Home News నిత్య ప్రేరణా జ్యోతి స్వర్గీయ పులుసు గోపి రెడ్డి

నిత్య ప్రేరణా జ్యోతి స్వర్గీయ పులుసు గోపి రెడ్డి

0
SHARE

ప్రముఖ రచయిత, మేథావి, సీనియర్ ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త స్వర్గీయ పులుసు గోపిరెడ్డి నిత్య సాధకుడని, నిరంతర పరిశ్రమ, ప్రతిభ ద్వారా తాను సాధించిన శక్తిని సంపూర్ణంగా సంఘ కార్యానికి సమర్పించిన నిత్య ప్రేరకుడని స్వర్గీయ పులుసు గోపిరెడ్డి సంస్మరణ సభలో వక్తలు కొనియాడారు.

ఏప్రిల్ 1న పరమపదించిన శ్రీ పులుసు గోపిరెడ్డి సంస్మరణ సభ విజయవాడలోని హైందవి భవనంలో ఈ శ‌నివారం జరిగింది. ఈ సంద‌ర్భంగా ఆర్‌.ఎస్‌.ఎస్ విభాగ్ కార్యవాహ శ్రీ రామారావు మాట్లాడుతూ శ్రీ పులుసు గోపిరెడ్డి అనేకమంది కార్యకర్తల్ని తీర్చిదిద్దారని తెలిపారు. సీనియర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త శ్రీ శ్రీనివాస రాజు మాట్లాడుతూ 1960 ప్రాంతాలలో సంఘానికి పెద్ద అనుకూల పరిస్థితులు లేని సమయంలో కూడా శ్రీ పులుసు గోపిరెడ్డి సంఘ కార్యాన్ని నడిపించారని తెలిపారు. వరంగల్ లో ఉన్నత ఉద్యోగంలో ఉండి కూడా సంఘ పెద్దల సూచన మేరకు ఆ ఉద్యోగాన్ని వదులుకొని విజయవాడకు వచ్చి శ్రీ శారదా కాలేజ్, ఎస్ ఏ ఎస్ కాలేజ్ లలో ప్రిన్సిపాల్ గా పనిచేసి ఆ సంస్థల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. స్వర్గీయ పులుసు గోపిరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, జాగృతి వార పత్రిక ఎడిటోరియల్ బోర్డు సభ్యునిగా ఉంటూ జాగృతిలో ‘మనలో మాట’ పేరుతో శీర్షికను నడిపారని, వారు పదవీ విరమణ అనంతరం వనవాసీ కళ్యాణాశ్రమ్ పని కోసం ఛత్తీస్‌గ‌డ్ అడవులలో పనిచేశారని తెలిపారు. ‘సమాలోచన’ పేరుతో ఒక మేథావుల వేదికను ఏర్పాటు చేశారని దానిద్వారా జాతీయవాద రచయితలను, వక్తలను, మేథావులను ఒక వేదిక మీదకు తీసుకువచ్చి క్రమం తప్పకుండా కార్యక్రమాలు నిర్వహింపజేశారని, సంఘ పరివార సంస్థలకు వారు అనేక విధాలుగా మార్గదర్శనం చేశారని తెలిపారు.

అనంతరం నవయుగ భారతి ప్రచురణ సంస్థ నిర్వాహకులు డాక్టర్ వడ్డి విజయసారధి మాట్లాడుతూ తాను ‘జాగృతి’ వార పత్రిక పని చూస్తున్న‌ప్పుడు దాని ఎడిటోరియల్ బోర్డు సభ్యునిగా శ్రీ పులుసు గోపి రెడ్డి గారు ఇచ్చిన మార్గదర్శనం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. అప్పటి ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ప్రచారక్ శ్రీ బాపూరావు మోఘే గారి సూచన మేరకు వారు ఉన్నత ఉద్యోగాన్ని వదులుకొని విద్యా రంగంలో కృషి చేయడం కోసం విజయవాడకు కుటుంబ సమేతంగా వచ్చేశారని, వారి శిక్షణలో తయారైన విద్యార్థులెందరో నేడు ఐఏఎస్, ఐపీఎస్ లుగా ఉన్నారని తెలిపారు. ఆయన విజయవాడకు వచ్చిన రోజులలో విజయవాడలో బలంగా పని చేస్తూ ఉండిన వామపక్ష విద్యార్థి సంస్థలు, కొన్ని కుల విద్యార్థి సంఘాల ఆగడాలను ఆయన సమర్థంగా ఎదుర్కొని కట్టడి చేయగలిగారని శ్రీ సారథి తెలియజేశారు.

విద్యా భారతి ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి శ్రీ కావూరి ఓంకార నరసింహం మాట్లాడుతూ గోపి రెడ్డి గారిని అందరూ ఆప్యాయంగా ‘మాస్టారూ’ అని పిలుచుకునే వారని, మాస్టారూ అన్న పదానికి శ్రీ గోపిరెడ్డి నూటికి నూరు శాతం న్యాయం చేశారని పేర్కొన్నారు. వారు ఆంగ్ల భాష అధ్యాపకులు అయినప్పటికీ తెలుగులో కూడా గొప్ప పట్టు ఉండేదని, ఆయన అనేక గ్రంథాలను అధ్యయనం చేశారని, విశ్వనాథవారి ‘వేయి పడగలు’ వంటి పుస్తకాలపై అద్భుతమైన విశ్లేషణ చేసేవారని తెలిపారు. వారు వ్రాసిన గ్రంధాలు, వ్యాసాలు, కథలు కార్యకర్తలకు ఎప్పటికీ ప్రేరణను అందిస్తూనే ఉంటాయన్నారు.

అనంతరం పూర్వ ఏబీవీపీ రాష్ట్ర సంఘటనా మంత్రి, ప్రస్తుత ఎస్.ఎస్.ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ త్రినాథ్ మాట్లాడుతూ గోపి రెడ్డి గారి ద్వారా తనకు, తన వంటి కార్యకర్తలకెందరికో సంఘటనా కార్యశైలి అర్థమైందని తెలిపారు. వారి అవసాన దశలో వారిని కలిసినప్పుడు కూడా వారు 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణ ఆరంభ కార్యక్రమాలపై హర్షాన్ని వ్యక్తం చేస్తూ “ఇక మిగిలింది కామన్ సివిల్ కోడ్ ఏర్పాటే….. అది కూడా పూర్తయితే బాగుండు” అనే అభిలాషను వ్యక్తం చేశారని తెలిపారు. ఆయన కణకణంలో సంఘ కార్యం ఇమిడిపోయి ఉన్నట్లుగా తాను అర్థం చేసుకున్నానని అన్నారు.

స్వర్గీయ పులుసు గోపి రెడ్డి గారి పెద్ద కుమారుడు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ “మేము ఆయన కుమారులమే అయినప్పటికీ ఆయన ఏనాడూ మమ్మల్ని సంఘ కార్యంలోకి రావాలని బలవంతం చేయలేదు. ఇతర కార్యకర్తల సాహచర్యం ద్వారానే మేము సంఘానికి దగ్గరయ్యేలా చూశారు.” అని తెలిపారు. ఆయనకు విజయవాడ అంటే ప్రాణమని అందుకే ఎక్కడెక్కడ తిరిగినా ఆయన తిరిగి విజయవాడకే రావాలని కోరుకునే వారని తెలిపారు.

చివరిగా ఈ కార్యక్రమంలో ముఖ్య వక్త, ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత కార్యకారిణి సభ్యులు శ్రీ భాగయ్యగారు ఆన్ లైన్ ద్వారా మాట్లాడుతూ పాత తరం కార్యకర్త, పెద్ద దిక్కు అయిన శ్రీ గోపి రెడ్డి లేని లోటు తీర్చలేనిదని తెలిపారు. ఒక స్వయంసేవక్ ఎలా జీవించాలో స్వ‌యంగా చూపిన కార్యకర్త శ్రీ గోపి రెడ్డి అని శ్రీ భాగయ్య పేర్కొన్నారు. శ్రీ గోపి రెడ్డి గారు సుమారు రెండు సంవత్సరాల పాటు వారు మంచంలోనే ఉన్నా వారి మనసు విచలితం కాలేదని, వారి దేహానికి మాత్రమే మరణం సంభవించిందని, వారి రచనల రూపంలో వారి ఆత్మ మనతోనే ఉన్నదని తెలిపారు. వారు ఆజన్మాంతం సంఘానుకూలంగా జీవించారని, సంఘంలో సహజంగా వచ్చే యుగానుకూల మార్పులను స్వాగతించారని, కార్యకర్తలలో నిరాశ, నిస్పృహలు అలముకున్న అనేక సందర్భాలలో శ్రీ గోపి రెడ్డి కార్యకర్తలలో చైతన్యాన్ని నింపారని, నాగాయలంకలో ఆసుపత్రి నిర్మాణంలో శ్రీ గోపి రెడ్డి పాత్ర విస్మరించలేనిదని వారు పేర్కొన్నారు.

శ్రీ గోపి రెడ్డి ఏనాడూ వ్యక్తిగత ప్రతిష్ఠకై ప్రాకులాడలేదని, తాను స్వయంగా ఎన్ని సంస్థలు ప్రారంభించినా వాటిలో ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం ఏనాడూ చేయలేదని, తన కఠోర పరిశ్రమ, ప్రతిభ ద్వారా వికసింపజేసుకున్న శక్తిని, సామర్థ్యాన్ని పూర్తిగా సంఘానికి సమర్పించిన ఆదర్శమూర్తి శ్రీ పులుసు గోపిరెడ్డి అని శ్రీ భాగయ్య కొనియాడారు. శ్రీ గోపి రెడ్డి గారు మంచంలో ఉన్న సమయంలో వారికి అద్వితీయమైన రీతిలో సేవలందించిన వారి కుటుంబ సభ్యులను కూడా శ్రీ భాగయ్య అభినందించారు. “భారతీయ కుటుంబాల ఔన్నత్యానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ” అని శ్రీ భాగయ్య పేర్కొన్నారు. కుటుంబ నిర్వహణలోనూ, సంఘ కార్య సాధనలోనూ, ఉద్యోగ నిర్వహణలోనూ అద్భుతమైన ప్రతిభను, సమన్వయాన్ని సాధించిన శ్రీ గోపి రెడ్డి సంఘ కార్యకర్తలకందరికీ నిత్య ప్రేరణా జ్యోతి అని శ్రీ భాగయ్య పేర్కొన్నారు.

VSK ఆంధ్ర సౌజ‌న్యంతో…