కార్యకర్తల ఐక్యతతో కూడిన శ్రమతోనే చక్కటి ఫలితాలు సాకారం అవుతాయని విద్యా భారతి అఖిల భారత సంఘటనా కార్యదర్శి మాన్యశ్రీ కాశీపతి అభిప్రాయ పడ్డారు. శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సమావేశం హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శారదాధామంలో జరిగింది. ఈ ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెండు సంవత్సరాల కాలంలో కోవిడ్ కారణంగా సమాజంలో సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన విశ్లేషించారు. సమాజ బాధ్యత నిర్వహిస్తున్న మన అందరి మీద గట్టి ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. అయితే దీనిని కూడా సకారాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని కాశీపతి పేర్కొన్నారు. చక్కటి కార్యకర్తల బృందమే మనకు కొండంత అండ అని ఆయన వివరించారు. చక్కటి స్నేహం, సకారాత్మక యోజన, శ్రమించే తత్వంతో సమస్యలను అధిగమించి ముందుకు వెళ్లగలుగుతామని వివరించారు. ఏక రూప మనస్సుతో, ఐక్యతతో కూడిన శ్రమతో విజయాలు సాధించగలుగుతామని ఆయన అన్నారు.
మరో అతిథిగా విచ్చేసిన విద్యాభారతి దక్షిణమధ్యక్షేత్రం అధ్యక్షులు డాక్టర్ చామర్తి ఉమామహేశ్వరరావు ఐ ఎ ఎస్ (రిటైర్డ్) మాట్లాడుతూ…. విద్యాత్మక నిర్ణయాల విషయంలో జాతీయ విద్యా విధానం ను గుర్తెరిగి వ్యవహరించాలని కోరారు. దేశమంతటా అమలు కాబోతున్న ఈ విధానం గురించి సమగ్ర అవగాహనతో మెలగాలని సూచించారు. క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఆయా ప్రాంతాల్లోని పాఠశాలల మధ్య మన పాఠశాలలు మెరుగైన స్థితిలో నిలవాలని అభిలషించారు. విలువలు కూడిన విద్య కోసం సమాజం విద్యా భారతి వైపే చూస్తోందని ఆయన వివరించారు. తెలంగాణ ప్రాంత అధ్యక్షులు ప్రొఫెసర్ తిరుపతి రావు, కార్యదర్శి ముక్కాల సీతారాములు, సంఘటన కార్యదర్శి పతకమూరి శ్రీనివాస్, క్షేత్ర శైక్షణిక్ ప్రముఖ్ సూర్యనారాయణ, ఇతర పెద్దలు కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ప్రాంతంలోని వివిధ విభాగ్ లకు చెందిన బాధ్యులు, అంశాల వారీ ప్రముఖ్ లు ఇందులో పాల్గొన్నారు.