Home Telugu Articles దేశాన్ని, ధర్మాన్ని రక్షించిన దశనామీలు

దేశాన్ని, ధర్మాన్ని రక్షించిన దశనామీలు

0
SHARE

మహారాష్ట్రలోని పాల్ఘర్ దగ్గర హంతక మూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు సాధువులు, చిఖానే మహారాజ్ కల్పవృక్షగిరి(70), సుశీల్ గిరి మహరాజ్(35), దశనామి జునా అఖాడాకు చెందినవారు. వారితోపాటు వారి కారు డ్రైవర్ నిలేశ్ తెలగానే(35) ను కూడా మూకలు హత్య చేశాయి.

దశనామి అఖాడా మన దేశంలో ఉన్న ప్రాచీనమైన అఖాడాలలో ఒకటి. ఈ అఖాడా సంప్రదాయాన్ని స్వయంగా ఆది శంకరాచార్యులు ప్రారంభించారని సాధువులు చెపుతారు.

దశనామీ సంప్రదాయానికి చెందినవారు రెండు రకాలుగా ఉంటారు.
1. శాస్త్రధారులు, 2. శస్త్రధారులు.
శాస్త్రధారులు వివిధ శాస్త్రాల అధ్యయనంలో గడుపుతారు. శస్త్రధారులైన వారు యుద్ధవిద్యాలలో ప్రావీణ్యత సంపాదిస్తారు. వీరిద్వారానే వివిధ అఖాడాలు ఏర్పడ్డాయి.

ఈ సంప్రదాయానికి చెందినవారు పది రకాల పేర్లలో ఏదో ఒకటి ధరిస్తారు. అందుకనే వీరికి దశనామీ అని గుర్తింపు వచ్చింది. ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంతాన్ని పది శాఖలుగా ఏర్పాటు చేశారని చెపుతారు. అవి గిరి(కొండ), పురి(నగరం), భారతి (జ్ఞానం), వనం(తోట), అరణ్యం (అడవి), పర్వతం(పర్వతం), ఆశ్రమ(ఆశ్రమం), సాగర(సముద్రం), తీర్థ(తీర్థస్థలం), సరస్వతి(వివేకం). (పాల్ఘర్ లో హత్యకు గురైన సాధువులు గిరి సంప్రదాయానికి చెందినవారు).

ఈ పది పేర్లు ఆది శంకరులు స్థాపించిన నాలుగు మఠాలకు చెందినవారికి ఉంటాయి. అలాగే ఈ మఠాలలో ఒక్కో మఠంలో ఒక్కో వేదాధ్యయనం జరుగుతుంది.

దక్షిణం: శృంగేరి మఠం , కర్ణాటక (పురి, భారతి, సరస్వతి). వేదం: యజుర్వేదం
తూర్పు: గోవర్ధన మఠం, పూరీ (వన, అరణ్య). వేదం: ఋగ్వేదం
పడమర: శారదా మఠం, ద్వారక (తీర్థ, ఆశ్రమ). వేదం: సామవేదం
ఉత్తరం: జోషి మఠం, బదరీనాధ్, (గిరి, పర్వత, సాగర). వేదం: అథర్వణ వేదం

దశనామి సంప్రదాయాన్ని అనుసరించాలనుకున్నవారు భౌతికమైన వస్తుసంపదను పూర్తిగా త్యజించాలి. కేవలం కాషాయ వస్త్రాన్ని ధరించి, దండకమండలాలు ధరించాలి. అలాగే పురుషసూక్తం చదువుతూ విరాజ హోమం చేయాలి. ఆ తరువాత `అంతా వినండి : నా గురువు అనుగ్రహం మూలంగా నేను భౌతిక జీవితాన్ని దాటి వెళ్లాలనుకుంటున్నాను. నేను అన్ని సంబంధాలను త్యజిస్తున్నాను. కొడుకు పట్ల ప్రేమ, సంపద, సహచరులపట్ల అభిమానం వదిలిపెడుతున్నాను. మీరు కూడా నాపట్ల అనురాగ బంధాలను వదిలిపెట్టండి. నా సన్యాస జీవనానికి అడ్డురాకండి’ అని చెపుతూ దోసిలి నిండా నీళ్ళు తీసుకుని వేద మంత్రాన్ని(అశుప్ శిశ్నాహ..) చదువుతూ నీటిని వదిలిపెడతాడు.

ఆ తరువాత అతను నదిలో స్నానం చేసి, సంధ్యాదులు పూర్తిచేసి తాను సన్యాసం స్వీకరించానని ప్రతిన చేస్తాడు.

దశనామీ సన్యాసి ఆచరించే నియమాలు:

  1. కాషాయ వస్త్రం ధరించి భిక్షాటన చేయడం
  2. రోజుకు ఒక పూట మాత్రమే భుజించడం
  3. సాధారణ జన నివాసాలకు బయట ఉండడం
  4. నేలపై నిద్రించడం
  5. ఎవరి గురించి చెడుగా మాట్లాడకపోవడం
  6. తన కంటే పై స్థాయిలోని సన్యాసికి తప్ప ఎవరికి వందనం చేయకపోవడం
  7. కేవలం కాషాయ వస్త్రాలే ధరించడం

యోధులైన దశనామీలు మధ్యయుగంలో హిందూ సమాజ రక్షణలో కీలక పాత్ర పోషించారు. వాళ్ళు విదేశీ దురాక్రమణ దారులను ఎదుర్కొని మథుర, వారణాశి వంటి పుణ్యక్షేత్రాలను కాపాడారు.

నిర్వాణి పత్రం ప్రకారం దశనామీ సాధువులు 1664లో ఔరంగజేబును ఓడించి వారణాసిలోని విశ్వనాథ మందిరాన్ని కాపాడారు. అప్పుడు రోజంతా పోరాడిన సాధువులు చివరికి ముస్లిం సేనానులు మీర్జా అలీ, అబ్దుల్ ఆలీ లను చిత్తుగా ఓడించారు. నిర్వాణి పత్రంలో ఇలా ఉంది :

“కాశీ క్షేత్రంలో క్రీ.శ 1664లో వాళ్ళు సుల్తాన్ పై ఘనవిజయం సాధించారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు యుద్ధం సాగింది. అందులో దశనామీలు వీరవిహారం చేశారు. వాళ్ళు ఆ క్షేత్ర పవిత్రతను కాపాడారు. వాళ్ళు ముస్లిములైన మీర్జా అలీ, తురంగ్ ఖాన్, అబ్దుల్ అలీ లను ఓడించారు”.

అలాగే దశనామీ సంప్రదాయానికి చెందిన అటల్ అఖాడా కూడా హిందూ ధర్మ రక్షణ కోసం అనేకమంది వీరులను, యోధులను అందించింది. ఇది జోధ్ పూర్ కేంద్రంగా పనిచేసింది. కాబూల్, బెలూచిస్తాన్ నుంచి ముస్లింలు జోధ్ పూర్ పై దండెత్తి వచ్చి తమకు పెద్ద మొత్తంలో కప్పం కట్టాలని అక్కడి రాజును బెదిరించినప్పుడు ఈ అటల్ సన్యాసులు అక్కడికి వచ్చి ముస్లింలను ఓడించి, వారి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు మరెప్పుడు మార్వార్ వైపు చూడామని ఆ ముస్లిం దోపిడిదారులతో ఖురాన్ పైనే ప్రమాణం చేయించారు. అటల్ సన్యాసులు చేసిన ఈ మహోపకారానికి కృతజ్ఞతగా రాజు నాగోర్ తాలూకాను ఈ గోసాయిలకు (సన్యాసులకు) దానం చేశాడు. ఈ ప్రాంతం ఇప్పటికీ అటల్ సన్యాసుల ఆధీనంలోనే ఉంది.

1757లో అహమద్ షా అబ్దాలి భారత్ పై దండయాత్ర చేసి వేలాదిమందిని కత్తికి ఎర చేసి మిగిలిన అందరినీ బానిసలను చేశాడు. కనిపించినదంతా ధ్వంసం చేశాడు. 40వేలమంది ఆఫ్ఘన్ లను తీసుకుని కృష్ణమందిరాన్ని (గోకులనాధుడు) ధ్వంసం చేయడానికి గోకులానికి వచ్చాడు. అక్కడే ఉన్న 4వేలమంది నాగా సాధువులు అఖాడా నుంచి బయటకు వచ్చి పుణ్యక్షేత్రాన్ని రక్షించడానికి పోరాడారు.  సంఖ్యలోను, ఆయుధపరంగా మెరుగైన ఆఫ్ఘన్ సేనతో యుద్ధం చేస్తూ 2వేలకుపైగా నాగా సాధువులు ప్రాణాలు అర్పించారు. కానీ వీరోచితంగా పోరాడిన నాగా సాధువుల ముందు నిలవలేక చివరికి అబ్దాలి వెనక్కు తగ్గవలసి వచ్చింది. దేవాలయాలు, మఠాలను ధ్వంసం చేసే ఆలోచనకు స్వస్తి చెప్పి అక్కడ నుంచి పారిపోయాడు. భారత్ పై దండెత్తిన తరువాత అన్నిచోట్ల ఘోరమైన మారణకాండ, విధ్వంసం సాగిస్తూ వచ్చిన అబ్దాలికి గోకుల్ లో నాగా సాధువుల చేతిలో పరాభవం తప్పలేదు.

దశనామీ సాధువులు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కూడా పోరాడారు. సన్యాసుల తిరుగుబాటు (1770-1820)లో ముఖ్యమైన పాత్ర పోషించారు. కఠినాతికఠినంగా శిక్షించడం, దశనామీ సన్యాసులు బెంగాల్ లోకి ప్రవేశించకుండా నిషేధం విధించడం ద్వారా బ్రిటిష్ పాలకులు ఆ తిరుగుబాటును అతికష్టం మీద అణచివేయగలిగారు.

దశనామీ సాధువుల పరాక్రమం, త్యాగాలు భారత దేశ చరిత్రలో గుర్తింపుకు నోచుకోలేదు. కుంభమేళాల సమయంలో కనిపించే ఈ సాధువులు వేలాది సంవత్సరాల సాంప్రదాయాలను ఇప్పటికీ కాపాడుతున్నారు. మన ఈ సాంప్రదాయాలను కాపాడేందుకు వాళ్ళు సర్వస్వం వదులుకున్నారు. మన నాగరకత, సంస్కృతి ఈనాడు ఇలా నిలబడిందంటే అందులో దశనామి సన్యాసుల పాత్ర ఎంతైనా ఉంది. మనకు ఇంత చేసినా వాళ్ళు ఎప్పుడు ఏదీ మన నుంచి ఆశించారు, కోరుకోరు. కానీ ఇప్పుడు మనం వారిని ఏవిధంగా గౌరవిస్తున్నాం? ఏవిధంగా వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం? మూకుమ్మడి దాడుల ద్వారానా? అమానుషమైన హత్యల ద్వారానా? ఈ విషయంలో మొత్తం సమాజంగా మనం విఫలమయ్యమా? మన కోసం జీవించిన, జీవిస్తున్నవారిని గౌరవించుకుని, కాపాడుకోలేకపోయామా? ఆలోచించండి.

ఆధార గ్రంధాలు:
1)Ahmad Shah Durrani, Father Of Modern Afghanistan, Asia Publishing House,1959

2) A History Of Dasnami Naga Sanyasis : Sir Jadunath Sarkar

3)Warrior Ascetics and Indian Empires, William Pinch (2006)

హిందూ సాధువులపై దారుణ హత్యాకాండ