ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిందూత్వంపై ద్వేషాన్నివెల్లగక్కుతూ, సోషల్ మీడియాలో హిందుత్వాన్ని కించపరిచేలా పోస్టులు చేస్తున్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుడిపై చర్యలు తీసుకోవాలని బ్రిటన్‌లోని హిందూ సంస్థలు, సంఘాల ప్రతినిధిలు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను కోరారు. ఈ మేరకు హిందూ కౌన్సిల్ ఆఫ్ యుకె, హిందూ ఫోరం ఆఫ్ యూరప్, అక్షయ్ పాత్ర ఫౌండేషన్ (యుకె), గ్లోబల్ కాశ్మీరీ పండిట్ డయాస్పోరా (యుకె), శ్రీ స్వామినారాయణ టెంపుల్ కార్డిఫ్ వంటి అనేక ఆలయ ట్రస్టులలో భారత సంతతికి చెందిన 119 మంది కలిసి బ్రిటన్ ప్రధానికి లేఖ రాశారు.
ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయ మహిళ రష్మి సమంత్ సోషల్ మీడియాలో వేధింపుల కారణంగా ఆమె తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని వారు లేఖలో పేర్కొన్నారు. హిందూ మతానికి చెందిన రష్మి సమంత్‌ను సోషల్ మీడియాలో కించపరిచేలా పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురి చేశారని, దానికి యూనివర్సిటీ ప్రోఫెసర్ అభిషిత్ సర్కార్ మద్దతు తెలపడమే కాకుండా తాను కూడా స్వయంగా హిందూ మతానికి వ్యతిరేకంగా పోస్టులు చేశాడని పేర్కొన్నారు. హిందూ మతాన్ని విశ్వసిస్తున్న రష్మీ సమంత్ తల్లిదండ్రులను కూడా కించపరుస్తూ పోస్టులు చేశాడని వారు పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో వేదింపుల కారణంగా ఆమె తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి అజ్ఞాతంలోకి వెళ్లి చివరకు దేశం విడిచి వెళ్లే పరిస్థితులకు దారి తీసిందని దీనికంతటికీ అభిజిత్ సర్కార్ కారణమని వారు పేర్కొన్నారు.
అభిజీత్ సర్కార్ సోషల్ మీడియాలో చేసే పోస్టులు గమనిస్తే అతను మహిళల పట్ల లింగ వివక్ష చూపిస్తూ, లైంగిక పరమైన వ్యాఖ్యలు చేస్తూ, జాత్యహంకార, మూర్ఖపు అభిప్రాయాలను ప్రతిబింబిస్తాయని వారు తమ లేఖలో పేర్కొన్నారు.
ఈ విషయంపై భారత పార్లమెంట్ లో విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించినప్పటికీ, వందలాది ఇ-మెయిళ్ళు, ఆన్‌లైన్ పిటిషన్‌పై సుమారు 50వేల సంతకాలు, దాదాపు 100పైగా వివిధ దేశాల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పటికీ యూనివర్సిటీ అధ్యాపకుడిపై చర్యలు తీసుకోకపోవడం పట్ల యూనివర్సిటీ పట్ల, స్థానిక థేమ్స్ వ్యాలీ పోలీసుల పట్ల ఆయా సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అభిజీత్ సర్కార్ ను తక్షణమే సస్పెండ్ చేసి, సమగ్ర దర్యాప్తు తర్వాత అతన్ని పూర్తిగా యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అటువంటి వికృత మనస్తత్వం కలిగి ఉన్న వాడు అధ్యాపకుడిగా ఉండటానికి అర్హత లేదని, హిందూ విద్యార్థులు, మరీ ముఖ్యంగా మహిళలు ఆయన సమక్షంలో సురక్షితంగా ఉండలేరని లేఖలో పేర్కొన్నారు.
గతంలో బ్రిటన్‌లోని బాట్లీ గ్రామర్ స్కూల్లో మహ్మద్ ప్రవక్త కర్టూన్ ను విద్యార్థులకు చూయించినందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన ఘటనను లేఖలో వారు గుర్తు చేశారు.
యూనివర్సిటీలో జరుగుతున్న జాత్యంహకార దాడులపై ప్రపంచమంతా దృష్టి సారించిందని, ఇలాంటి సంఘటలు భారతీయ విద్యార్థులపై ప్రభావాన్ని చూపుతాయని, ఇప్పటికైనా అధ్యాపకుడిపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Source : VSK BHARATH