– ఎస్ గురుమూర్తి
వివాహాలు జరిగే తీరుతెన్నుల గురించి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వవేత్త రాబర్ట్ ఎప్సిన్ అధ్యయనం చేశారు. అమెరికాలో `ప్రేమ ముందు తరువాత పెళ్లి’ అనే ధోరణి కనిపిస్తే భారతీయులు `ముందు పెళ్లి ఆ తరువాత ప్రేమ’ అనే ఆలోచన కలిగినవారని ఆయన వివరించారు. పెద్దలు కుదిర్చిన వివాహం, ప్రేమ వివాహంలో ఏది మంచిదనే చర్చ మన దేశంలో చాలాకాలంగా సాగుతూనే ఉంటుంది. అయితే ఒక దశాబ్దం క్రితం కేరళలో ప్రేమ వివాహం, లవ్ జిహాద్ ల గురించి మొదలైన చర్చ ఇప్పుడు దేశం మొత్తంలో, ప్రపంచం మొత్తంలో జరుగుతోంది.
మొదట్లో లవ్ జిహాద్ ను `హిందుత్వవాదులు’ చేస్తున్న రాద్ధాంతంగా కొందరు కొట్టిపారేశారు. అసలు అలాంటి సమస్య లేనేలేదని వాదించారు. కానీ ఇప్పుడు అది హిందువులకే కాదు అన్ని మతవర్గాలు, పార్టీలకు పాకింది. అయితే ఈ లవ్ జిహాద్ అసలు ఉందా, లేదా అన్న చర్చ పక్కన పెడితే అది బలమైన రెండు భావోద్వేగాలైన ప్రేమ, మతాలను కలగలుపుతోందని మాత్రం తెలుస్తోంది. ఈ ప్రమాదకరమైన ధోరణి వల్ల అనేక కుటుంబాలు నష్టపోవడమేకాక వివిధ వర్గాల మధ్య చీలికలు వస్తున్నాయి. ఈ లవ్ జిహాద్ సెక్యులర్ భారతానికి ఎలాంటి ముప్పు తెస్తుంది? అది సాధారణ ప్రేమ వివాహాలకంటే ఎందుకు భిన్నమైనది అన్నవి ప్రధానమైన ప్రశ్నలు.
ప్రేమ వివాహాలు, లవ్ జిహాద్
పరస్పరం ప్రేమించుకున్న ఆడ, మగా చేసుకునేవే ప్రేమ వివాహాలు. అయితే లవ్ జిహాద్ అలాంటిది కాదని, మతప్రయోజనాల కోసం ముస్లిం పురుషులు ముస్లిమేతర స్త్రీలను పెళ్లి చేసుకోవడమే లవ్ జిహాద్ అని దానిని వ్యతిరేకించేవారు అంటారు. లవ్ జిహాద్ లో ప్రేమ కంటే మతప్రయోజనాలకే ప్రాధాన్యత ఎక్కువన్నది వారి వాదన. ప్రేమ పెళ్లిళ్లు సాధారణంగా కుల, మతాలకు అతీతంగా జరుగుతుంటాయి. కానీ లవ్ జిహాద్ మాత్రం ముస్లిం పురుషులు, ముస్లిమేతర స్త్రీల మధ్య మాత్రమే జరుగుతాయి.
ఇది ముస్లింలు, ముస్లిమేతరులైన క్రైస్తవులు, బౌద్ధులతోసహా హిందువుల మధ్య సమస్యగా పరిణమించింది. అయితే కొందరు లవ్ జిహాద్ కేవలం ఇస్లాం వ్యతిరేకుల ప్రచారమంటూ వాదిస్తున్నారు. కానీ లవ్ జిహాద్ వల్ల నష్టపోయిన, ఇబ్బందులుపద్దవారు మాత్రం ఈ వాదనలో పస లేదని అంటున్నారు. సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు ముస్లిం పురుషులు, ముస్లిమేతర మహిళల మధ్య జరిగిన 93 ప్రేమవివాహాలపై దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఇందులో 23 లవ్ జిహాద్ కేసులేనని అనుమానిస్తోంది.
దీనితో లవ్ జిహాద్ కేవలం కల్పిత ప్రచారం మాత్రమేనని కొట్టిపారేయడానికి అవకాశం లేకుండాపోయింది. ఇంతకీ ఈ లవ్ జిహాద్ అంటే ఏమిటి? లవ్ అంటే అందరికీ తెలుసు. అలాగే జిహాద్ అంటే ఇస్లాం ప్రకారం పవిత్ర మతయుద్ధం. కానీ వీటి రెండింటికి సంబంధం ఏమిటి? నిజానికి జిహాద్ కేవలం మతయుద్ధానికి మాత్రమే పరిమితమైనది కాదన్న సంగతి గ్రహిస్తే ఇక్కడ విషయం అర్ధమవుతుంది. జిహాద్ అంటే ఇస్లాంను వ్యాప్తి చేయడం. మరి ప్రేమ (వివాహాల) ద్వారా ఇస్లాంను వ్యాపింపచేయవచ్చునా? అంటే ఇస్లాంవాదులు, తటస్థులు `అవును చేయవచ్చును, అలా జరుగుతోంది’ అని అంటారు.
మతం కోసం ప్రేమించడం
ఇస్లాం వ్యాప్తిలో ప్రేమ వివాహాలు ఎలాంటి ముఖ్య పాత్ర పోషిస్తాయో అనేక అధ్యయనాల వల్ల స్పష్టమయింది. ఈ అధ్యయనాల్లో కొన్ని ముస్లిం మేధావులు చేసినవి కూడా ఉన్నాయి. `డెమోగ్రాఫిక్ ఇస్లామైజేషన్: నాన్ ముస్లిమ్స్ ఇన్ ముస్లిం కంట్రీస్’ అనే తన అధ్యయనంలో ఫిలిప్ ఫర్గూస్ ఇలా అంటారు – `గతంలో ఇస్లామీకరణ ప్రక్రియలో బెదిరింపులు, భయపెట్టడం ఎలా పనిచేసాయో ఇప్పుడు `ప్రేమ’ అలా పనిచేస్తోంది.’ (Paul H. Nitze School of Advanced International Studies [SAIS] Review, Johns Hopkins University)
హాసన్ మునీర్ కూడా `ప్రపంచంలో ఇస్లాం ఎలా వ్యాపించింది’ అనే తన అధ్యయన పత్రంలో ఇస్లాం ఖడ్గం ద్వారానే వ్యాపించిందనే వాదనను ఖండించారు. యాకీన్ ఇనిస్టిట్యూట్ వెబ్ సైట్ లో మునీర్ వ్రాసిన పత్రం ఉంది. ఇస్లాంకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించడమేకాక, ఆ ప్రచారం వల్ల ముస్లింలలో కలుగుతున్న ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడం ఈ యాకిన్ ఇనిస్టిట్యూట్ పని. స్థానికంగా, అలాగే అంతర్జాతీయంగా ముస్లింలు అనుసరించే నాలుగు వివాహ పద్దతుల్లో `మతాంతర వివాహాలు’ కూడా ఒకటని మునీర్ అంటారు. ` మతాంతర వివాహాల ద్వారా ఇస్లాంను వ్యాపింపచేసినట్లు మనకు చరిత్రలో అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఈ విషయంలో తగినంత అధ్యయనం, పరిశోధన జరగలేదు. ముస్లిమేతర మహిళలు వివాహాల మూలంగానే ముస్లింలుగా మారినట్లు మనకు తెలుస్తుంది’ అని మునీర్ వ్రాసారు.
ప్రేమ వివాహాల ద్వారా ఇస్లాం ఏయే దేశాల్లో వ్యాపించిందో మునీర్ వివరించారు. స్పెయిన్ లో ఇస్లాం ఇలానే వ్యాప్తి చెందింది. అలాగే ఆధునిక ఒట్టమన్ సామ్రాజ్యపు తొలి రోజుల్లో మతాంతర వివాహాల ద్వారానే మతమార్పిడులు జరిగాయి. బ్రిటిష్ పాలనలో భారత్ లో అనేకమంది దళిత మహిళలను ముస్లిములు ఇలానే మతాంతర వివాహాల ద్వారా మతం మార్చారని మునీర్ వ్రాసారు. ఆయన ఇంకా ఇలా వ్రాసారు – `ఇటీవలి కాలంలో కూడా మతమార్పిడులలో మతాంతర వివాహాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి’.
ఇటీవలి కాలంలో ఇస్లాం వ్యాప్తిలో బెదిరింపులు, బలవంతపు పద్దతుల బదులు ప్రేమ వివాహాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయన్న వాదనను మునీర్ కూడా సమర్ధించారని ఫిలిప్ ఫర్గూస్ పేర్కొన్నారు. ఫర్గూస్ వాదనను బలపరచే విధంగా కేవలం వ్యక్తులనేకాక ఏకంగా దేశాలకు దేశాలను మతం మార్చడానికి ఈ వివాహాలను ఎలా ఉపయోగించారో మునీర్ వివరించారు. మునీర్, ఫర్గూస్ లతో ఏకీభవిస్తూ క్రిస్టియాన్ సి. సాహ్నర్ తన `క్రిస్టియన్ మార్టియర్స్ అండర్ ఇస్లాం: రిలిజియస్ వయలెన్స్ అండ్ ది మేకింగ్ ఆఫ్ ది ముస్లిం వరల్డ్’(ప్రిన్ స్టన్ యూనివర్సిటీ ప్రెస్) అనే పుస్తకంలో `క్రైస్తవ దేశాల్లో ఇస్లాం వివాహాల ద్వారానే వ్యాపించింది’ అని వ్రాసారు. ముస్లిమేతర స్త్రీల పట్ల ముస్లిం పురుషుల ప్రేమలో ఎక్కువగా మతప్రయోజనాలు కనిపిస్తాయి. ఈ మతాంతర వివాహాలు ఇస్లాం వ్యాప్తిలో భాగమన్నది నిర్వివాదాంశం.
ఏకపక్ష ప్రేమలు, పెళ్లిళ్లు
మరొక విషయం ఏమిటంటే ఈ మతాంతర వివాహాలన్నీ ఏకపక్షమైనవే. ముస్లిం పురుషులే, ముస్లిమేతర మహిళలను వివాహం చేసుకునే వీలుంది. ఎందుకంటే ముస్లిం స్త్రీలు ముస్లిమేతర పురుషులను వివాహం చేసుకోవడాన్ని ఇస్లాం మతనిబంధనలు ఒప్పుకోవు. ఆ నిబంధనను తూచ తప్పక పాటిస్తారు కూడా. తమ ఇళ్ళలో మగపిల్లలు ముస్లిమేతర ఆడపిల్లలను పెళ్లి చేసుకోవడాన్ని ఒప్పుకునే ముస్లింలు అదే తమ ఆడపిల్లలు ఇతర మతాలకు చెందిన మగపిల్లలను వివాహం చేసుకోవడాన్ని ఏమాత్రం అంగీకరించరని అమెరికాలోని ప్యూ అధ్యయన సంస్థ పరిశీలనలో వెల్లడైంది.
భారత్ లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమి లేదు. 2009-12 మధ్య కాలంలో కేరళలో 2,667 మంది ముస్లిమేతర మహిళలు మతమార్పిడికి గురైతే కేవలం 81మంది ముస్లిం మహిళలు మాత్రమే ఇతర మతాలకు మారారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమేన్ చాంది 2012లో ఒక ప్రకటనలో(ఇండియా టుడే, 4.9.2012) వెల్లడించారు. అంటే వివాహం తరువాత ఇస్లాం స్వీకరించిన ముస్లిమేతర మహిళల సంఖ్య, పెళ్లి తరువాత ఇతర మతాలు పుచ్చుకున్న ముస్లిం మహిళల కంటే 33 రెట్లు ఎక్కువన్నమాట.
కేరళ లవ్ జిహాద్ గురించి ప్రపంచానికి తెలిసింది
లవ్ జిహాద్ అనే మాట 2009లో కేరళలో పుట్టింది. ఎందుకంటే అక్కడ ఇలాంటి మతాంతర వివాహాలు పెద్ద సంఖ్యలో జరిగాయి. ముస్లిం పురుషులు ముస్లిమేతర మహిళలను పెళ్లిచేసుకుంటున్న సంఘటనల గురించి పూర్తి దర్యాప్తు చేయాలంటూ కేరళ హైకోర్ట్ ఆదేశించడంతో ఈ మాట మరింత ప్రచారంలోకి వచ్చింది. లవ్ జిహాద్ అనేది కేవలం కొందరు హిందుత్వవాదులు చేస్తున్న ప్రచారమేనంటూ కొట్టిపారేసే ప్రయత్నం జరిగినా ఈ లవ్ జిహాద్ లో క్రైస్తవ మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్నారంటూ క్రిస్టియన్ అసోసియేషన్ ఫర్ సోషల్ యాక్షన్ అనే క్రైస్తవ సంస్థ కూడా ఆరోపించడంతో ప్రపంచం దృష్టి ఈ విషయంపై పడింది.
`భారత్: లవ్ జిహాద్ పై ఆందోళన చెందుతున్న చర్చ్, ప్రభుత్వం’ అంటూ కాథలిక్ యూనియన్ ఆసియా న్యూస్ (13.10.2020) అనే పత్రిక శీర్షిక పెట్టింది. కర్ణాటక ప్రభుత్వం కూడా లవ్ జిహాద్ సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తోంది. 2010లో కేరళ ముఖ్యమంత్రి వి ఎస్ అచ్యుతానందన్ రాగల 20ఏళ్లలో రాష్ట్రాన్ని పూర్తిగా ఇస్లామికరణ చేసేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) ప్రయత్నిస్తోందని, అందుకు `డబ్బు, వివాహాలు’ అనే మార్గాలు అనుసరిస్తోందని ఒక ప్రకటనలో (టైమ్స్ ఆఫ్ ఇండియా, 26.7.2020) ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో లవ్ జిహాద్ పై చర్చ మళ్ళీ ఊపందుకుంది.
2017లో రాష్ట్రంలో లవ్ జిహాద్ కేసులను దర్యాప్తు చేయాలంటూ డిజిపి ని కేరళ హైకోర్ట్ ఆదేశించింది. ఆ తరువాత రాష్ట్రంలో లవ్ జిహాద్ కేసులు ఉన్నాయంటు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. 2019లో రాష్ట్ర మైనారిటీ కమిషన్ వైస్ ఛైర్మన్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు వ్రాసిన ఒక ఉత్తరంలో క్రైస్తవ మహిళలను ఇస్లాంలోకి మతం మార్చడమేకాక వారిని తీవ్రవాదంలోకి ప్రవేశపెడుతున్నారని, `లవ్ జిహాద్ సాగుతోందని’ పేర్కొన్నారు.
పెరుగుతున్న లవ్ జిహాద్ కేసుల గురించి 2020లో సైరో మలబార్ చర్చ్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. దానితో ఈ లవ్ జిహాద్ వ్యవహారం ప్రపంచం దృష్టికి వచ్చింది. లవ్ జిహాద్, మతాంతర వివాహాలు ఇస్లామీకరణకు, మతమార్పిడులకు దారితీసున్నాయని, వీటివల్ల బౌద్ధానికి ముప్పు ఏర్పడుతోందని బర్మా, థాయిలాండ్ లలో బౌద్ధులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. (Buddhist Islamophobia: Actors, Tropes, Contexts).
కాలంచెల్లిన ఆలోచన
ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే కొత్త రకంగా ఆలోచించవలసి ఉంటుంది. 20వ శతాబ్దపు మౌలిక ఆలోచనలు నేడు ప్రమాదంలో పడ్డాయి. వ్యవస్థీకృత మతాలు కనుమరుగవుతాయన్నది కలగానే మిగిలిపోతుంది. మతం మానవ సమాజాన్ని మరింత ప్రభావితం చేస్తోంది. నేటి ఉదారవాదులు తమ ఆదర్శమైన మాక్స్ వెబర్ 1918లో చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తుచేసుకోవాలి. మతం, మూఢవిశ్వాసాల మూలాలను ప్రశ్నించే శాస్త్ర విజ్ఞానం విలువలు, నైతికతకు సంబంధించిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోవచ్చని వెబర్ చెప్పాడు. కానీ అటు మతం, ఇటు శాస్త్ర విజ్ఞానాల్లో లోపాలు ఆధునిక ప్రపంచంలో మౌలికమైన సమస్యలు తెచ్చిపెడుతున్నాయి.
పాత తరహా మత భావనలను అనుసరించడం సమస్యకు నాసిరకమైన పరిష్కారమే అవుతుందని వెబర్ భావించినా ఆయన తరువాత వందేళ్ళకి ఆయన నిరాకరించినదే నిజమవుతున్నది. నేడు ప్రపంచాన్ని మతభావనలే ఏలుతున్నాయి. మతపట్టింపు కలిగిన జనాబా 2050నాటికి 2.3 బిలియన్ లకు చేరుకుంటే, మతంతో సంబంధంలేని జనాభా కేవలం 0.1 బిలియన్ కే పరిమితం అవుతుందని అంచనా. వీరి సంఖ్య 1970 దశకంలో 1 నుంచి 5 బిలియన్ లు ఉండేది. అంటే వీరి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చిందన్నమాట.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రపంచ ఆర్ధిక ఫోరం ఒక నివేదికలో `వ్యవస్థీకృత మతాలు కనుమరుగవుతాయన్నది అభూత కల్పన. 2010 నుండి 2050 మధ్య కాలంలో మతంతో సంబంధం లేదని చెప్పినవారికంటే మతమే తమకు ముఖ్యమన్న వారి జనాభా 23 రెట్లు పెరిగిందని ఇటీవలి అధ్యయనాలు చెపుతున్నాయి’ అని పేర్కొంది.
ఇలా ప్రపంచమంతటా మతవాదం పెరిగి, వెబర్ సూచించిన ఉదారవాదానికి కాలంచెల్లిన నేపధ్యంలో మతం కోసం ప్రేమించడం, వివాహాలు చేసుకోవడం అనే ధోరణులను ఉదారవాదం ఏమాత్రం పరిష్కరించలేదు. దీనికి భిన్నమైన మార్గం, ప్రత్యామ్నాయం ఇప్పుడు అవసరం. ఈ విషయాన్ని గురించి నిజాయితీతో కూడిన, నిస్సంకోచమైన చర్చ అవసరం. కానీ భారత్ లో అనుసరిస్తున్న బూటకపు సెక్యులరిజం అటువంటి చర్చకు తావిస్తుందా అన్నదే ప్రశ్న.
(రచయిత తుగ్లక్ పత్రిక సంపాదకులు, ఆర్ధిక, రాజకీయ విషయాల విశ్లేషకులు)