Home Telugu Articles ఆంగ్లేయుల‌ను ఎదురించి పోరాడిన గోండు వీరుడు “రాంజీగోండు”

ఆంగ్లేయుల‌ను ఎదురించి పోరాడిన గోండు వీరుడు “రాంజీగోండు”

0
SHARE

నిర్మలు నగరమున నీచ నిజాముతో
రాంజి గోండు నాడు రణమొనర్చ
వేయి మంది యురిని వేయబడిరిచట 
వినుర భారతీయ వీర చరిత..

నేడు (ఏప్రిల్ 9) రాంజీ గోండు వర్ధంతి

సహ్యాద్రి పర్వత శ్రేణుల నడుమ కోటబురుజులతో, 13గొలుసుకట్టు చెరువులతో, పచ్చని అడవులతో అలరారే ప్రాంతం నిర్మల్ నగరం. ఇప్పుడది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కొయ్యబొమ్మల నిలయం కూడా..కేవలం కోట బురుజులు, కొయ్యబొమ్మలే కాదు భారత స్వతంత్రం సంగ్రామ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించ బడ్డ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని వేయి మంది వనవాసీ వీరులను అందించిన నగరం కూడా ఈ నిర్మల్ నగరమే.

ఈ వనవాసీ వీరుల నాయకుడే మన రాంజీగోండు.
కొండల్లో, గుట్టల్లో అడవుల్లో ఉండేవారు కూడా దేశమాత స్వేచ్చ కోసం తిరుగుబాటు చేసి తమ దేహాన్ని ఆహుతిచ్చారని ఋజువు చేసిన ఉదంతానికి ప్రత్యక్ష సాక్షి వేయి ఉరుల మర్రి.
వంద‌ల‌ ఏళ్ళ కిందటే ఇక్కడి బిడ్డలకు పోరాట పాఠాలు నేర్పిన వీరుడు రాంజీగోండు 1857లో ఉత్తర భారతంలో ప్రారంభమైన ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఈ నేలన నడిపిన గోండు వీరుడే రాంజీగోండు. ఈ వీరుని నాయకత్వంలోనే ఏకకాలంలో అటు ఆంగ్లేయులు, ఇటు స్థానిక నైజాం పాలకులతో పోరాటం కొనసాగింది. చెల్లాచెదురుగా చెట్టుకొకరు పుట్టకొకరుగా ఉన్న ఈ పూర్వ ఆదిలాబాదు ప్రాంత వనవాసులందరినీ ఏకం చేసి బ్రిటిష్ కలెక్టరు నివాసప్రాంతమైన నిర్మల్ నగరాన్నే తన యుధ్ధభూమిగా ఎంచుకున్న ధీరుడు రాంజీగోండు. ఈవీరుని నేతృత్వంలో పనిచేసిన వనవీరులను రోహిల్లాలు అంటారు. ఈరోహిల్లాల పోరాటానికి చరిత్రకారులు మన చరిత్రకారులు అసలు స్థానం కల్పించలేదు.

మధ్యభారతంలోని మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే అనేకమంది గిరిజన తెగల సమూహాల్లో గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలకుల రాక పూర్వమే ఏర్పడి ఉన్నది. గోండుల పాలన క్రీ.శ 1240-1750 వరకు సుమారు 5 శతాబ్దాలపాటు కొనసాగింది. 9 మంది గోండు రాజులలో చివరివాడైన నీల్‌కంఠ్‌షా (క్రీ.శ 1735- 49)ని మరాఠీలు బంధించి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. దీంతో గోండ్వానా ప్రాంతం మరాఠీల ఆధీనమైనా, వారు బ్రిటిష్ వారికి తలొగ్గి గోండ్వానాను తెల్లదొరలకు అప్పగించారు. దీంతో గోండుల పాలన అంతమై, ఆంగ్లేయుల, నైజాం పాలన ఆరంభమైంది. వీరి పీడనకు వ్యతిరేకంగా గిరిజనుల తిరుగుబాటు మొదలైంది.

ఆదిలాబాద్ జిల్లాలోని రాంజీగోండు 1860 ప్రాంతంలో నాటి జనగాం (అసిఫాబాద్) కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్న తొలి గిరిజన పోరాట యోధుడు. బ్రిటిష్ సైన్యంతో ఎదురొడ్డి ఝాన్సీ లక్ష్మిబాయి వీరమరణం పొందిన తర్వాత నానాసాహెబ్, తాంతియాతోపే, రావు సాహెబ్‌లు తమ బలగాలతో విడిపోయారు. తాంతియా అనుచరులైన రోహిల్లా సిపాయిలు పెద్ద సంఖ్యలో మహా రాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు. వీరు అజంతా, బస్మత్, లాథూర్, మఖ్తల్, నిర్మల్‌లను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు. వీరి నేతగా ప్రకటించుకున్న రంగారావు నిజాం ప్రభుత్వాన్ని పడగొట్టి, బ్రిటిష్ వాళ్లను తరిమేయాలని పోరాటానికి పూనుకున్నాడు. సైనిక బలగాల శిక్షణలో ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసే క్రమంలో బ్రిటిష్ సైన్యానికి పట్టుబడ్డాడు. యావజ్జీవశిక్ష అనుభవిస్తూ అండమాన్ జైలులో 1860 లో మరణించాడు. రాంజీ నేతృత్వంలో పోరాటం తీవ్రమైంది.

రోహిల్లాల పోరాటం ప్రధానంగా అసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనుల ప్రాంతం. రాంజీగోండ్ సారథ్యంలో తిరుగుబాటు ఉధృతంగా మారింది. ఈ తిరుగుబాటు తుది కీలక ఘట్టం 1860 మార్చి ఏప్రిల్‌లో జరిగింది. బానిస బతుకులు వెళ్లదీస్తున్న గోండు గిరిజనులు వెట్టికి ప్రతిఫలం ఆశించడాన్ని తెల్లదొరలు వారి తాబేదారు నైజాం నవాబు సహించలేకపోయారు. ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యంతో అల్లకల్లోలంగా మారాయి. రాంజీ నాయకత్వంలో వెయ్యి మంది రోహిల్లాలు, గోండులు కలసి నిర్మల్ సమీపంలోని కొండలను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ పాలకులను ముప్పుతిప్పలు పట్టారు. నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేశా యి. ఆధునిక ఆయుధాల ముందు, బ్రిటిషు వారి కుటిల యుక్తుల ముందు ఆదివాసులు నిలవలేకపోయారు. తెగించి పోరాడుతున్న ఆది వాసులను వెనకనుండి నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. కడదాకా పోరాడిన రాంజీగోండుతో సహా వెయ్యి మందిని పట్టుకుని నిర్మల్ ఎల్లపెల్లి మార్గంలో ఉన్న మర్రి చెట్టుకు 1860 ఏప్రిల్ 9న ఉరితీశారు. ఆ మర్రి చెట్టే వెయ్యి ఉరుల మర్రిచెట్టు గా ప్రసిద్ధి చెందింది. ఇలాంటి ఘటనలు దేశ చరిత్రలో జరిగిన దాఖలాలు లేవు. ఒకేసారి ఒకేచెట్టుకు వెయ్యిమందిని ఉరితీసిన ఘటన చరిత్ర పుట‌ల్లో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. కానీ మాతృభూమి కోసం చిరునవ్వులతో ఉరికొయ్యల ముధ్ధాడిన ఆవీరుల స్పూర్తి తర్వాతి తరం స్వతంత్ర యోధులకు ప్రేరణగా నిలచింది.

తెల్లదొరల దురాగతాలకు చిహ్నంగా నిలిచిన ఆ మర్రిచెట్టు తర్వాతి కాలంలో అంటే 1995లో వచ్చిన పెద్ద వడగళ్ల వానకు నేలకు ఒరిగింది. ఆతర్వాత అప్పటి భా.జ.పా. నాయకులు శ్రీ సీ.హెచ్. విద్యాసాగర్ రావు గారి నేతృత్వంలో అదే ప్రదేశంలో మర్రి మొక్క నాటితే… కొందరు ముస్లిం దురాక్రమణ దారులు ఈ స్థలం మాది అంటూ మొక్కను తొల‌గించారు. ఆ స్థలానికి దగ్గరలోనే రోడ్డుపై తర్వాత కాలంలో ఒక స్థూపం పెట్టారు. అదే విధంగా నిర్మల్ నగరంలో గొలుసుల డర్వాజ ప్రాంతం లో ఆమహనీయుని విగ్రహం పెట్టారు. కానీ ఆవిగ్రహం ప్రాంతం మందుబాబుల నిలయంగా.. చెత్త చెదారం తొ ఆమహనీయుని అవమానించెలా ఉంది. . రాంజీగోండ్ నాయకత్వంలో సాగిన వీరోచిత పోరాటాన్ని చరిత్రకారులు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ పోరాట మూలాలను వెతుక్కుంటూ తనదైన చరిత్రను పునర్నిర్మించుకుంటున్న తరుణంలో రాంజీ చరిత్రను వెలుగులోకి తేవాలి. రాంజీ గోండ్ పోరాటాన్ని, త్యాగాల్ని భావితరాలకు అందించాలి. అదే ఆవీరునికి మనమిచ్చే ఘన నివాళి.

సేకరణ : రాం నరేష్

This article was First published in 2021