Home Ayodhya తదుపరి లక్ష్యం ఉపమండలం వరకు శాఖల విస్తరణ – ఆర్.ఎస్.ఎస్ ప్రాంత కార్యవాహ శ్రీ కాచం...

తదుపరి లక్ష్యం ఉపమండలం వరకు శాఖల విస్తరణ – ఆర్.ఎస్.ఎస్ ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేశ్

0
SHARE

 ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ ప్రతినిధిసభ సమావేశాలు బెంగళూరులో ఈ నెల 19,20 లలో జరిగాయి. వీటిలో గత సంవత్సరపు కార్యక్రమాల సమీక్షతోపాటు వచ్చే సంవత్సరపు ప్రణాళిక గురించి చర్చించారు. ఈ సమావేశాల విశేషాలను వివరించేందుకు గురువారం రోజున‌ (మార్చి 25, 2021) ఆర్.ఎస్.ఎస్ కార్యాలయం కేశవ నిలయంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్న ఆర్.ఎస్.ఎస్ తెలంగాణా ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేశ్ ప్రతినిధిసభ సమావేశాల గురించి వివరించారు.

ప్రతినిధిసభ సమావేశాల్లో రెండు తీర్మానాలు ఆమోదించారని ఆయన తెలిపారు. అయోధ్య రామజన్మభూమిలో మందిర నిర్మాణం ఈ దేశపు అంతర్నిహిత శక్తి సాక్షాత్కారమని ప్రతినిధిసభ అభిప్రాయపడిందని ఆయన అన్నారు. మందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా 43 రోజులపాటు చేపట్టిన నిధి సమర్పణ అభియాన్ కూడా విజయవంతమయిందని, ఇందులో అన్ని కులాలు, వర్గాలు, మతాలకు చెందినవారు స్వచ్ఛందంగా పాల్గొని మందిరం కోసం నిధి సమర్పించారని ఆయన అన్నారు. మందిర నిధి అభియాన్ లో 5.45 లక్షల గ్రామాలలో 20.64 లక్షల కార్యకర్తలు 12.47 కోట్ల కుటుంబాలను సంపర్కం చేయగా తెలంగాణలో 12,719 గ్రామాలలో 1.94 లక్షల కార్యకర్తలు 68.59 లక్షల కుటుంబాలను కలిశారని తెలియజేశారు.

ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ మహమ్మరిని ఎదుర్కోవడంలో భారత ప్రభుత్వం, ముందు నిలిచిన కోవిడ్ పోరాట యోధులు, సాధారణ ప్రజలు చూపిన సంయమనం, స్పందనను అభినందిస్తూ ప్రతినిధి సభ మరొక తీర్మానం ఆమోదించిందని శ్రీ రమేశ్ తెలిపారు. కోవిడ్ సమయంలో స్వయంసేవకులు అనేక రకాల సేవ కార్యక్రమాల ద్వారా సమాజానికి అండగా నిలిచారు. 92,000 కేంద్రాలలో 507,000 కార్యకర్తలు 4.66 కోట్ల భోజన పొట్లాలు, 73.81 లక్షల రేషన్ కిట్లు, 89.23 లక్షల మాస్కులు వితరణ చేశారు. నగరాలలో చిక్కుకపోయినవారికి వసతి, రక్త దానం, ఆయుర్వేద కషాయ వితరణ, వలస కార్మికులకు 145,000 మందికి దారిలో భోజనం, వైద్యం, నీరు అందించారు. రైళ్లు ప్రారంభం అయ్యాక యాత్రికులకు భోజన సౌకర్యం కలిగించారు. పూణేలో కోవిడ్ సెంటర్ హైద్రాబాద్ లో డాక్టర్ల ద్వారా ఆన్లైన్ కౌన్సిలింగ్ ను సంఘ స్వయంసేవకులు నిర్వహించారు.తెలంగాణ లో 2932 స్థలాల్లో 27414 కార్యకర్తలు 2.54 లక్షల రేషన్ కిట్లు, 4.37 లక్షల భోజన ప్యాకెట్లు, 1.83 లక్షల మాస్కులు వితరణ చేశారని తెలిపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60867 కేంద్రాలలో నిత్యం, వారం, నెల శాఖలు 73,860 జరుగుతుండగా తెలంగాణాలో 2069 కేంద్రాలలో 2789 శాఖలు జరుగుతున్నాయని వివరించారు. రాగల మూడేళ్లలో ప్రతి ఉపమండలానికి శాఖల విస్తరణ చేయాలనే లక్ష్యం నిర్ణయమైందని, ఆ దిశగా పని సాగుతుందని శ్రీ రమేశ్ తెలిపారు.

ఆ తరువాత విలేకరులు కొందరు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ వ్యవహారాన్ని గురించి ఆర్.ఎస్.ఎస్ స్పందన ఏమిటన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ఇతర మతాలను కించపరచడం మంచిదికాదని, ఈ విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

హిందువులే లక్ష్యంగా భైంసాలో దాడులు జరిగితే వాటిని మతకలహాలు అని చెప్పడం విచిత్రంగా ఉందని, ఈ దాడులకు పాల్పడినవారిపై, కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ దేవేందర్, తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ నడింపల్లి ఆయూష్ కూడా పాల్గొన్నారు.