Home News ద‌ర్భంగ పేలుడు కేసులో హైద‌రాబాద్ కు చెందిన ఇద్ద‌రు అరెస్టు

ద‌ర్భంగ పేలుడు కేసులో హైద‌రాబాద్ కు చెందిన ఇద్ద‌రు అరెస్టు

0
SHARE

బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న పేలుడు మూలాలు హైదరాబాద్‌లో బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి హైద‌రాబాద్ పోలీసులు ఇప్ప‌టికే ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. వివ‌రాల్లోకి వెళితే… జూన్‌ 17న దర్భంగ రైల్వేస్టేషన్‌లోని ఒకటో నంబరు ప్లాట్‌ఫాం వద్ద.. సికింద్రాబాద్‌ నుంచి వచ్చిన రైలులోంచి ఓ వస్త్రాల పార్శిల్‌ను దింపుతుండగా.. పేలుడు సంభవించింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఉగ్రవాద కోణంలో దర్యాప్తు ప్రారంభించింది. ఆ పార్శిల్‌ దర్భంగకు చెందిన మహమ్మద్‌ సూఫియాన్‌ అనే వ్యక్తికి చేరాల్సి ఉన్నట్లు గుర్తించింది. ఈ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌కు చెందిన తండ్రీకొడుకులు మహమ్మద్‌ సలీం ఖాసీం, మహమ్మద్‌ కఫీల్‌ను అరెస్టు చేసింది. వీరిద్దరికీ పాకిస్థాన్‌ నుంచి నిధులు బదిలీ అయినట్లు తేలింది.

పాకిస్థాన్‌కు చెందిన ఇక్బాల్‌ ఖానా అనే వ్యక్తి వీరికి డబ్బు పంపినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఇక్బాల్‌ ద్వారా వీరిద్దరికీ హైదరాబాద్‌లో ఉంటున్న ఇమ్రాన్‌, నాసిర్‌ పరిచయమైనట్లు నిర్ధారించింది. అదే సమయంలో పేలుడుకు కారణమైన వస్త్రాల పార్శిల్‌ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి వచ్చినట్లు గుర్తించింది. దీంతో బిహార్‌ ఏటీఎస్‌ అధికారులు ఓ బృందాన్ని సికింద్రాబాద్‌ కు పంపారు. వారు తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ అధికారులతో కలిసి పలు ఆధారాలను సేకరించారు. జూన్‌15న కారులో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు వచ్చిన ఇద్దరు యువకులు వస్త్రాల పార్శిల్‌ను రైల్వే కౌంటర్‌ వద్ద అందజేసినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. వారిద్దరినీ జూన్ 28న అరెస్టు చేశారు. వారిని ఇమ్రాన్‌, నాసిర్‌ అని, వారిద్దరూ అన్నదమ్ములని గుర్తించారు.

అయితే ఈ బాంబు పేలుడుకు నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తాయిబానే కారణమని ఎన్‌ఐఏ తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు ఆ సంస్థ కుట్ర పన్నిందని, పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం కలింగించేందుకు పథకం వేసిన‌ట్టు ఎన్‌.ఐ.ఏ తెలిపింది. దర్భంగ పేలుడు కేసులో హైదరాబాద్‌కు చెందిన ఇమ్రాన్‌ మాలిక్‌, నాసిర్‌మాలిక్‌ సోదరులే సూత్రధారులని తెలిపింది. బాంబులను తయారు చేయడంలో వారిద్దరూఆరితేరారని, సికింద్రాబాద్‌-దర్భంగ ఎక్స్‌ప్రెస్‌ రైలును పేల్చేందుకు బాంబును తయారు చేశారని వివరించింది. నసీర్‌ మాలిక్‌ 2012లో పాకిస్థాన్‌కు వెళ్లాడని, బాంబు తయారీలో అక్కడే శిక్షణ పొందాడని వెల్లడించింది. సోదరులిద్దరూ లష్కరే నాయకత్వంతో వాట్సాప్‌, టెలిగ్రామ్‌లో తరచూ మాట్లాడేవారని పేర్కొంది. ఇందుకు సంబంధించి మ‌రింత ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్టు అధికారులు తెలిపారు.