ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అధనామ్ గెబ్రెయేసస్ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అక్టోబర్‌లో కరోనా టీకాలను ఎగుమతి చేయనున్నట్లు ప్రకటించినందుకు ఆయన ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని దేశాల్లో 40శాతం టీకాలు వేయాలన్న లక్ష్యానికి చేరుకునేందుకు మద్దతుగా తీసుకున్న నిర్ణయం అత్యంత కీలకమైందన్నారు. ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా.. కరోనా రెండో దశ విజృంభణకు ముందు.. వివిధ దేశాలకు కొవిడ్ టీకాలు అందించి భారత్ అండగా నిలిచింది. రెండోదశలో మహమ్మారి విజృంభణతో టీకాల ఎగుమతిని నిలిపివేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం కరోనా పరిస్థితులు కుదుట పడిన నేపథ్యంలో ప్రపంచ దేశాలకు మళ్లీ టీకాలు అందించాలని నిర్ణయించింది. భారత్‌లో అదనంగా ఉన్న కొవిడ్ టీకాలను ‘వ్యాక్సిన్మైత్రి’ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో విదేశాలకు ఎగుమతి చేస్తామని ఇటీవల ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. తద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేపట్టిన కొవాక్స్ కార్యక్రమంలో భారత్ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఇదిలా ఉండగా.. మంగళవారం వరకు దేశంలో 82కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
Thank you Health Minister @mansukhmandviya for announcing #India will resume crucial #COVID19 vaccine shipments to #COVAX in October. This is an important development in support of reaching the 40% vaccination target in all countries by the end of the year. #VaccinEquity
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) September 21, 2021