– చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి
ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనే పేరుతో ప్రతీ సంవత్సరం జూన్ 5న ఐక్యరాజ్యసమితి ఒక కార్యక్రమాన్నిజరుపుతుంది. ఈ సంవత్సరం దీనిని “పర్యావరణవ్యవస్థ పునరుద్ధరణ “( Ecosystem Restoration) అన్ననినాదంతో జరుపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ నేపధ్యంలో గ్లోబల్ వార్మింగ్ పెరగటంవల్ల అనేక సమస్యలు కలుగుతున్నాయి.`అభివృద్ది చెందాము’ అని చెప్పుకునే దేశాలు తమ విధానాలవల్ల జరుగుతున్న నష్టాన్ని పట్టించుకోకుండా మాత్రం ప్రపంచానికి సుద్దులు చెపుతుంటాయి. అవి చేసే పర్యావరణ నష్టాన్ని , ఇతర దేశాల భుజాలపైకి తోసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదంతా ఒక పార్శ్వం అయితే, దేశాల అనాలోచిత నిర్ణయాల వల్ల కూడా ఈ సమస్య ఉత్పాతంగా మారే ప్రమాదం ఏర్పడుతోంది. నిజమే ప్రపంచం ఇప్పుడు సరిదిద్దుకోకపోతే తరువాత సరిదిద్దుకుందామనుకున్నా కుదరనంత చిక్కుల్లోకి పోయే పరిస్థితి ఏర్పడింది . ఇటువంటి విషమ పరిస్థితుల్లో “విశ్వగురువు“ భారతదేశమే ప్రపంచానికి దారి చూపగలదు.
పర్యావరణ పరిరక్షణ లో రెండు ప్రధాన సమస్యలు మనకు కనపడతాయి. ఒకటి ప్రభుత్వ కార్యక్రమాలు, వాటి నిర్వహణ. రెండోది ప్రజల భాగస్వామ్యం. జపాన్, సింగాపుర్ వంటి దేశాలలో పరిశుభ్రత చాలా కచ్చితంగా పాటిస్తారని చెప్పుకుంటూ ఉంటాం. మరి మన దేశం గురించి వేరే దేశస్థులు ఏమి ఆలోచిస్తారో మనం కూడా చూసుకోవాలి కదా. మొదట మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఏమి చెపుతోందో తెలుసుకుని, మన వంతుగా ఏమి చేయాలో ఆలోచించాలి .
ప్రభుత్వం ఏమి చేస్తోంది
2014 లో ప్రధాని మోదీ శౌచాలయపు ప్రాధాన్యతను ఏకంగా ఎర్రకోట పై నుంచే చెప్పారు. ఆ తరువాత దేశవ్యాప్తంగా ఉద్యమస్థాయిలో శౌచలయాల నిర్మాణం జరిగింది. 2019 లో తిరిగి ప్రధాని పీఠం ఎక్కిన తరువాత మొదలు పెట్టిన కార్యక్రమాలలో ‘ స్వచ్చ భారత్ అభియాన్ ‘ మొదటిది . అక్టోబర్ 2 న గాంధీ జయంతి ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతూ పర్యావరణ పరిరక్షణలో మొదటి మెట్టు స్వచ్చమైన పరిసరాలు అంటూ తానే స్వయంగా చీపురు అందుకొని మొదలు పెట్టారు. ఈ స్వచ్చ భారత్ అభియాన్ ఒక ఉద్యమంగా మొదలై 2019 నాటికి బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన పూర్తిగా అరికట్టాలని లక్ష్యం తో పని చేసి దాదాపు 94 % లక్ష్యం 2019 లో మిగిలిన 6% తరువాతి కాలం లో సాధించ కలిగారు . ( ఈ వెబ్ సైటు చూడవచ్చు https://swachhbharat.mygov.in/ ). అదే విధంగా ‘ నమామి గాంగే‘ అన్న నినాదంతో గంగానది పరీవాహక ప్రాంతాలలో వ్యర్ధాల నిర్వహణ, కాలుష్య నివారణ, శుద్దీకరం వంటి అనేక కార్యక్రమాలను మొదలుపెట్టారు. అలాగే campa act ద్వారా అటవీ భూమిని ఎంత వాడుతాము అంత తిరిగి మళ్ళా అడవిని తయారు చేయటానికి అవసరమైన నిధులను తప్పని సరిగా సిద్దం చేసే చట్టాన్ని రూపొందించారు. దాదాపు 95 వేళ కోట్ల నిధి సిద్దం చేశారు. పర్యావరణ రక్షణ ఒక నినాదం గా మిగిలి పోకుండా అది ఒక విధానంగా మారేందుకు అవసరమైన నిపుణతలను పెంచేందుకు ‘Green Skill Development Program‘ ను skill ఇండియా లో ఒక భాగంగా చేశారు. ఇది ఒక మంచి కార్యక్రమం ( ఈ వెబ్ సైటు ను చూడండి http://www.gsdp-envis.gov.in/). ప్రభుత్వం ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగానే కర్బన ఉద్గారాలను(carbon emissions) తగ్గించే ఉద్దేశ్యం తోనే దాదాపు పునరుత్పాదక వనరులు (renewable energy sources) అయిన సౌర శక్తి, వాయు శక్తి వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఎలెక్ట్రిక్ వాహనాలు, `భారత్ 6’ నిబంధనలకు అనుగుణమైన వాహనాల తయారీ వంటి చర్యలు చెప్పట్టింది. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిరోధించేవిధంగా గట్టి అడుగులే పడుతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతుంటే మరి ప్రజల భాగస్వామ్యం ఏమిటీ??
ప్రజల భాగస్వామ్యం
పర్యావరణ స్పృహ భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన అంశం. మనం జరుపుకొనే ప్రతీ పండుగలో ఏదో ఒక ప్రకృతి సంబందంమైన అంశాలు ఉండటం మనం గమనించవచ్చును. అసలు మన మొదటి పండుగ యుగాది అంటేనే ప్రకృతి క్రొత్తచివురులుతొడగటం. ఆయా ఋతువులో ఏర్పడే ఆయా మార్పులను అర్ధంచేసుకొని పండుగలు జరుపుకోవడం మనకు తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఏమి జరుగుతోంది ? తడి చెత్త , పొడి చెత్త వేరు చేసి ఇవ్వమని ఉచితంగా పచ్చని రంగు , నీలి రంగు డబ్బాలులు ఇస్తే , హైదరాబాద్ నగరంలో కేవలం 25% మాత్రమే వాటిని వాడుతున్నారని తెలుస్తోంది. 5000 టన్నుల చెత్తను తడి, పొడి విభజన చేయడం అసాధ్యమని, దాని వల్ల ఎంతో కాలుష్యం కలుగుతోందని ఒక మునిసిపల్ అధికారి వెల్లడించారు. నిజానికి అది ఇళ్ళలో వారికి చాలా చిన్న పని. ఇంటిలో చెత్తని తడి, పొడిగా విభజించి పారిశుద్ధ్య విభాగానికి ఇస్తే చాలు. ఇంత సులభమైన పని కూడా మనం చేయలేమా ?
భారతీయులు తమ మూల విధానాలకు విలువ ఇస్తూ, ప్రకృతి తో మమేకమయ్యే అవసరం ఇప్పుడు చాలా కనిపిస్తోంది. మనం వ్యక్తిగత పరిశుభ్రతతో మొదలుపెట్టి, ఇల్లు, వీధి, గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం… ఇలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళితే మన జీవిత కాలం లో ఏదో ఒక చిన్న సకారాత్మక మార్పునైనా చూడగలుగుతాము. పారిశ్రామిక కాలుష్య నివారణ, waste management మొదలైనవి ప్రభుత్వపు పనులేనని భావించకుండా మనం చేయాల్సిన పని మనం చేద్దాం .
మన దైనందిన అంశాలలో మొట్ట మొదటగా ప్రారంభించాల్సిన విషయం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం మీ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం. ఇంట్లోని చెత్తను తడి చెత్త , పొడి చెత్తగా తప్పనిసరిగా విభజించడం. ప్లాస్టిక్ వినియోగాన్ని బాగా తగ్గించడం. ప్రకృతి అందించే సౌరశక్తి, వాయు శక్తిని ఎక్కువ వినియోగంలోనికి తెచ్చుకోవడం. వీలైనంత వరకు సేంద్రీయ విధానం వైపుకు మారటం. జ్యూట్ , కొబ్బరి , గుడ్డ ల తో తయారు కాబడ్డ సంచీలు , తాళ్ళు , ప్రకటన వస్తువుల ఉపయోగాన్ని పెంచటం. తమ తమ పరిధి మేర ఎంతో కొంత స్వచ్చ భారత్ అభియాన్ వంటి కార్యక్రమాలలో పాలు పంచుకోవటం.
ఇలా అనేక చిన్న చిన్న విషయాలతో మొదలు పెట్టి దేశం కోసం స్వంత లాభం కొంత మానుకుని , మన భావి తరాలకి మంచి పర్యావరణాని అందించడం కోసం మన వంతు ప్రయత్నం చేయకపోతే ముందు ముందు ఎన్ని ఉత్పాతాలను చూడాలో ఈ రెండు సంవత్సరాలలో బాగా అర్ధమయింది.