Home News స్వేరో ఐ.పి.ఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తీరుపై నిరసనలు.. ఫిర్యాదులు 

స్వేరో ఐ.పి.ఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తీరుపై నిరసనలు.. ఫిర్యాదులు 

0
SHARE
  • తెలంగాణ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు దాఖలు చేసిన హిందూ, ఎస్సీ సంఘాలు
  • స్వేరోల కార్యకలాపాలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన ఎంపీ రఘు రామకృష్ణ రాజు
  • కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్
  • తీవ్ర స్థాయిలో ఖండించిన విశ్వ‌హిందూప‌రిష‌త్‌

తెలంగాణ: వివాదాస్పద ఐపీఎస్ అధికారి, తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అతనిపై పలు ఎస్సీ సంఘాలు, హిందూ ధార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశాయి. అంతే కాకుండా, నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు ప్రవీణ్ కుమార్ సారథ్యంలో నడిచే స్వేరోస్ సంస్థ కార్యకలాపాలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించడం చర్చనీయాంశం అయ్యింది.

తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల డిపార్ట్మెంట్ సెక్రెటరీగా కొనసాగుతున్నఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ బలహీనవర్గాల సంక్షేమం పేరిట ‘స్వేరోస్’ అనే ప్రయివేట్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ నెల మార్చి 14,15 తేదీల్లో పెద్ద‌ప‌ల్లి జిల్లాలోని ధూలిక‌ట్ట గ్రామంలోని పురాత‌న బౌద్ధ స్మారకం వద్ద ‘స్వేరోస్’ ఆధ్వర్యంలో ‘భీమ్ దీక్ష’ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ ‌కుమార్ తో పాటు అతడి సంస్థకు చెందిన అనేకమంది సభ్యులు పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మంలో నిర్వాహకులు చేసిన ప్రతిజ్ఞ అత్యంత వీవాదాస్పదంగా మారింది. “నేను రాముడిని, కృష్ణుడిని నమ్మను. నాకు గౌరీ, గణపతి లేదా ఇతర హిందూ దేవతల మీద నమ్మకం లేదు. నేను వారిని ఆరాధించను. భగవంతుని అవతారాల భావనను నేను అంగీకరించను” అంటూ సాగిన ప్రతిజ్ఞ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ కూడా ప్రతిజ్ఞ చేస్తూ కనిపించడంతో హిందూ సమాజాన్ని విస్మయపరిచింది.

హిందూ మతాన్ని పనిగట్టుకుని వ్యతిరేకిస్తూ సాగిన ప్రతిజ్ఞలో ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పాల్గొనడంపై హిందూ సంస్థలు, ఎస్సీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు దాఖలు చేశాయి. ధూలిక‌ట్ట పోలీస్ స్టేషన్లో సమితి సభ్యులు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మీద, ఇతర స్వేరో సభ్యుల మీద  ఫిర్యాదు దాఖలు చేశారు. రాష్ట్రీయ దళిత్ సేన పేరిట నారాయ‌ణ పేట జిల్లా కొస్గి మండ‌ల పోలీస్ స్టేషన్లో మరొక ఫిర్యాదు దాఖలైంది. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుకులాల కార్యదర్శిగా ఉంటూ స్వేరోస్ అనే ప్రయివేట్ సంస్థ ఏర్పాటు చేసి నిరుపేద కుటుంబాల‌కు చెందిన పిల్లల మ‌నసుల్లో విద్య పేరిట హిందూ వ్యతిరేక  విష‌బీజాలు నాటుతూ వారికి హిందూ మ‌తంపై ద్వేషం క‌లిగేలా ఐపీఎస్ ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారని సమితి అధ్యక్షులు కర్నె శ్రీశైలం పేర్కొన్నారు. ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో రాష్ట్రంలో అనేక గురుకుల పాఠ‌శాల‌లు, హ‌స్ట‌ళ్లు న‌డుస్తున్నాయి. స్వేరోస్ సంస్థ హిందూ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించి పాఠశాలల్లోని  పిల్ల‌ల‌ను చ‌దువు పేరుతో సంఘ‌ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని శ్రీశైలం తెలిపారు.

కేంద్రానికి లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదు: 

ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వ్యవహారంపైనా, స్వేరోస్ పేరిట చేపట్టిన కార్యకలాపాలపైనా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ కేంద్ర హోమ్ శాఖకు, ప్రధానమంత్రి కార్యాలయానికి చెందిన సహాయక మంత్రి జితేందర్ సింగ్ తో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ కు సెక్రెటరీకి ఫిర్యాదు చేసింది. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ అధికారిగా ఉంటూ తన ప్రభుత్వేతర కార్యకలాపాలలో పాల్గొంటూ సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నియమావ‌ళి 1964 రూల్స్ ఉల్లంగిస్తున్నారని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ ఫిర్యాదులో పేర్కొంది. ఇది సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నియమావ‌ళి 1964లోని జనరల్ రూల్స్ 3 (1) (xviii) , 4 (2) (3) ప్ర‌కారం విరుద్ద‌మ‌ని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ పోలీస్ ఉద్యోగులు ప్రయివేట్ సంస్థల ఏర్పాటు, వాటి కార్యకలాపాలలో పాల్గొనడం వంటివాటిపై నియంత్రణ విధిస్తున్నట్టు ‘ది పోలీస్ ఫోర్సెస్ (రిస్ట్రిక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్ 1966’లోని 3, 4 సెక్షన్లు తెలియజేస్తున్నాయని కూడా లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ స్పష్టం చేసింది.

రాష్ట్రపతికి ఎంపీ రఘు రామకృష్ణ రాజు ఫిర్యాదు:

మరో వైపు ఇదే వ్యవహారంపై నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజు రాష్ట్రపతిని కలిసి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మీద ఫిర్యాదు సమర్పించారు. ఐపిఎస్ కేడర్ కు చెందిన ప్ర‌వీణ్‌కుమార్ తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా 7 సంవత్సరాల కంటే ఎక్క‌వ కాలం కొన‌సాగుతున్నార‌ని, ఇది శాఖాప‌ర‌మైన సంప్రదాయానికి పూర్తి విరుద్ద‌మ‌ని, అంతే కాకుండా పూర్తి సమయం పోలీసు అధికారిగా పనిచేసిన అనుభవం లేకుండానే ఇటీవలే అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి పొందార‌ని రఘు రామకృష్ణరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.

“ప్ర‌జాధ‌నంతో ప్రభుత్వం నడుపుతున్న గురుకులాలను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, స్వేరోస్ స‌భ్యుల బృందం పూర్తిగా వారి గుప్పెట్లోకి తీసుకుని త‌మ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.  వారు ఈ సంస్థలలో పనిచేసే బోధన, బోధ‌నేత‌న సిబ్బందిని బెదిరింపుల‌కు గురి చేస్తున్నారు. పాఠ‌శాల‌, కళాశాల పిల్లలతో క్రమం తప్పకుండా హిందూ వ్యతిరేక సమావేశాలు నిర్వహిస్తారు. ప‌సి మనస్సులలో ద్వేషం, విభజన వంటి విష‌బీజాలను నాటుతున్నారు.  హిందూ పండుగలకు సెలవులను ర‌ద్దు చేస్తూ ఈ పాఠశాలల నియమాలను కూడా మార్చివేశారు.  పిల్లలు తమ కుటుంబ విశ్వాసం, పూర్వీకుల సంప్రదాయాలను జరుపుకోకూడదని ప్రతిజ్ఞ చేయవలసి వస్తుంది అని ఎంపీ రాష్ట్రపతికి తెలిపారు.

మత ఆధారిత సంఘర్షణలు, శాంతిభద్రతల అంతరాయానికి కారణాలను సృష్టిస్తూ, కులం పేరుతో సమాజంలో చిలిక‌లు తేవ‌డానికి కుట్ర‌లు చేస్తూ, పాఠ‌శాల‌కు వ‌చ్చే చిన్న పిల్ల‌ల‌ను త‌మ పూర్వీకుల మ‌తాన్ని ద్వేషించమని, కొత్త మ‌తాన్ని స్వీకరించమని బలవంతం చేయడం భారత రాజ్యాంగం బాల‌ల‌కు క‌ల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అవుతోంద‌ని,   సంక్షేమం పేరిట స‌మాజంలో హింసను ప్రేరేపించే కార్యకలాపాలు నిలిపివేయాల‌ని, వెంట‌నే ఆర్‌.ఎస్ ప్ర‌వీణ్ కుమార్ పై  న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రఘు రామకృష్ణరాజు రాష్ట్రపతిని కోరారు.

తెలంగాణాలో నిర‌స‌న‌లు:

ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వ్యవహారంపై తెలంగాణాలో పలు సంస్థలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.

హిందూ దేవీదేవ‌త‌ల‌ను ఆరాధించ‌వ‌ద్దు అంటూ ఐపిఎస్ ఆర్ ఎస్ ప్ర‌వీణ్ స‌మ‌క్షంలో చేసిన ప్ర‌తిజ్ఞ‌ను విశ్వ‌హిందూ ప‌రిష‌త్ తీవ్రంగా ఖండించింది.

రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై, స్వేరోల దాష్టీకంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ భాగ్యనగర్ విభాగ్ లోని నిజాంకాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, సిటీ కాలేజ్, vv కాలేజ్ కోఠి, ఖైరతాబాద్ డిగ్రీ కాలేజ్ లో ర్యాలీలు నిర్వహించి, మోకాళ్లపై నిలబడి నిరసన చేసి గురుకుల ల కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఏబీవీపీ మేడ్చల్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ దేవేందర్ ఆధ్వ‌ర్యంలో చింతల్ IDPL చౌరస్తాలో నిరసన ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ గురుకులాల్లో కాంట్రాక్టుల పేర నిధులు దండుకుంటున్న స్వేరోల అక్రమాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. అమ్మాయిల పై జరుగుతున్న అత్యా చారాలపై విచారణ జరిపి దుండగులను శిక్షించాలని, వీటన్నిటిని విశ్రాంత నాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మెదళ్లలో విషబీజాలను నాటుతున్న గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని విధుల నుండి తొలగించాలని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

వివాద‌స్ప‌ద ప్ర‌తిజ్ఞ చేసిన ధూళిక‌ట్ట ప‌రిధిలోని పోలీసు స్టేష‌న్‌లో ‌ఎస్సీ రిజ‌ర్వేష‌న్ ప‌రిర‌క్ష‌ణ స‌మితి (SCRPS)  పెద్ద‌ప‌ల్లి జిల్లా అధ్యక్షుడు కృష్ణ ఆధ్వ‌ర్యంలో ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌పై ఫిర్యాదు చేశారు.