Home Telugu Articles సామాజిక సమరసతా మూర్తి సంత్‌ రవిదాస్

సామాజిక సమరసతా మూర్తి సంత్‌ రవిదాస్

0
SHARE

–సామల కిరణ్

భారతదేశ తాత్విక ఉద్యమాలలో భక్తి కవులదొక అధ్యాయం. పధ్నాలుగో శతాబ్దం నాటికి భారతదేశంపై విదేశీ ముస్లిం ఆక్రమణకారుల పట్టుబిగిసింది. బలవంతపు మత మార్పిడులు సామూహికంగా జరుగుతున్న కాలమది. రెండవవైపు హిందూ సమాజంలో కులం పేరుతో అసమానతలు, అంటరానితనం తీవ్రంగా వున్న కాలమది. ఆ సమయంలో జన్మించిన రవిదాస్ తన భక్తిగీతాల ద్వారా భక్తి ఉద్యమానికి తెరతీశారు.అంబేద్కర్‌ స్ఫూర్తి పొందిన భక్తి కవులలో ముఖ్యులు కబీర్‌, సంత్‌ రవిదాస్‌లు. ఎవరైతే తాము బతికిన కాలంలో ఎంతో మందిని తన భావజాలంతో ప్రభావితం చేస్తారో వాళ్లే చరిత్ర మలుపులో నిలబడి రాబోయే కాలానికి దిశా నిర్ధేశం చేస్తారు. అలాంటి వారిలో రవిదాస్‌ ఒకరు. అందుకే ఆయన అనుమాయిలు ఆయన బంగారు విగ్రహాన్ని జలందర్‌ నుంచి కాశీ వరకూ మోసుకొచ్చారు. ఇప్పుడు ఆయన ప్రభావం పంజాబ్‌ నుంచి దేశమంతా విస్తరించింది.

సంత్‌ రవిదాస్‌ భక్తి కవుల్లో ఒక ఆధ్యాత్మిక భావాన్నే కాకుండా సామాజిక భావాలనూ అభివృద్ధి చేశారు. బానిస భావాలను వ్యతిరేకించారు. మానసిక బానిసత్వాన్ని , కుల బానిసత్వాన్ని , శారీరక బానిసత్వాన్ని వ్యతిరేకించాడు. మనిషి స్వతంత్రుడై గౌరవమైన ఆలోచనలతో జీవించాలని, తలవంచి జీవించడాన్ని నిరాకరించాడు. ప్రతి మనిషిలోని చైతన్యాన్ని ఆయన ఉద్దీపింపచేశాడు. మానవతాపూర్ణంగా మనిషి ఉండాలని తన కవిత్వంతో, తన పాటతో చాటారు. సమాజాన్ని మేల్కొలిపే బాటలో పయనించారు.

  సంత్ రవిదాస్ క్రీ.శ. 1377లో కాశీవద్ద సీర్ గోవర్దనపురం అనే గ్రామంలో, మాఘపూర్ణిమ రోజున చర్మకార కుటుంబంలో జన్మించారు. కలసాదేవి, సంతోఖ్‌దాస్ తల్లిదండ్రులు. రవిదాస్‌, కబీర్‌కు సమకాలీకుడని చరిత్రకారులు తేల్చారు. ఆయన ఆధ్యాత్మిక సన్యాసిగానే  అంటరానివారి కోసం ఉద్యమాన్ని నడిపారు. వారి సాంఘిక విముక్తి కోసం కృషిచేశారు. సామాన్యులే కాదు, శ్రీకృష్ణుని ఆరాధకురాలయిన అంత:పురవాసి మీరాబాయి లాంటి వారెందరో రవిదాస్‌ వెంటనడిచారు. ఆయన పదాలు బనారస్‌ దాటి ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, గుజరాత్‌ల వరకూ ప్రవహించాయి. భక్తకవిగా, ఒక ప్రవక్తగా ఎదిగి ఆయన చేసిన పోరాటం ఈనాటి సమాజానికి ఒక స్ఫూర్తి. ఆయన కవితల్లో అతి సున్నితంగా సందేశం, శాంతి సమానతలు ప్రజల ఆలోచనల్లో అద్భుతమైన ప్రభావం చూపుతాయి. రవిదాస్‌కు కాశీ మహా రాజు, మహారాణి కూడా శిష్యులయ్యారు. సాక్షాతూ కాశీ మహరాజ్ రవిదాస్ జ్ఞానానికి పాదాక్రాంతుడై ఆయన్ని సన్మానించాడు. రవిదాస్‌ జీవితాంతం తన చర్మకార వృత్తిని అవలంబిస్తూనే అత్యంత నిరాడంబరంగా బతికారు. చిత్తోడ్ రాజు రాణా సంగా, రాణిఝాలీ దేవిల అభ్యర్థన మేరకు రవిదాస్ దంపతులు చిత్తోడ్ వెళ్లారు. వీరికి అక్కడ రాజమర్యాదలతో స్వాగతం లభించింది. మహారాజు వద్ద అతిథిగా కొంతకాలం అక్కడే ఉన్నారు. చిత్తోడ్ కోటలోనే రవిదాస్ తన 120వ ఏట భగవంతునిలో లీనమయ్యారని చెపుతారు.

 సమానో మంత్ర… అనే వేదసారమంతా రవిదాస్‌ పదాలలో ఉంది. ”ఐసా బహురాజ్‌ మై జహో మిలైసబన్‌ కో అక్న్‌ చోట్‌ బడో సబ్‌ సమ్‌ బసై రైదాస్‌ రహె ప్రసన్న్‌ ” – ( ఎక్కడైతే అందరికీ భోజనం లభిస్తుందో , ఎవరూ ఆకలితో నిద్రపోరో.. ఎక్కడ ఎక్కువ తక్కువుల అసమానతలు లేకుండా ప్రజలు జీవిస్తూ ఉంటారో .. అలాంటి సమాజాన్ని , అలాంటి పాలనా వ్యవస్థని రవిదాస్‌ కోరుకుంటున్నాడు). ”కులం గురించి ఎవరూ, ఎవర్నీ అడగ కూడదు. బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు అందరూ మనిషి కులానికి చెందినవారే. మానవత్వమే పరమ ధర్మం” అని ఆయన బోధించారు. ఆయన చెప్పే ప్రతి మాటా అనుభవం నుంచి, అధ్యయనం నుంచి, అవగాహన నుంచి మానవతావాదం నుంచి పుట్టుకొచ్చాయి. ” నా కులం చమార్‌. ప్రజలు దాన్ని తక్కువగా చూస్తున్నారు. మా జాతి చనిపో యిన జంతువులను ఊరికి దూరంగా మోసుకెళ్లి పర్యావరణం దెబ్బతినకుండా చూస్తూ ఉంది. మంచి గాలిని సమాజానికి ప్రసాదిస్తూ , సమాజ హితానికి తోడ్పడుతోంది” అని చాటారు. జాతి వైతాళికులైన అంబేద్కర్‌ లాంటి వారిపై రవిదాస్‌, తదితర భక్తి కవుల ప్రభావం ఉంది. రవిదాస్‌ ఒక వ్యక్తి కాదు. ఉద్యమం. సామాజిక సమరసత కోసం పోరాడే ప్రతి ఒక్కరికీ ఒక ఉత్తేజం. పదవుల లాలసతో నేటి విభజన, విద్వేష రాజకీయాలు గ్రామీణ ప్రజా జీవితాల్ని విచ్చిన్నం చేస్తున్న తరుణంలో సంత్ రవిదాస్ బోధనలు, జీవితం విస్తృత ప్రచారం చేయాలి. సామాజిక సమరసతను నిర్మాణం చేసి సామూహిక ప్రజా జీవితాలలో శాంతిని నింపాలి.

(ఫిబ్రవరి 24, మాఘ పౌర్ణిమ సంత్ రవిదాస్ జయంతి)