పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లను పరిశీలించడానికి వచ్చిన జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్.హెచ్.ఆర్.సీ) సభ్యులపై మంగళవారం దాడి జరిగింది. రాష్ట్రంలోని జాదవ్‌పూర్‌లో పర్యటిస్తుండగా ఎన్.హెచ్.ఆర్.సి సభ్యులపై ఈ దాడి జరిగింది. దీనిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మానవ హక్కుల పరిరక్షణ నిమిత్తం వచ్చిన తమపై దాడి జరగడంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి చెందిన ఓ అధికారి మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన అల్లర్లను పరిశీలించడానికి వచ్చిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులపై జాదవ్‌పూర్‌లో దాడి జరిగింది. ఇక్కడ 40కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటిని పరిశీస్తున్న క్రమంలో మా పై కొంతమంది గూండాలు దాడికి పాల్పడ్డారు’’ అని తెలిపారు.
రాష్ట్రంలో జరిగిన అల్లర్లను, వాటి పరిణామాలను పరిశీలించడానికి వచ్చిన ఎన్.హెచ్.ఆర్.సి సభ్యులపై దాడి జరగడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు సంబంధించి పరిస్థితులను పరిశీలించడానికి వచ్చిన కేంద్ర మంత్రి వి మురళిధరన్ వాహనంపై కొంత మంది దుండగులు కర్రలతో, రాళ్లతో దాడి చేశారు. అధికారులపై, మంత్రులపై దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో సామాన్య ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.