19, 20వ శతాబ్దంలో మహారాష్ట్ర సామాజిక సంస్కర్తలలో జ్యోతిరావు గోవిందరావు ఫులే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఇతర సంస్కర్తలు మహిళల స్థితిగతులు వారి హక్కులపై ప్రత్యేక దృష్టితో కుటుంబం, వివాహం సామాజిక సంస్థలను సంస్కరించడంపై దృష్టి పెట్టగా, జ్యోతిబా ఫులే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ కాలంలో, సామాజిక, రాజకీయ ఆలోచనాపరులు సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా రాజకీయంగా మహిళల స్థితిని పెంపొందించే లక్ష్యంతో ఉద్యమాలను ప్రారంభించారు. ఈ సామాజిక-రాజకీయ ఆలోచనాపరులలో మహాత్మా ఫులే, మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, రాజా రామ్ మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ లాంటివారు ముఖ్యులు. వీరు అట్టడుగు కులాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలకు సమానత్వం కోసం కృషి చేసే ఇతర వ్యవస్థీకృత ఉద్యమాలు చేపట్టారు. ఇందులో మహాత్మా ఫులే లింగ అసమానతను తీవ్రంగా వ్యతిరేకించిన తొలి నాయకుడు అయ్యారు. ప్రతి వ్యక్తి సత్యాన్ని అన్వేషించి, ఆత్మాశ్రయ సత్యాన్ని పునర్నిర్మించాలని, అప్పుడే మానవ సమాజం సంతోషంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. బ్రిటీష్ పాలన ఆర్థిక విధానం పేద రైతులకు అనుకూలమైనది కాదని ఆయన అనేక విధాలుగా విమర్శించారు, వ్యతిరేకించారు. వ్యవసాయ రంగ పరిస్థితులను మెరుగుపరిచేందుకు అనేక పరిష్కారాలను కూడా ఆయన సూచించారు. సమాజంలో సమానత్వ సూత్రాన్ని అనుసరించాలని ఫులే కోరుకున్నారు.
జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. సమానత్వం, కుల వ్యవస్థ నిర్మూలన సూత్రాలపై సమాజాన్ని స్థాపించాలని ఫులే కోరుకున్నారు. మానవ సమానత్వ హక్కుల రక్షకుడిగా ఫులే పని చేశారు. అతని రచనలలో ఒక ప్రధాన ఇతివృత్తం. మానవ నిర్మిత అసమానతలను తొలగించడానికి వారు అనేక సంస్థలను స్థాపించారు. మహర్షి షిండే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సంత్ గాడ్గేబాబా, సాహు మహారాజ్ లకు ఆయన స్ఫూర్తిదాయకం. పూలే గొప్ప రచయిత, వారి లక్ష్యాన్ని ప్రచారం చేయడానికి అనేక పుస్తకాలను రచించారు. వారి రచనలు చాలా దూకుడుగా ఉండేవి. ఫులే బాలికల కోసం పాఠశాలలను, వితంతువు మహిళలకు వారి పిల్లలకు అనాథాశ్రమాలను ప్రారంభించారు.
జ్యోతిరావు గోవిందరావు ఫులే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మాలి కులానికి చెందిన కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి గోవిందరావు, తల్లి చిమ్నాబాయి. తండ్రి మొదట్లో పూనాలో కూరగాయలు అమ్మేవారు. కాలక్రమేణా పీష్వా పరిపాలనా కాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలేగా మార్పు చెందింది. ఫులేకి 9నెలల వయసులోనే అతని తల్లి చిమ్నాబాయికి మరణించింది. అతనికి ఒక అన్నయ్య ఉన్నారు.
7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. తరువాత చదువు మానేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవారు. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజూ నిద్రకుపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునే వారు.
1841 లో జ్యోతిరావు పూనాలోని స్కాటిష్ మిషన్ హైస్కూల్లో ప్రవేశం పొందారు. 1847లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అదే సమయంలో సదాశివ భిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణునితో ఫూలే పరిచయం జీవితకాల స్నేహంగా మారింది. 13 ఏళ్ళ ప్రాయంలో ఫూలేకి 9సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగింది.
సమాజంలో దోపిడికి గురైన నిరక్షరాస్యులను, అజ్ఞానులను, పేదలను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని ఫులే నిర్ణయించుకున్నారు. దోపిడీ, ఆర్థిక చట్రం ముగిస్తే తప్ప విద్య ప్రత్యామ్నాయ జీవన విధానాలు సరిపోవని ఆయన అభిప్రాయపడ్డారు. అతని రచనలో ముఖ్యమైన కవిత ఇలా ఉంది. “విద్య లేకపోవడం వల్ల అజ్ఞానానికి దారితీస్తుంది, ఇది నైతికత లేకపోవటానికి దారితీస్తుంది, ఇది అభివృద్ధిని అడ్డుకుంటుంది. ఇది డబ్బు లేకపోవటానికి కారణమవుతుంది. ఇది అట్టడుగు వర్గాల అణచివేతకు దారితీస్తుంది, ఒక విద్య లేకపోవడం వల్ల సమాజంలో ఏ స్థితి కలుగుతుందో చూడండి! ”. సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించారు. అందువల్ల స్త్రీలు విద్యావంతులు కావాలని నమ్మారు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపారు. 1848 లో భారతదేశంలో బాలికల కోసం మొదటి పాఠశాలను ప్రారంభించారు. తరువాత వారు మహర్, మాంగ్ అట్టడుగు కులాల నుండి పిల్లల కోసం మరోక పాఠశాలలను ప్రారంభించారు.
వితంతులకు పునర్వివాహంలో చేయడంలో ఫులే దంపతులు ఎంతో కృషి చేశారు. 1854లో వితంతువులకు వసతి గృహాన్ని ప్రారంభించారు. అలాగే ఆడ శిశుహత్యలను నివారించడానికి శిశువుల కోసం ఒక వసతి గృహాన్ని ప్రారంభించారు. తన ఇంట్లో ఉన్న బావిలో దిగువ కులాల వారికి తన నీటి బావిని ఉపయోగించే వీలు కల్పించి సమాజంలో అంటరానితనాన్నితొలగించడానికి ఫులే గొప్పగా ప్రయత్నించారు.
సత్యశోధక్ సమాజ్
1873 సెప్టెంబర్ 24న ఫూలే సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ ది సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేశారు. దాంతో అతను అణగారిన వర్గాల హక్కులపై దృష్టి సారించిన మొదటి వ్యక్తిగా కుల వ్యవస్థను ఖండించారు. సత్యశోధక్ సమాజ్ హేతుబద్ధమైన ఆలోచన వ్యాప్తి కోసం ప్రచారం చేశారు. 1888 మే 11 న బొంబాయికి చెందిన మరో సామాజిక సంస్కర్త వితల్‌రావ్ కృష్ణాజీ వండేకర్ చేత ఫూలేకు మహాత్మా అనే బిరుదు లభించింది.
జ్యోతిబా 1888లో గుండె నొప్పితో బాధపడ్డారు ఆ తర్వాత పక్షవాతానికి గురయ్యారు. 1890 నవంబర్ 28న ఆయన కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత అతని అనుచరులు మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతాలలో సమాజ్ ప్రచారాన్ని కొనసాగించారు. కొల్లాపూర్ పాలకుడు షాహు మహారాజ్ సత్యశోధక్ సమాజ్ కు నైతిక మద్దతు ఇచ్చారు. మూఢ నమ్మకాలను తొలగించే ప్రయత్నాలను కొనసాగించారు. తొంభై మంది మహిళా సభ్యులను కలిగి ఉన్న మహిళా విభాగానికి సావిత్రిబాయి అధిపతి అయ్యారు.మహారాష్ట్రతో పాటు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఫులేను అనేక విధాలుగా గుర్తుచేసుకుంటారు. విశ్వవిద్యాలయాలు (జైపూర్ వంటివి), మ్యూజియంలు (పూణే), కూరగాయల మార్కెట్లు (పూణే, ముంబై) ఆయన పేరు పెట్టబడ్డాయి. ఆయన ఆశయ సాధన కోసం ఇప్పటికీ అనేక ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి.
This article was first published in 2021