక్షుడు షిరాజ్ బాల్శారా ప్రయత్నం చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది.
Source:
– www.organiser.org
– www.swarajyamag.com