Home News సేవాభారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు

సేవాభారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు

0
SHARE

కోవిడ్ రెండో ద‌శ‌లో ఆర్‌.ఎస్‌.ఎస్ – సేవా భార‌తీ అనేక సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది.
కరోనా మహమ్మరి వేళ నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్‌ సేవలు ప్రారంభమయ్యాయి.  సేవా భార‌తీ చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల దృష్ట్యా “చ‌ల‌సాని మాల‌తీ మెమోరియ‌ల్ ట్ర‌స్టు” వారు సేవాభార‌తీ తెలంగాణ వారికి రెండు అంబులెన్సుల‌ను అంద‌జేశారు. శుక్ర‌వారం భాగ్య‌న‌గ‌రం, భ‌ర్క‌త్‌పూర‌లోని ఆర్‌.ఎస్‌.ఎస్ ప్రాంత కార్యా‌లయంలో రెండు వాహ‌నాల‌ను ప్రారంభించారు. ఉచిత అంబులెన్స్ సేవల కోసం 040-48213100 నంబర్‌ను సంప్ర‌దించాల‌ని నిర్వ‌హ‌కులు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో సేవా భార‌తి తెలంగాణ అధ్య‌క్షులు దుర్గారెడ్డి గారు, రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాంమూర్తి గారు, చలసాని మాలతి స్మారక సమితి మేనేజింగ్ ట్రస్టీ చలసాని బలరామ్ ప్రసాద్, అఖిల భార‌త స‌హా ధ‌ర్మ‌జాగ‌ర‌ణ ప్ర‌ముఖ్ శ్రీ శ్యాం జీ, క్షేత్ర సేవా ప్ర‌ముఖ్ శ్రీ ఎక్కా చంద్ర‌శేఖ‌ర్ గారు, ఆర్‌.ఎస్‌.ఎస్‌. తెలంగాణ ప్రాంత ప్ర‌చార‌క్ శ్రీ దేవెంద‌ర్ గారు, స‌హా ప్రాంత ప్ర‌చార‌క్ శ్రీ శ్రీ‌ధ‌ర్ గారు త‌దిత‌రులు పాల్గొన్నారు.


ఐసోలేష‌న్ కేంద్రాలు

సేవా భారతి ఆధ్వ‌ర్యంలో గ‌త ఏప్రిల్ 29న హైదరాబాద్ నగర శివార్లలోని అన్నోజిగూడలో ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్ ప్రారంభ‌మైంది. 200 పడకల ఈ కేంద్రంలో పెద్ద సంఖ్యలో డాక్టర్లు, ఆరోగ్య సిబ్బంది, యోగా సిబ్బంది కోవిడ్ పేషంట్లకు సేవలందిస్తున్నారు. ఈ కేంద్రంలో ఇప్పటికే వందలాది మంది చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కోవిడ్ స్వల్ప లక్షణాలు కలిగి ఉండి అన్నోజిగూడ ఉచిత కోవిడ్ ఐసొలేషన్ సెంటర్‌లో అడ్మిట్ కావాలనుకునేవారు ముందుగా 040-48212529 నెంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు సూచిస్తున్నారు. అంతేకాదు కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా తీర్చేందుకు సలహా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సలహా కేంద్రంలో వైద్యులు ఆన్‌లైన్ ద్వారా సలహాలందిస్తారు. ప్రతిరోజూ వేలాది మంది ఫోన్ చేసి తమ సందేహాలు తీర్చుకుంటున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి పదిలోగా 040-48213100 నెంబర్‌కు ఫోన్ చేసి కోవిడ్ చికిత్సపై వైద్యుల సలహాలు తీసుకోవచ్చుని సేవా భారతి ప్రతినిధులు తెలిపారు.

అటు వరంగల్ అర్బన్ జిల్లాలోని హంటర్ రోడ్‌లోని శ్రీవ్యాస ఆవాసంలో సేవా భారతి, యూత్ ఫర్ సేవా సంయుక్తంగా నగరానికి చెందిన ‘వర్చుస’ సంస్థ సహకారంతో 30 పడకల ఉచిత ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రెండు ఎకరాల ఆహ్లాదకరమైన వాతావరణంలో, 24 గంటలు పనిచేసే జనరేటర్, ఎయిర్ కూలర్లతో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

ఇక్కడ ఉచిత వసతి, పౌష్టికాహార భోజనంతో పాటు మందులు అందజేస్తున్నారు. ఈ కేంద్రంలో డాక్టర్ల పర్యవేక్షణ, అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. కరోనా బారిన పడిన పేద కుటుంబాల వారు, చిన్న గదులలో అద్దెకుంటూ ఇబ్బంది పడుతున్న స్వల్ప లక్షణాలు కలిగిన 60 సంవత్సరాల లోపు కోవిడ్ పేషెంట్లు 7207416163 మొబైల్ నెంబర్‌కి ఫోన్ చేసి ఈ కేంద్రంలో చేరవచ్చని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు.