“శ్రీ రాముడిని, శ్రీ కృష్టుడిని పూజిస్తాం.. అంబేద్కర్‌ను అనుసరిస్తాం” అని SC, ST హక్కుల సంక్షేమ వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహేందర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు ఈ దేశ సంస్కృతిని పరిపుష్టం చేసిన ఆదర్శ పురుషులని, సామాజిక సమరసమతకై ఉద్యమించడానికి, శ్రీ రామ, కృష్ణులను ఆరాధించడానికి మధ్య వైరుధ్యం ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. ఐపిఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వ్యక్తిగత అభిప్రాయాలు ఏవైనా కలిగి ఉండవచ్చు కానీ అతని అభిప్రాయాలను గురుకుల విద్యార్థులు, అధ్యాపకులపై రుద్దే హక్కు, అధికారం ఆయనకి లేదని, ఆయన చర్యలను ఎస్సీలుగా తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఆయా కాలాల్లో ఉన్న దురాచారాలను తొలగించడానికి పుట్టిననే జైన, బౌద్ద, సిక్కు మతాలని, ఈ మతాలకు తమదైన ప్రత్యేకతలు ఉన్నట్టే, ఈ భారతీయ మతాలకు అనేక అంశాలలో సారూప్యతలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సత్యం అర్థంకాని విదేశస్తులు ఇవి సనాతన ధర్మంపై తిరుగుబాటని కావాలని ప్రచారం చేశారని ఆయన తెలిపారు.
2,500 సంవత్సరాల క్రితము బౌధ్ధ మతం పుట్టిందని, దేవుడు, ఉన్నాడని కానీ లేడని కానీ ఏదీ ఇతమిద్దంగా బుద్ధుడు చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. తరువాత కాలంలో ప్రపంచ మంతటా బుద్ధుని విగ్రహాలను పూజించడం ప్రారంభమైందని, బుద్ధుని కాలంలోనే పునర్జన్మను బలపరిచే జాతక కథలు వెలుగు చూశాయని ఆయన పేర్కొన్నారు. బౌద్ధంలో హీనయానము, మహాయానం ఇలా అనేక శాఖలు ఏర్పడ్డాయని, టిబెట్ దేశంలో బౌద్ధులు అనేక తాంత్రిక పద్దతులను ఇప్పటికీ పాటిస్తారు. అని ఆయన పేర్కొన్నారు.
” బౌధ్ధమతం అనేక విలువలను మనకు అందించింది. కనుకనే బుద్ధుడిని భగవంతుడిగా ఆరాధిస్తారు. యూదుల వలె యేసు క్రీస్తును శిలువ ఎక్కించినట్లు హిందువులు బుద్ధుని పట్ల వ్యవహరించ లేదు. బుద్ధుని బోధనలకు పూర్తి వ్యతిరేకమైన అనేక అంశాలు తదుపరి కాలంలో బౌధ్ధ మతంలో వచ్చి చేరాయి. డా.అంబేడ్కర్ అనుయాయులమని ఇప్పుడు చెప్పుకుంటున్నవారికి, నవ బౌద్ధులకు అష్టాంగ మార్గంలో సాధన చేయడం కంటే సనాతన ధర్మాన్ని విమర్శించడమే ఎక్కువైంది. ప్రవీణ్ కుమార్ బోధిస్తున్న, ఆచరిస్తున్న మార్గం అలాంటి పెడదారే! ” అని ఆయన పేర్కొన్నారు.
ఎస్సీ లుగా ఉన్న తామంతా డా.అంబేద్కర్ ను ఆరాధిస్తామని, అనుసరిస్తామని అలాగే రాముడు, కృష్ణులను పూజిస్తామని ఆయన స్పష్టం చేశారు.