Home Telugu Articles జాతీయవాది బంకించంద్ర

జాతీయవాది బంకించంద్ర

0
SHARE

– చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి

“వందేమాతరం“ అని జాతియావత్తు నినదించింది. ఒక జాతి ఆస్తిత్వాన్ని నిలబెట్టిన పాట అది. అవి ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం తరువాత రోజులు. పెనం నుంచి పొయ్యిలోకి , అరాచక ముస్లిం పాలన నుంచి, దోపిడీ దొంగ బ్రిటిష్ పాలనలోకి మారుతున్న సమయం. భారతీయ సమాజాన్ని కువిమర్శకు గురిచేసి, సామాన్య భారతీయుడికి ఆత్మన్యూనత కలిగించడం లక్ష్యంగా విదేశీ చదువులు మొదలైన కాలం. భారతీయ యువత తన మూలాలను వెతుక్కుంటున్న కాలం. అప్పటికే ఉర్రూతలూగించే నవలలు వ్రాసిన ఒక విద్యాధికుడు   ‘బంకించంద్ర ఛటోపాధ్యాయ‘ భారతీయ సనాతన ధర్మానికి , భారతీయ  అస్తిత్వానికి  ప్రతీకగా నిలచి, దేశభక్తుల నరనరాన శక్తిని చైతన్యపరిచిన వందేమాతర గీతాన్ని అందించారు. ఒక ప్రతీకారాత్మక (symbolic) భావగీతంలో కూడా మతాన్ని చూసే మూడుల మూర్ఖత్వాన్ని తట్టుకుని , ‘సెక్యులర్’ నాయకుల అధికార ధాష్టీకాన్ని  తట్టుకుని ఆ పాట శతాధిక సంవత్సరాల నిలచిఉందంటే ఆశ్చర్యం కలుగక మానదు. అయితే ఇప్పటి కుహనా మేధావులు, దేశద్రోహులు  కొందరు ఈ  దార్శనికుని జీవితాన్ని, రచనలను  తక్కువచేసి మాట్లాడటం గమనిస్తే మనకు బంకించంద్ర ఛటోపాధ్యాయ గొప్పతనం తేటతెల్లం అవుతుంది .

ఆయన రచయిత గా సాధించిన ఘనతలు అనేకం . బంకించంద్ర యువకునిగా ఉన్నప్పుడు  కొన్ని రచనలు  సంబాద్ ప్రభాకర్ అనే వార్తాపత్రికలో  ప్రచురితమయ్యాయి.1858లో `లలిత మానస్ అనే పేరుతో కవితా సంపుటిని ప్రచురించారు. కొంతకాలం పాటు ఆంగ్లంలో రచనలు చేశారు. ఆయన  నవల `రాజ్ మోహన్ భార్య 1864లో ఇండియన్ ఫీల్డ్ లో సీరియల్ గా వచ్చింది. ఆంగ్ల నవలను వ్రాసిన మొట్టమొదటి భారతీయుడు కూడా ఆయనే.  తరువాత కాలం లో ఆయన తన రచనలన్నీ బెంగాలీలోనే చేశారు. మొదట గుర్తించదగిన బెంగాలీ రచన  ‘దుర్గా నందిని’ నవల.  ఇందులో రాజ్ పుత్ కధనాయకుడు, బెంగాలీ కథానాయకి ఉన్నారు. ఈ రచనా శైలి సాదాసీదాగా కనిపించినా, బెంగాలీల హృదయాన్ని ఒక తుఫానులా తాకింది అని రవీంద్రనాథ్ ఠాగోర్ అన్నారు . ఈ రచనలతోనే బెంగాలీ నవల పుట్టుక ప్రారంభమైంది అంటారు . తాంత్రిక క్రియల నేపధ్యంతో ప్రేమకావ్యం `కపాలకుండల’ 1866లో ప్రచురితమైంది;  1869లో బెంగాల్ పై మొదటి ముస్లిం దండయాత్ర నేపధ్యం లో `మృణాళిని నవల ప్రచురితమైంది.  . 

`బంగదర్శన్ పేరుతో వార్తాపత్రికను 1872 లో బంకించంద్ర  మొదలు పెట్టారు, ఈ పత్రిక బెంగాల్ సాహిత్య చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం . పత్రిక సంచికల కోసం  ప్రజలు ఎలా ఎదురు చూసేవారో రబీంద్రనాథ్ ఠాగోర్ ఒక సందర్భం లో వివరించారు , ‘ప్రతీ మాసం కొత్త సంచిక కోసం ఎదురుచూడటం  ఒక ఎత్తు , పత్రిక ఇంటికి వచ్చిన తరువాత పెద్దలందరూ చదివిన తరువాతగాని నా చేతికి వచ్చేది కాదు ఎంత ఊరించేదో.‘1905లో ఈ పత్రికను రబీంద్రనాథ్ ఠాగోర్ పునః ప్రారంభించారు (బంకించంద్ర మరణానంతరం). తన పత్రిక ప్రారంభించిన తరువాత బంకించంద్ర రచనలు అన్నీ అందులోనే ప్రచురితమయ్యాయి. `బిషవృక్ష’ (1872)అనే నవల వితంతు పునర్వివాహ సమస్యను చర్చిస్తుంది.`ఇందిర1873 లో ప్రచురితమైంది. 1874లో `యుగభాషియ; 1875లో `రాధారాణి’,`చంద్రశేఖర ; 1877లో `రజనీ ప్రచురితమయ్యాయి. 1878 లో వెలువడిన నవల `కృష్ణకాంటర్ ఉయిల్, తన గొప్ప రచనగా బంకించంద్ర పేర్కొన్నారు.1881లో రచించిన ‘రాజసింహ‘నవల రాజపుత్ర వీరత్వం, మొగలాయి అణచివేత ధోరణిని కళ్ళకు కట్టిస్తుంది.

పై రచనలన్నీ ఒక ఎత్తు 1882 లో రచించిన ‘ ఆనందమఠ్ ‘ ఒక్కటి మరొక ఎత్తు. ఐహిక విషయాలతో సంబంధం లేని యువ హిందూ సన్యాసుల దండు ఆక్రమణదారుల పై చేసిన యుద్దం , విజయం అన్న కధతో అత్యంత ప్రజాదరణ పొందిన నవల , దేశభక్తి కథ. దాదాపు 125 సంవత్సరాలు గడిచిన తరువాత ఈ రోజుల్లో కూడా దిశానిర్దేశం చేయగల అత్యంత రోమాంచిత కధ .‘వందేమాతరం’ ఈ నవలలోని ఒక పాత్ర పాడిన గీతం.ఈ పుస్తకం ఎంత సంచలనం సృష్టించిందంటే బ్రిటిష్ ప్రభుత్వం నిషేదించాల్సివచ్చింది. అప్పటివరకు అస్తిత్వాన్ని వెతుకుంటున్న భారతీయ యువతకు ఒక అద్భుతమైన ఆయుధం, పాశ్చాత్య వెక్కిరింపులకు సమాధానం ఈ నవల. అప్పటిదాకా హిందూ సమాజం మీద ఉన్న చిన్నచూపును తుత్తునియలు చేసిన నవల అది .

ఈ నవల విడుదల తరువాత అప్పటి (ఇప్పటి కూడా) కుహనా మేధావులు బంకించంద్ర రచనలను తీవ్రంగా విమర్శించడం మొదలు పెట్టారు. ప్రశాంతమైన హిందూ సమాజంలో హింసను ప్రేరేపిస్తున్నారని,  ముస్లింల పట్ల వ్యతిరేకత కలిగించారని ఆరోపించారు. పైగా ఆయన తన రచనలలో ఎక్కువగా  ముస్లింలను ప్రతినాయకులుగా చూపించారని విమర్శించారు. ఎంతో సామరస్యంగా, సఖ్యంగా ఉన్న హిందూ – ముస్లిం లను విడగొట్టాలని చూస్తున్నారని ( చూశారని ) బాధపడిపోయారు. ఇంకా దారుణమైన విమర్శ ఏమిటీ అంటే ఈ పుస్తకం వల్లే బెంగాల్ విభజన జరిగిందన్నారు . కానీ వాస్తవాలు మరోలా ఉన్నాయి.

ఆనందమఠ్ నవలను పూర్తిగా దేశభక్తికి ప్రతీకగా, భారతీయ సమాజానికి ఒక దిక్సూచిగా వ్రాసారు. ఇందులో ఎటువంటి అనుమానాలు లేవు రావు . ఆయన రచనలలోని ప్రతినాయకులు దుర్మార్గులయిన మత మౌఢ్యులు. భారతీయ జాతీయ ఆలోచనకు ఆయన అక్షర రూపాన్ని ఇచ్చారు అంతే . అందుకే బెంగాలీ భాషలో రచించినా ఆ కధ ఆసేతుహిమాచలానికి ఆలోచన కలిగించింది. మాతృభూమి కోసం పోరాటానికి ఒక యుద్ద నినాదాన్ని అందించింది. ఆయనకు ఎలాంటి సెక్యులర్ మొహమాటాలూ లేవు. నిర్మొహమాటంగా ‘నిజాన్ని‘ చెప్పటానికి ఆయన ఏమి తడబడలేదు.  ఆయన వ్రాసిన నవల ఒక కల్పనాత్మక కధ కాబట్టి , ఆ కధలో ఆయన సమాజంలోని ఆలోచనలకు ప్రాణం పోశారు. కొందరు ‘గుమ్మడికాయ దొంగలు’ ఇప్పటికీ వారి బుజాలు తడుముకొని చూసుకుంటే అది బంకించంద్ర కు ఏమి సంబంధం ??.

పందొమ్మిదవ శతాబ్దపు బెంగాలీ సాహిత్య రంగంలో బంకించంద్ర ఒక దిగ్గజం. భారతదేశంలో జాతీయతకు మార్గదర్శకులలో ఒకడు, హిందూ పునరుద్ధరణవాది. ఆంగ్ల విద్య భారతీయులకు ఉపయోగకరమైనది కాదని, భారతీయులు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని ఆయన బలంగా నమ్మారు . బంకించంద్ర రాజకీయ ఆలోచనలో ఈ తన చరిత్రను ఈ జాతి స్వయంగా వ్రాసుకోవాలని, ఆక్రమణదారులు చెప్పేదికాదని బలంగా విశ్వాసించారు . యూరప్ మాదిరిగానే జాతీయవాదం సహాయంతో మాత్రమే భారతదేశం ఎదగడం సాధ్యమవుతుందని ఆయన భావించారు.  సమాజాన్ని మనమే పునర్నిర్మించుకోవాలని ఆయనకు బాగా తెలుసు. యూరోపియన్ జాతీయతా భావనకు, ‘ జాతీయత ‘  అనే భారతీయ భావనకు మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. జాతీయవాదం లేదా దేశభక్తి గురించి బంకిమ్ ఆలోచన ‘ అందరి శ్రేయస్సు ‘ చుట్టూ అల్లుకుని ఉండేది. ‘ప్రతీకరాత్మక‘( సింబోలిక్ ) పాట వందేమాతరంలో ఇంకా ‘ మతం రంగు ‘ పులుముతున్నవారిని ఏమనాలి?