గతంలో వివిధ కారణాల వల్ల మతం మారిన హిందూ బంధువులను స్వధర్మంలోకి ఆహ్వానిద్దామని అఖిలభారత సహ ధర్మజాగరణ ప్రముఖ్ శ్రీ ఆలె శ్యామ్ కుమార్ గారు పిలుపునిచ్చారు. ధర్మ జాగరణ సమితి, ఆంధ్ర ప్రదేశ్ వారు రూపొందించిన “పునరాగమనం – సంక్షిప్త చరిత్ర” అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం విజయవాడలోని శిశు విద్యా మందిర్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలె శ్యామ్ కుమార్ గారు హాజరై ఈ పుస్తకాన్నిఆవిష్కరించారు. హిందీలో డాక్టర్ శ్రీరంగ గోడ్బోలే రచించిన ఈ గ్రంథాన్ని శ్రీ సుబ్రహ్మణ్యం (మణి) తెలుగులోకి అనువదించారు. విజయవాడలోని సాహిత్యనికేతన్ ప్రచురణ సంస్థ ఈ గ్రంథాన్ని వెలువరించింది.
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలె శ్యాం కుమార్ గారు మాట్లాడారు. “ఇతర మతాలలోకి, ప్రత్యేకించి ఇస్లాం, క్రైస్తవ మతాలలోకి మార్చబడ్డ హిందువులు తిరిగి తమ మూల ధర్మంలోకి, మూల సమాజంలోకి వచ్చే ప్రక్రియ “ఘర్‌వాపసీ” అనే పేరుతో వాడుకలోకి వచ్చింది. దీనిని “శుద్ధి” అని “పునరాగమనం” అని కూడా అంటున్నారు.
భారతదేశంలో నివసిస్తున్న ముస్లింలలో, క్రైస్తవులలో అత్యధికుల పూర్వజులు హిందువులే. వారిని ఒకానొక కాలంలో భయానికి, మోసానికి, లేదా ప్రలోభానికి గురిచేసి మతం మార్చడం జరిగింది. మతం మారడం దాస్యానికి ఆరంభం. నేటికి కూడా హిందువులను మత మార్పిళ్ళకు గురి చేస్తూండడం ఒక సమస్యగా కొనసాగుతూనే ఉంది. హిందూ సమాజాన్ని, భారత దేశాన్ని మళ్లీ దాస్యంలోకి నెట్టాలనుకుంటున్న వాళ్లు నేటికి మత మార్పిడి వ్యాపారాన్ని సాగిస్తున్నారు. కానీ మతం మారిన వారు తమ పరంపరాగతమైన సొంత ఇంటికి వచ్చినపుడు మాత్రమే వారు దాస్యపు సంకెలల నుంచి విముక్తి పొందారని చెప్పగలం.
మత మార్పిడికి, బానిసత్వానికి గల పరస్పర సంబంధం మన పూర్వీకులకు బాగా తెలుసు. అందుచేత మతం మార్చబడ్డ మన వారిని వారి మాతృ సమాజంలోకి తిరిగి విలీనం చేసుకునే ప్రయత్నాలు మన దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూనే వచ్చాయి. మన ఋషులు, మహాపురుషులు ఈ ప్రక్రియను ధర్మశాస్త్రాల ఆధారంగా సాగించారు. ఏ కారణం వల్లనైనా అపవిత్ర జీవితం గడుపుతున్న వారికి పునరాగమనం జరిపే విధానం హిందూ ధర్మశాస్త్రాలలో ప్రాచీన కాలం నుంచీ ఉంది. మన పూర్వీకులు ఆచరించిన పునరాగమన పద్ధతులను అనుసరించి మనం కూడా మతం మారిన మన బంధువులను అక్కున చేర్చుకోవాలి. ఉన్నవారు మారకుండా కాపాడుకోవాలి ” అని శ్మాం కుమార్ గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో క్షేత్ర ధర్మ జాగరణ ప్రముఖ్ అమర లింగన్న, ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్య, ప్రాంత సంయోజక్ శ్రీ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
Courtesy: VSK ANDHRA