పాజిటివిటీ అన్ లిమిటెడ్ కార్యక్రమంలో ఈ రోజు ప్రముఖ వ్యాపారవేత్త, విప్రో కంపెనీ అధినేత శ్రీ అజీమ్ ప్రేమ్ జీ మాట్లాడారు. వారి ఉపన్యాసానికి తెలుగు స్వేచ్చనువాదం –
ఎన్నడూలేని, ఎవరు ఊహించని ఈ సంక్షోభంలో తమ స్నేహితులు, కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి సానుభూతిని తెలుపుతూ నేను చెప్పదలుచుకున్నది ప్రారంభిస్తున్నాను. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనడానికి మనందరికీ తగిన ఆత్మస్థైర్యం, ధైర్యం ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఈ కష్టకాలం ఇంకా పూర్తికాలేదు. ఈ సందర్భంగా నేను మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, అన్నీ పార్శ్వాల్లోనూ మనం అత్యంత వేగంగా, జాగరూకతతో వ్యవహరించాలి. అందుకు సరైన శాస్త్రపరిజ్ఞానాన్ని మనం ఆధారం చేసుకోవాలి. అటువంటి సరైన ఆధారం లేకపోతే మన కార్యం దెబ్బతింటుంది. సత్యాన్ని అంగీకరించడమే సరైన శాస్త్ర పరిజ్ఞానానికి మూలం. కనుక ప్రస్తుతపు సంక్షోభం గురించి మనం యదార్ధాలను గుర్తించాలి, అంగీకరించాలి. సత్యం, శాస్త్రపరిజ్ఞానం ఆధారంగా మనం ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి. అది మళ్ళీ ఏర్పడకుండా చూసుకోవాలి.
రెండవ విషయం, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో దేశమంతా ఒకటిగా నిలవాలి. మన మధ్య ఉన్న భేదాభిప్రాయాలను పక్కనపెట్టాలి. ఏకత్వభావనే ప్రస్తుత అవసరమని గుర్తించాలి. ఐకమత్యమే బలమని, విడిపోతే పడిపోతామని తెలుసుకోవాలి.
మూడవ విషయం, అత్యంత బలహీనులు, పేదలను ముందు పట్టించుకోవాలి. ఈ మహమ్మారి మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజానీకం మరింత ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. అందుకని మనం ముందు వారిపై దృష్టి సారించాలి. అంతేకాదు ఈ సంక్షోభం నుంచి బయటపడిన తరువాత ఈ అసమానతలు, అన్యాయాన్ని అంతం చేసేవిధంగా సామాజిక, ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్దుకోవాలి.
చివరగా, ఈ విపత్కర పరిస్థితి నుండి బయటపడటానికి మనమంతా కలిసికట్టుగా మనమన కర్తవ్యాన్ని నెరవేర్చాలని కోరుతున్నాను. మీరంతా సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
విజ్ఞప్తి : మా కంటెంట్ ఉపయోగకరంగా ఉందని భావించి ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ధికంగా సహకరించదలచిన దాతలు ఈ కింది లింక్ ద్వారా మీ విరాళాలను అందించవచ్చు. మీరు ఇచ్చే విరాళం ఎంతైనప్పటికీ మీ సహకారం మాకు విలువైనది, DONATE HERE